close

ప్ర‌త్యేక క‌థ‌నం

పరిషత్‌లకు పూర్వవైభవం తథ్యం

స్థానిక సంస్థల రాబడుల పెంపునకు మార్గాల అన్వేషణ
పలు రాష్ట్రాల్లో వాటి పనితీరుపై అధ్యయనం
‘ఈనాడు’ ముఖాముఖిలో రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మన్‌ రాజేశంగౌడ్‌
ఈనాడు - హైదరాబాద్‌

జిల్లా, మండల పరిషత్‌లకు పూర్వవైభవం ఖాయమని రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మన్‌ జి.రాజేశంగౌడ్‌ భరోసా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్‌, పురపాలక వ్యవస్థలను పటిష్ఠం చేయటం లక్ష్యంగా.. విస్తృత అంశాలతో నివేదికలు తయారు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో పంచాయతీ, పరిషత్‌ ఎన్నికల క్రతువులు పూర్తయి.. త్వరలోనే పురపాలక సంఘాలూ ఎన్నికలకు వెళ్లబోతున్న తరుణంలో తెలంగాణ మొదటి ఆర్థిక సంఘం ఛైర్మన్‌ రాజేశంగౌడ్‌ ‘ఈనాడు’ ముఖాముఖిలో పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. గతంలో కరీంనగర్‌ జడ్పీ ఛైర్మన్‌గా, ఉమ్మడి రాష్ట్ర మంత్రిగానూ ఆయన పనిచేశారు.

* ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు తప్ప మండల, జిల్లా పరిషత్‌లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులంటూ ఏవీ అందడంలేదు.  రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా వాటికి నిధులు, విధులు లభించే అవకాశం ఉందా?
రాబడులను ఆర్జించే మార్గాలు అనేకం స్థానికంగానే ఉంటున్నా వాటిని స్థానిక సంస్థలు అందిపుచ్చుకోలేకపోతున్నాయి. ఆదాయం ఏ విధంగా పెంచుకోవచ్చో తెలియజేయాల్సిందిగా సెస్‌, ఆస్కీలను కోరాం. సుపరిపాలన కేంద్రం సహకారాన్నీ తీసుకుంటున్నాం. వీటి నివేదికలను పరిశీలించాక సముచిత సిఫార్సులతో ఆర్థిక సంఘం నివేదిక తయారవుతుంది. సొంత రాబడులే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఏ విధంగా స్థానిక సంస్థలకు చేయూత ఇవ్వాలనేదీ మేం సిఫార్సు చేస్తాం. వృత్తి, వినోదపు పన్నులను ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖ వసూలు వేసి స్థానిక సంస్థలకు ఇస్తోంది. ఆ పన్నును స్థానిక సంస్థలే నేరుగా వసూలు చేసుకునే పద్ధతి ఉంటే న్యాయవాదులు, వైద్యులు వంటి అనేక వృత్తుల వారి నుంచి కూడా పన్ను పుష్కలంగా వసూలవుతుంది. జడ్పీలకు పూర్వవైభవం తీసుకురావాలనేది సీఎం లక్ష్యం. అందుకు అనుగుణంగా మా సిఫార్సులు ఉంటాయి. స్థానిక సంస్థలు ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించగలిగితే ఇతర నిధుల కోసం ఎదురుచూడాల్సిన అవసరమే ఉండదు.

* 14వ ఆర్థిక సంఘం తమకు అన్యాయం చేసిందని పరిషత్‌ల పాలకవర్గాలు నాలుగేళ్లుగా వాపోతున్నాయి. దేశవ్యాప్తంగా 2020 ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వచ్చే 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో వాటికి న్యాయం జరిగే అవకాశం ఉందంటారా?
ఒక్క గ్రామ పంచాయతీలకు మాత్రమే కాకుండా మిగతా అంచెల్లోని మండల, జిల్లా పరిషత్‌లకూ నిధుల్లో వాటాలు ఉండాలి. అప్పుడే పంచాయతీరాజ్‌ వ్యవస్థ సజావుగా నడుస్తుంది. స్థానిక సంస్థలన్నింటికీ నిధుల్లో వాటాలు ఉండాలని రాష్ట్ర ఆర్థిక సంఘం తరఫున ఇప్పటికే 15వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశాం. గతంలో మాదిరిగానే వాటికి నిధులు అందుతాయని భావిస్తున్నాం.

* ఆర్థిక సంఘం తుది నివేదిక ప్రభుత్వానికి ఎప్పటిలోగా అందొచ్చు? మధ్యంతర నివేదికలో ఎలాంటి అంశాలను పొందుపరిచారు?
ఇప్పటికే స్థానిక సంస్థల ప్రతినిధులతో పలు పర్యాయాలు భేటీలు నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నాం. కర్ణాటక, మహారాష్ట్రలలో పర్యటించాం. ఇంకా పలు రాష్ట్రాలను సందర్శించి అక్కడి స్థానిక సంస్థల తీరుపై అధ్యయనం చేస్తాం. ప్రభుత్వం ఇప్పటికే నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని తెచ్చింది. మున్సిపల్‌ చట్టాన్ని సవరించబోతోంది. ఆయా చట్టాల్లోని అంశాలను మేం పరిగణనలోకి తీసుకోవాల్సిఉంది. ఈ ప్రక్రియంతా అయ్యాకే తుది నివేదిక ప్రభుత్వానికి వెళ్తుంది. మధ్యంతర నివేదికలో మేం పంచాయతీరాజ్‌ సంస్థలకు రూ.1,500 కోట్లను సిఫార్సు చేయగా సీఎం మరో రూ.100 కోట్లను అదనంగా చేరుస్తున్నట్లు ప్రకటించారు. మున్సిపాలిటీలకు రూ.1,000 కోట్లు సిఫార్సు చేస్తే.. దాన్ని రూ.1,100 కోట్లకు పెంచారు.

* తెలంగాణలో ఇప్పుడు 95 శాతం మేర  చిన్న పంచాయతీలు ఉన్నందున వాటికి రాబడులంటూ పెద్దగా ఉండకపోవచ్చు కదా?  పంచాయతీలు, పరిషత్‌ల పాలకవర్గాల కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారా?
చిన్న పంచాయతీల్లోనూ రాబడులు ఉంటాయి. పరిశ్రమలు, రైస్‌మిల్లులు వంటి వాటి నుంచి సజావుగా పన్నులను రాబట్టుకోగలగాలి. అన్వేషిస్తే.. అన్ని చోట్లా ఆదాయానికి మార్గాలు ఉంటాయి. కొత్తగా ఎన్నికైన స్థానిక ప్రతినిధులతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకుంటాం. వారిలో పాలనా సామర్థ్యం పెంపుపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తాం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.