close

ప్ర‌త్యేక క‌థ‌నం

పుడమికి కడలి కాటు

రాష్ట్రంలో 26 ఏళ్లలో 44.83 చ.కిమీ నేల సముద్రం పాలు 
పశ్చిమబెంగాల్‌ తర్వాత రెండో స్థానంలో ఏపీ 
దేశవ్యాప్తంగా గత 26 ఏళ్లలో 234.25 చ.కిమీ భూమి జలమయం

అభివృద్ధి పేరుతో మితిమీరిన మానవ చర్యలు పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పెరుగుతున్న భూతాపం, ఇతర చర్యలు సముద్ర నీటిమట్టాన్ని పెంచుతున్నాయి. ఫలితంగా సముద్రుడు గట్టు దాటుతున్నాడు. తీరాన్ని కోతకు గురిచేస్తూ.. పలుచోట్ల ఊళ్లు, రహదారుల్ని తనలో కలిపేసుకుంటున్నాడు. మరికొన్నిచోట్ల ఇసుక మేటలతో వెనక్కు వెళుతున్నాడు. నైరుతి రుతుపవనాల సమయంలో దక్షిణం నుంచి ఉత్తర దిశకు వీచే గాలుల కారణంగా.. సముద్రంలో ఇసుక కోతకు గురై ఉత్తర దిక్కుకు ప్రవహిస్తుంది. ఈశాన్య రుతుపవనాల సమయంలో మళ్లీ వెనక్కు వస్తుంది. ఇలాంటి ఇసుక సహజ ప్రవాహాలకు నౌకాశ్రయాలు, జెట్టీలు అడ్డుగా మారుతున్నాయి. అలానే నదులపై పెరుగుతున్న డ్యామ్‌ల వల్ల సముద్రంలో కలిసే ఇసుక తగ్గిపోతోంది. ఆయా కారణాలతో గత 26 ఏళ్లలో రాష్ట్రంలో 44.83 చ.కిమీ తీర భూమి సంద్రంలో కలిసిపోయింది. అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 99.05 చ.కిమీ మేర భూమి మునిగిపోయింది. ఆ తర్వాత స్థానం మన రాష్ట్రానిదే. విశాఖపట్నంలో సముద్రం సంవత్సరానికి రెండు అడుగులు ముందుకు వస్తుండడం తీవ్రతను కళ్లకు కడుతోంది.  మన రాష్ట్రంలోనే కాదు.. మొత్తం తూర్పు, పశ్చిమ తీరాల్లో ఇదే పరిస్థితి. ఇప్పటికైనా కళ్లు తెరవకుంటే రాబోయే రోజుల్లో సముద్రుడి ఆగ్రహాన్ని.. జల ప్రళయాన్ని చూడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

మానవ ప్రమేయం ఇలా.. 
*  నైరుతి రుతుపవనాల సమయంలో గాలులు దక్షిణం నుంచి ఉత్తర దిశకు వీస్తాయి. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు అలల ఎత్తు పెరుగుతుంది. ఇందులో కరెంటు కారణంగా ఇసుక కోతకు గురై ఉత్తర దిక్కుకు ప్రవహిస్తుంది. 
*  ఈశాన్య రుతుపవనాల సమయంలో గాలులు ఉత్తరం నుంచి దక్షిణానికి వీస్తాయి. అంటే అక్టోబరు నుంచి ఫిబ్రవరి మధ్య అలల ఎత్తు తక్కువగా ఉంటుంది. నైరుతి రుతుపవనాల సమయంలో ఉత్తర దిక్కుకు వెళ్లిన ఇసుక వెనక్కు వస్తుంది. 
*  తీరంలో నిర్మించే నౌకాశ్రయాలు, జెట్టీలు కూడా కోతకు కారణమవుతున్నాయి. దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్లిన ఇసుక తిరిగి వెనక్కి రావాలంటే మధ్యలో ఉండే ఇవి అడ్డుపడుతున్నాయి. తూర్పు తీరంలోని అన్ని పోర్టుల్లో ఇదే పరిస్థితి ఉంది. దక్షిణ ప్రాంతంలోని ఇసుకను ఉత్తరానికి పంప్‌ చేయాల్సిన బాధ్యత పోర్టులు తీసుకుంటే కొంతమేర పరిష్కారం లభిస్తుంది. విశాఖపట్నంలో ఈ మధ్య దీన్ని ఆచరిస్తున్నారు.

నదుల నుంచి తగ్గిపోతున్న ఇసుక 
* ఇసుక అనేది సముద్రంలో ఉత్పత్తి కాదు. వరదల రూపంలో నదుల నుంచి వచ్చే నీటితో కలిసి సముద్రంలోకి చేరుతుంది. తూర్పు తీరంలో నదుల సంఖ్య ఎక్కువే. అయితే కొన్నేళ్లుగా నదులపై ఆనకట్టలు పెరిగాయి. వచ్చే ఇసుకంతా అక్కడే మేట వేస్తోంది. వర్షపాతం తగ్గిపోవడం వల్ల వరదలు తగ్గిపోవడమూ మరో కారణం. 
* తుపాను సమయాల్లో తరచూ తీరం కోతకు గురవుతోంది. అలానే సహజ రక్షణ కవచాలైన మడ అడవులు అంతరించిపోవడం, బీచ్‌శాండ్‌ను ఇష్టారాజ్యంగా తవ్వడం నష్టాన్ని కలిగిస్తున్నాయి.

రాష్ట్రస్థాయిలో  మరిన్ని పరిశోధనలు చేయాలి 
వాతావరణ మార్పుల నేపథ్యంలో విపత్తుల తీవ్రత పెరుగుతోంది.  ముప్పును ఎప్పటికప్పుడు పసిగట్టడంతో పాటు తీర రక్షణకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. సున్నిత ప్రాంతాలను గుర్తించి అక్కడ పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలని సూచిస్తున్నారు.

సముద్ర నీటిమట్టం పెరుగుదల.. ప్రభావం 
*  సముద్ర నీటిమట్టం ఏడాదికి 1 మిమీ పెరిగితే ఏడాదికి 0.5 మీటర్ల మేర భూమి జలమయం అవుతుంది. 
*  భూతాపం పెరుగుదల కారణంగా సముద్ర నీటిమట్టం ఏడాదికి 1.5 నుంచి 10 మిమీ వరకు పెరుగుతోంది. గత శతాబ్దంలో సముద్ర నీటిమట్టం 40 సెంమీ పెరిగింది. ఇది మరింత తీవ్రరూపం దాలుస్తోంది. 2100 సంవత్సరం నాటికి 1 నుంచి 4 అడుగుల మేర పెరిగే అవకాశం ఉంది. గరిష్ఠంగా 8 అడుగులు పెరిగే అవకాశాలూ ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
*  ఉపరితల ఉష్ణోగ్రతలు ఏడాదికి ఒక డిగ్రీ చొప్పున పెరుగుతున్నాయని వాతావరణ నివేదిక తెలియజేస్తోంది. మూడేళ్లుగా ఇది మరింత పెరుగుతోంది. 
*  సముద్ర నీటిమట్టం ఇలాగే పెరిగితే శతాబ్దాంతానికి 17.9 లక్షల చదరపు కిలోమీటర్ల భూమిని కోల్పోతామని పరిశోధకుల అంచనా. ఇందులో ఉపయోగకరమైన సాగు భూమి కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 128 కోట్ల మంది ప్రజలు ప్రభావితమయ్యే అవకాశముందని యూఎస్‌ గ్లోబల్‌ రీసెర్చి ప్రోగ్రామ్‌ అధ్యయనం వెల్లడిస్తోంది.

 


నిరంతర అధ్యయనం అవసరం 
- ఎంవీ రమణమూర్తి, డైరెక్టర్‌, ఎన్‌సీసీఆర్‌, చెన్నై 

ప్రస్తుతం విశాఖపట్నంలో తీరప్రాంత నిర్వహణ విధానం అమలు చేస్తున్నాం. కోతకు గురయ్యే అన్ని ప్రాంతాల్లోనూ ఇలా ప్రత్యేక విధానాలు రూపొందించి అమలు చేయాలి. నిరంతర అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. తీరం మొత్తంగా కాకుండా జిల్లా కేంద్రంగా అధ్యయనాలు చేయాలి. సూచనలు అమలు చేయాలి.


జియోట్యూబ్‌ విధానం బాగు 
- డాక్టర్‌ కేవీఎస్‌ఆర్‌ ప్రసాద్‌, తీర ప్రాంత పరిశోధకులు, విశ్రాంత ఆచార్యులు, ఏయూ 

పెద్ద ట్యూబ్‌లో ఇసుక నింపి తీరం వెంట పరిచే జియోట్యూబ్‌ విధానంలో ఉప్పాడలో కోతను నివారించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి చర్యలు తూర్పుతీరానికి అనుకూలంగా ఉంటాయి. విశాఖపట్నం నౌకాశ్రయ ఆధ్వర్యంలో దక్షిణం నుంచి ఉత్తరానికి ఇసుక తోడిపోస్తున్నారు. మిగిలిన పోర్టుల్లోనూ ఈ ప్రక్రియ అవలంబించాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో సబ్‌మెర్జ్‌డ్‌ బ్రేక్‌ వాటర్స్‌ అనే విధానం ద్వారా ప్రవాహ తీవ్రత (కరంట్‌)ను తగ్గించే చర్యలు పాటిస్తున్నారు. తీరాన్ని రక్షించేందుకు పాండిచ్చేరి, ముంబయిలో గోడలు కట్టారు. ఇలా చేస్తే అక్కడ బీచ్‌ అనేది ఉండదు. కొన్నిచోట్ల రాళ్లతో గ్రోయిన్స్‌ నిర్మిస్తున్నారు. ఇది మన తీరానికి అనువైనది కాదు.


చెక్‌డ్యామ్‌ ఉప్పునీటితో నిండిపోయింది 
-
చప్పిడి వెంకట శేషయ్య, ఉలిచి, ప్రకాశం జిల్లా 

2016లో సముద్రం నీరు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెక్‌డ్యామ్‌ను ముంచెత్తింది. దీంతో ఉప్పునీటిని తోడిపోయడానికి నాలుగైదు రోజులు కష్టపడ్డాం. మోటార్లతో తోడిపోసుకున్నాం. చెక్‌డ్యామ్‌ ఎత్తు పెంచేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరాం.


కడలిలో కలిసిన శివాలయం, ఇళ్లు 
- దుమ్ము దాసు, ఉప్పాడ, తూగో జిల్లా 

10-15 ఏళ్ల కిందట ఉప్పాడ బీచ్‌.. రహదారికి అరకిలోమీటరు దూరంలో ఉండేది. రాను రాను సముద్రం ముందుకు రావడంతో తీరానికి దగ్గర్లో ఉన్న శివాలయం, ఇళ్లు కెరటాల ధాటికి కడలిలో కలిసిపోయాయి. జియోట్యూబ్‌ వేశాక పదేళ్ల పాటు నష్టం తగ్గింది. ఇప్పుడది దెబ్బతినడంతో కెరటాలు మళ్లీ ముందుకొస్తున్నాయి. తీరం కోతకు గురవుతోంది. ట్యూబ్‌కు మరమ్మతులు చేయాలి. కోనపాపపేటలోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడ జియో ట్యూబ్‌ కూడా లేదు.


విశాఖపట్నంలో కేంద్రం..  పునాది రాయికే పరిమితం 
ఎన్‌సీసీఆర్‌ (కోస్తా తీర ప్రాంత అధ్యయన కేంద్రం) ఆధ్వర్యంలో తీరప్రాంత పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నారు. దీని ప్రధాన కేంద్రం చెన్నైలో ఉంది. విశాఖపట్నంలో కేంద్రం ఏర్పాటు చేసేందుకు గతేడాది చర్యలు ప్రారంభించారు. శంకుస్థాపన జరిగినా నిధుల్లేకపోవడంతో పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది.

- ఈనాడు, అమరావతి

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.