close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఏమైపోతున్నారు?

తొమ్మిది రోజుల్లో 545 మంది అదృశ్యం
సగటున రోజుకు 60 మంది మాయం
సగం మంది రాజధాని పరిసరాల్లోనివారే
నానాటికీ పెరిగిపోతున్న అదృశ్యం కేసులు
పిల్లలే కాదు, మధ్యవయస్కులు, వృద్ధులూ కనిపించకుండా పోతున్నారు
పోలీసుల స్పందన అంతంతమాత్రమే
ఈనాడు - హైదరాబాద్‌

కశ్మీర్‌లోని కథువా నుంచి రాష్ట్రంలోని హాజీపూర్‌ వరకు ఒకటే విషాదం.. ఆడపిల్లల అదృశ్యం.. పోలీసుల నిర్లక్ష్యం.. ఆపై వెలుగులోకి వచ్చిన అత్యాచారం.. హత్యలు.. ఒకటి దేశాన్ని కుదిపేసిన ఉదంతమైతే.. రెండోది మన రాష్ట్రాన్ని కలవరపరచిన దుర్ఘటన. ఈ రెండు కేసుల్లోనూ పోలీసుల తీరు ఒక్కలాగే ఉండడం గమనార్హం. పిల్లల అదృశ్యంపై తల్లిదండ్రులు ఫిర్యాదుచేసినా సరైన రీతిలో స్పందించకపోవడం. ఫలితంగా పసిమొగ్గలు హృదయవిదారక పరిస్థితుల్లో నేల రాలిపోయారు.. అంతేకాదు ప్రస్తుతం రాష్ట్రంలో సగటున రోజుకు 60 మంది వరకు అదృశ్యమైపోతున్నారు. వీటన్నింటి విషయంలోనూ పోలీసు స్పందన అంతంతమాత్రమే. హాజీపూర్‌ ఉదంతం బయటపడిన తర్వాత మూలన పడేసిన అదృశ్యం కేసులను దుమ్ముదులిపి వెలికి తీసిన పోలీసులు పరిస్థితి సద్దుమణగగానే మళ్లీ పక్కనపెట్టేశారు. దీంతో రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న అదృశ్యం కేసులు హడలెత్తిస్తున్నాయి. ఈనెలలో 9వ తేదీ వరకూ 545 మంది కనిపించకుండాపోయారు. ఇవి పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులు మాత్రమే. వీరిలో సగంమందికిపైగా రాజదాని పరిసరాలకు చెందిన వారే కావడం గమనార్హం. ఇంతమంది ఎందుకు అదృశ్యమవుతున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇది బాధితుల కుటుంబ సభ్యులనే కాదు పోలీసులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది.

కుటుంబంలో ఎవరైనా ఒక సభ్యుడు కనిపించకుండా పోతే ఆ కుటుంబం పడే బాధ వర్ణనాతీతం. అలా తప్పిపోయింది చిన్నపిల్లలయితే పరిస్థితి మరింత దయనీయం. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో రోజుకు సగటున 60 కుటుంబాలు ఇంట్లో ఎవరోకరి అదృశ్యంతో తల్లడిల్లుతున్నాయి. పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతూ తమవారిని వెతికి పెట్టమని ప్రాధేయపడుతున్నాయి. అదృశ్యమవుతున్నవారిలో రెండేళ్ల పసిపిల్లల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకూ ఉంటున్నారు. 18 నుంచి 40 ఏళ్ల వయసువారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి హతమార్చిన హజీపూర్‌ ఉదంతం ఇంకా మరుగునపడకముందే పెరిగిపోతున్న అదృశ్యం కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.
* జూన్‌ నెల మొదటి తొమ్మిది రోజుల్లో రాష్ట్రంలో 545 మంది అదృశ్యమైనట్లు కేసులు నమోదయ్యాయి. నమోదు కాని కేసులు మరికొన్నయినా ఉంటాయని అంచనా.
* ఇందులో హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లు అంటే రాజధాని పరిధిలోనే 296 మంది కనిపించకుండా పోయారు.
* ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో సగటున అదృశ్యమతున్న వారి సంఖ్య రోజుకు 45కి మించలేదు. కాని మే నెల నుంచి ఇది పెరుగుతూ వస్తూ ఇప్పుడు రోజుకు 60కి చేరింది.

పోలీసుల అరకొర స్పందన
అదృశ్యం కేసులలో పోలీసుల స్పందన అరకొరగానే ఉంటోంది. ఏవో కొన్ని కేసులలో తప్ప చాలావరకూ ఒకటి రెండురోజులు దర్యాప్తు చేసి ఆ తర్వాత పక్కనపెట్టేస్తున్నారు. దాంతో ఒక్కోసారి బాధితుల తల్లిదండ్రులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇందుకు భువనగిరి జిల్లా హాజీపూర్‌ ఉదంతమే నిదర్శనం. శ్రీనివాసరెడ్డి అనే హంతకుడు ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి హతమార్చి బావిలో పూడ్చిపెట్టిన ఉదంతం ఇటీవల సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తమ కుమార్తె కల్పన కనిపించడంలేదని 2015 ఏప్రిల్‌ 23న తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడే పోలీసులు సరిగా స్పందించి ఉంటే హంతకుడు శ్రీనివాసరెడ్డి దొరికేవాడు, ఆ తర్వాత జరిగిన మనీషా, శ్రావణిల హత్యలకు ఆస్కారమే ఉండేది కాదు. కానీ పోలీసులు అన్ని అదృశ్యం కేసులనూ ఒకేగాటన కడుతుండటం తల్లిదండ్రులకు శాపంలా మారుతోంది. గత ఏప్రిల్‌లో హాజీపూర్‌లో అద్యశ్యమైన శ్రావణి కేసులో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. చివరకు గ్రామస్థులే బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. ఇక తప్పిపోయిన వారు యుక్తవయసు వారయితే ప్రేమవ్యవహారాల కారణంగానే వెళ్లిపోయినట్లు భావిస్తూ అసలు పట్టించుకోవడంలేదు.

వేదన... అరణ్యరోదన...

అదృశ్యమవుతున్న వారి కుటుంబ సభ్యులు పడుతున్న బాధ వర్ణనాతీతం. తప్పిపోయినవారు చిన్నపిల్లలయితే పరిస్థితి మరింత దయనీయం. ఎక్కడున్నారో తెలియదు. ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు, అసలు తిరిగి వస్తారో, రారో కూడా తెలియదు. అలికిడైతే చాలు వాకిట్లోకి తొంగిచూస్తూ.. పట్టించుకోకపోయినా క్రమం తప్పకుండా పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతూ నిత్యం నరకం అనుభవిస్తుంటారు. వీరికి ఉపశమనం కలగాలంటే పోలీసులు అదృశ్యం కేసులపై మరింత శ్రద్ధ కనబరచాలి. ఒకవేళ కనిపించకుండా పోవడానికి ప్రేమ వ్యవహారమే కారణమైనప్పటికీ కనీసం వారి ఆచూకీ తెలుసుకొని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలి. తద్వారా తమ వారు ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉన్నారనే భరోసా అయినా ఉంటుంది. కాని పోలీసులు వీటిని పెద్దగా పట్టించుకోవడంలేదు. 

ఎందుకు అదృశ్యమవుతున్నారు?

*పరీక్ష ఫలితాల వెల్లడి సమయంలో ఎక్కువగా మిస్సింగ్‌ కేసులు నమోదవుతుంటాయి. ఇలా వెళ్లిన పిల్లల్లో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా తిరిగి వచ్చేస్తుంటారు.
* ప్రేమ వ్యవహారాలు మరో కారణం. మిస్సింగ్‌ కేసులలో ఎక్కువశాతం ఇలాంటివే ఉంటున్నాయి. 
* కొందరు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులమీద అలిగి వెళ్లిపోతుంటారు. 
* మధ్యవయసు వారయితే అప్పులు, ఇతర ఆర్థిక కారణాల వల్ల ఎవరికి చెప్పకుండా వెళ్లిపోతున్నారు. 
* పిల్లలు తమను సరిగా చూడటంలేదని వెళ్లిపోతున్న వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోంది. 
* ఇవన్నీ ఒక ఎత్తయితే అపహరణ ముఠాలు మరో ఎత్తు. అదృశ్యమైన తర్వాత తిరిగి రాని పిల్లలు, యుక్తవయసు బాలికలు వీరి బారిన పడి ఉండటానికి అవకాశం ఉంది. వీరు ప్రధానంగా బాలికలను అపహరిస్తుంటారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.