close

ప్ర‌త్యేక క‌థ‌నం

పట్టువదలని విక్రమార్కులు

ఎంబీబీఎస్‌ సీటే లక్ష్యంగా ఏడాది ప్రత్యేక శిక్షణ
తొలి ప్రయత్నంలో పొందేది 60శాతం
  దీర్ఘకాల శిక్షణలో 40శాతం సీట్ల సాధన
రుసుముల్లో రాయితీలిస్తున్న విద్యాసంస్థలు
ఈనాడు - అమరావతి

వైద్య విద్యలో సీటు సాధించేందుకు కొందరు విద్యార్థులు పట్టువదలని విక్రమార్కుల్లా కృషి చేస్తున్నారు. మొదటిసారి సీటు దక్కకుంటే.. మరో సంవత్సరాన్ని త్యాగం చేయడానికి  వెనుకాడటం లేదు. తొలి ప్రయత్నంలో విద్యార్థులకు వచ్చిన ర్యాంకులను అనుసరించి పలు కార్పొరేట్‌ విద్యా సంస్థలు ‘లాంగ్‌ టర్మ్‌’ కింద ప్రత్యేక రాయితీలు ఇస్తున్నాయి. ఎక్కువ ర్యాంకులు తమ విద్యా సంస్థలకే వచ్చాయంటూ ఆయా విద్యా సంస్థలు ప్రచారం చేసుకుంటూ ప్రయోజనం పొందుతున్నాయి. దీర్ఘకాలిక శిక్షణ తీసుకొనే వారిలో బాలురకంటే బాలికల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. ఇంటర్‌ విద్యతోపాటు ఎంబీబీఎస్‌లో సీటు సాధన కోసం ప్రయత్నించి ఉత్తమ ర్యాంకులు సాధించే విద్యార్థులు 60% మంది ఉంటుండగా మిగిలిన వారు ద్వితీయ ప్రయత్నంలో సీటు సాధిస్తున్నారు. అతికొద్ది మంది మాత్రమే పట్టుదలతో మూడో ప్రయత్నంలోనూ సీటు పొందుతున్నారు.
ఇంజినీరింగ్‌లో తగ్గిన లాంగ్‌టర్మ్‌..
ఎంపీసీ విద్యార్థులకు పోటీ పరీక్షల్లో వచ్చిన ర్యాంకులను అనుసరించి రకరకాల కోర్సుల్లో చదివేందుకు అవకాశాలున్నాయి. దీనివల్ల లాంగ్‌టర్మ్‌ ప్రభావం ఇంజినీరింగ్‌ విద్యలో తగ్గింది. ఎన్‌ఐటీ, ఐఐటీ సీట్ల కోసం మాత్రమే పలువురు విద్యార్థులు అదనంగా ఏడాదిపాటు శిక్షణ పొందుతున్నారు. ఎంసెట్‌ ద్వారా ఇంజినీరింగ్‌లో సీటు సాధించేందుకు గతంలో ఉన్న ‘లాంగ్‌టర్మ్‌’ శిక్షణ తీసుకుంటున్న వారు ఇప్పుడు అసలు కనిపించడంలేదు.
వైద్య విద్యలో పోటీ తీవ్రంగా ఉండటంతో..
దీర్ఘకాల శిక్షణ తీసుకునే ధోరణి వైద్య విద్యలో ఎక్కువగా ఉంది. సీట్లు తక్కువగా ఉండడం, పోటీ తీవ్రంగా ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది. తల్లిదండ్రులు లేదా దగ్గరి బంధువులు వైద్యులై ఉండడం..కొందరి తల్లిదండ్రుల ఆకాంక్ష, స్వతహాగా డాక్టరు కావాలనే సంకల్పంతో ఇంటర్‌ బైపీసీలో చేరుతున్నారు.
కొందరికి నామమాత్రపు ఫీజులు తీసుకుని..
తొలి ప్రయత్నంలో ఉత్తమ ర్యాంకులు వచ్చినా..సీట్లు పొందడంలో వెనుకబడిన విద్యార్థులను విద్యా సంస్థలు సంప్రదిస్తున్నాయి. ద్వితీయ ప్రయత్నంలో ర్యాంకు వస్తోందని భరోసా ఇస్తున్నాయి. విద్యార్థుల ఆర్థిక పరిస్థితులు, ఇతర అంశాలు పరిగణనలోకి తీసుకుని  పలువురికి ఫీజులో రాయితీలు ఇస్తున్నాయి. లాంగ్‌ టర్మ్‌లో ఇంటర్‌ విద్యతో సంబంధం లేనందున..సబ్జెక్టులపై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు విద్యార్థులు కృషి చేస్తున్నారు. బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలలో కనీసం ఏదో ఒక సబ్జెక్టులో మంచి పట్టు ఉంటే.. సన్నద్ధత ద్వారా మిగిలిన రెండు సబ్జెక్టుల్లో పట్టు సాధించేందుకు అవకాశం ఉంటుందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు.
నీట్‌-2019కు 39,039 మంది అర్హత
ఏపీ నుంచి 57,798 మంది విద్యార్థులు నీట్‌-2019కు దరఖాస్తు చేయగా..55,200 మంది పరీక్ష రాశారు.. 39,039 మంది అర్హత సాధించారు. రాష్ట్రంలో 12 ప్రభుత్వ, 18 ప్రైవేట్‌ వైద్య కళాశాలలు (ఎంబీబీఎస్‌) ఉన్నాయి. వాటిల్లో 4,500 యూజీ సీట్లు ఉన్నాయి. దంత వైద్య విద్యలో రెండు ప్రభుత్వ, 15 ప్రైవేట్‌ కళాశాలలు ఉన్నాయి. వాటిలో 1580 (140+1440) సీట్లు ఉన్నాయి. ఆయుర్వేద, హోమియో వైద్య కళాశాలలు ఉన్నా..సీట్లు పరిమితంగా ఉన్నాయి. పశువైద్య విద్యలో 200 సీట్లకు గానూ 13 వేల మంది పోటీపడుతున్నారు.
లోపాలను సరిదిద్దుకోవడంతో..
ఓ విద్యార్థినికి తొలి ప్రయత్నంలో నీట్‌లో 1400  ర్యాంకు రాగా...ద్వితీయ ప్రయత్నంలో 250 ర్యాంకు వచ్చింది. ఏడాదిపాటు తీసుకున్న శిక్షణలో.. తొలి ప్రయత్నంలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు సాగడడంతో ఉత్తమ ర్యాంకు వచ్చిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. అమ్మాయిల వయసును కూడా తల్లిదండ్రులు పరిగణనలోకి తీసుకోవడంలేదు. వారి లక్ష్యం తమ పిల్లలు ఎంబీబీఎస్‌లో సీటు సాధించడమే. తొలి ప్రయత్నంలో సీట్లు రాని వారు వ్యక్తిగత కారణాలు, ఆర్థిక సమస్యలవల్ల దంత, ఆయుర్వేద, హోమియో వైద్య విద్యలో ప్రవేశాలు పొందుతున్నారు. కొద్దిమంది అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ, బీవీఎస్సీ, ఇతర కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారు. ఐదు శాతం మంది మాత్రమే ఎంబీబీఎస్‌ సీటు కోసం మూడోసారి  ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.