close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఖర్చు చేసేద్దాం!

దేశంలో వినియోగం కొత్త పుంతలు
2030 నాటికి ఖర్చు 4 రెట్లు పెరుగుదల

దేశంలో వినియోగం కొత్త పుంతలు తొక్కుతోంది. భారతీయుడి వినియోగపు అలవాట్లు శరవేగంగా మారిపోతున్నాయి. ఆదాయాల పెరుగుదల దీనికో ప్రధాన కారణమైతే... ఉన్నప్పుడే ఖర్చుపెట్టేద్దామనే ధోరణి పెచ్చుమీరడం, మనుషుల అభిరుచులు మారడం, యువతరం ఆలోచనల సరళి మరికొన్ని కారణాలు. భవిష్యత్తు కోసం దాచుకుందాం అనే పాతకాలపు ధోరణి నుంచి నెమ్మదిగా పక్కకు జరుగుతూ.. ఖర్చుపెట్టడానికే జనం ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 2030 నాటికి దేశంలో వినియోగ వ్యయం నాలుగురెట్లు పెరుగుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్‌), బెయిన్‌ అండ్‌ కంపెనీ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయింది.

అన్ని చోట్లా వినియోగమే

2030 నాటికి దేశంలో మరో 14 కోట్ల కుటుంబాలు మధ్యాదాయ, 2 కోట్ల కుటుంబాలు ఉన్నతాదాయ వర్గంలోకి మారబోతున్నాయి. వీరు ఆహారం, పానీయాలు, దుస్తులు, ఎలెక్ట్రానిక్‌ పరికరాలు, రవాణా, గృహాలపై రెండు నుంచి రెండున్నర రెట్లు ఎక్కువగా వెచ్చిస్తారు. అలాగే ఆరోగ్యం, విద్య, వినోదం, గృహోపకరణాలపై మూడు నుంచి నాలుగురెట్లు ఎక్కువగా వ్యయంచేస్తారు. ఎగువ మధ్యతరగతి, ఉన్నతాదాయ వర్గాల వారు వాషింగ్‌మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు, వ్యక్తిగత వాహనాల్లాంటి వాటిపై 15 నుంచి 20 శాతం ఎక్కువగా ఖర్చుచేస్తారు.

నవతరం ప్రాధాన్యతలే కీలకం

సహస్రాబ్ది బిడ్డలు(మిలీనియల్స్‌), జనరేషన్‌ జెడ్‌ ప్రాధాన్యతలు వినియోగ మార్కెట్‌ స్వరూప స్వభావాల్ని సమూలంగా మార్చేయనున్నాయి. 1980ల తర్వాత జన్మించిన వారు 2030 నాటికి దేశంలో 77% మంది ఉండనున్నారు. ఈ తరం వినియోగదారులు తమ మునుపటివారికన్నా మరిన్ని వస్తు, సేవలవైపు మొగ్గుచూపుతారు. అయితే ప్రతి వస్తువునూ కొనేముందు అందులో ఉత్తమమైన వాటిని ఎంచుకోవడానికే ప్రయత్నిస్తారు. తమకు, తమ కుటుంబాలకు ఎలాంటివి అవసరమో గుర్తెరిగి కొంటారు కాబట్టి.. వినియోగ మార్కెట్‌ రూపురేఖలు మారతాయి.

ఆదాయాల పెరుగుదల

దేశంలో ఎగువ మధ్యతరగతి, ఉన్నతాదాయ వర్గాల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం వినియోగ మార్కెట్‌ విస్తృతికి ప్రధాన కారణం. ప్రస్తుతం దేశంలోని ప్రతి నాలుగు కుటుంబాల్లో ఒకటి ఇలాంటిది ఉంటే.. 2030 నాటికి ప్రతి రెండు కుటుంబాల్లో ఒకటి ఉంటుందని అంచనా. వ్యక్తుల వ్యక్తిగత ఆదాయాల పెరుగుదల వల్ల దిగువ మధ్యతరగతి వినియోగపు అభిరుచులు సైతం విపరీతంగా మారిపోతున్నాయి. ప్రాధాన్యతలకు పట్టం కడుతున్నారు. దేశంలోని కోట్ల మంది యువత రాబోయే దశాబ్ద కాలంలో మొదటిసారి వినియోగదారులుగా మారబోతున్నారు. దీనికి నాలుగో పారిశ్రామిక విప్లవం తోడై దేశంలో వినియోగ స్వరూపమే సమూలంగా మారబోతోంది.

మధ్య తరగతి మహాభారతం

2030 నాటికి అచ్చంగా మధ్యతరగతి నిర్వహించే ఆర్థిక వ్యవస్థగా భారత్‌ మారబోతోంది. రాబోయే 11 ఏళ్లలో దేశంలోని 80 శాతం కుటుంబాలు మధ్యాదాయ వర్గంగా మారతాయి. ప్రస్తుతం ఇవి 50% కుటుంబాలే. 2030 నాటికి దాదాపు 75% వినియోగ వ్యయం మధ్యతరగతి వారిదే ఉంటుంది.

పట్నం, పల్లె తేడా లేదు

వినియోగదారుల అభిరుచులు గణనీయంగా మారుతున్నాయి. దీనికి పట్నం, పల్లె అన్న తేడా లేదు. 40 పెద్ద నగరాలు తప్ప... చిన్న పట్టణాలు, గ్రామీణుల ఆదాయ స్వరూపాల్లో పెద్దగా మార్పులేదు. ఒక నిర్దిష్ట ఆదాయ స్థాయిలో ఇరువురూ ఒకే తరహా జీవితాన్ని గడుపుతున్నారు. ఒకే రకం వస్తువులు కొంటున్నారు. సాంకేతిక ఆధార వినియోగం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మరింత వినియోగం పెరగకుండా అధ్వాన్న రోడ్లు, విద్యుత్తు, అరకొర ఆర్థిక సేవల్లాంటివి అడ్డంకిగా ఉంటున్నాయి.

డిజిటల్‌ ప్రభావం తప్పదు

వినియోగ ప్రాధాన్యతలపై ‘అనుసంధానత’ గణనీయ ప్రభావం చూపుతోంది. డిజిటల్‌తో అనుసంధానమై ఉన్న అన్ని ఆదాయ వర్గాల్లోని 50 నుంచి 70 శాతం మంది ప్రస్తుతం వస్తువుల గురించి శోధించడానికి డిజిటల్‌ ప్లాట్‌ఫాంలను వినియోగిస్తున్నారు. 2030 నాటికి దాదాపు 40 శాతానికి పైగా అన్ని కొనుగోళ్లు డిజిటల్‌పైనే ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం ఇది 20-22 శాతమే. భవిష్యత్తులో డిజిటల్‌ మీడియా, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలకు వినియోగదారుడు ఎంతవరకు అనుసంధానమై ఉన్నాడనేది కొనుగోలు ప్రాధాన్యతలను నిర్ణయిస్తుంది.

అంతా కొనుగోళ్లకే..

పెరిగే ఆదాయంలో దాదాపు సగం మొత్తాన్ని మరికొన్ని వస్తువులు కొనడానికి వినియోగదారులు వెచ్చిస్తారు. మిగతా సగాన్ని ఇప్పుడు వినియోగించేవి కాకుండా కొత్తవాటిని సొంతం చేసుకోవడానికి వినియోగిస్తారు. సేంద్రీయ ఆహారం, సరికొత్త చర్మ సంరక్షణ ఉత్పత్తులు, అధునాతన వస్త్రాలు, సెల్‌ఫోన్లు, డేటా ప్యాక్‌లు, గాడ్జెట్లపై వెచ్చిస్తారు.

డబ్బుకు తగిన వస్తువులు

పెట్టే డబ్బుకు తగినట్లుగా వస్తువులు ఉండాలని కోరుకునే వినియోగదారులు ఎక్కువ. ఈ వేట ఎక్కువగా సాగుతుంది కాబట్టి ఈ కామర్స్‌ వృద్ధి జరుగుతుంది. 2030 నాటికి ఈ తరహా వినియోగం మరింత పెరుగుతుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.