close

ప్ర‌త్యేక క‌థ‌నం

విషతుల్యం.. భూగర్భ జలం!

 పదేళ్ల కాలంలో నీటిలో పెరిగిన ఫ్లోరైడ్‌
 రాష్ట్రంలో 12 శాతం భూభాగంలో 5.2 ఎంజీ స్థాయికి చేరిక
 ప్రత్యామ్నాయ నీటి సరఫరా మేలని సూచన
 నీటి వ్యాపార కేంద్రాలతో ముంచుకొస్తున్న ముప్పు
 భూగర్భ జలవనరుల శాఖ అధ్యయన నివేదిక

తాగే నీటిలో లీటర్‌కి 1.5 మిల్లీగ్రాముల ఫ్లోరైడ్‌ ఉండాలి. అంతకు మించితే మానవ శరీరానికి ప్రమాదకరం. ఫ్లోరైడ్‌ నీళ్లు తాగితే ఎముకలు బలహీన పడటంతోపాటు ఇతర అనారోగ్యాలు దరిచేరుతాయి. అలాంటిది రాష్ట్రంలో 12 శాతం భూభాగంలోని భూగర్భ జలాల్లో లీటర్‌కు 5.2 మిల్లీ గ్రాముల (వర్షాకాలం ముందు పరీక్షిస్తే) ఫ్లోరైడ్‌ ఉన్నట్లు తేలింది. వర్షాకాలం తర్వాత చేసిన పరీక్షల్లో 10 శాతం భూభాగంలో 6.22 మిల్లీ గ్రాములు ఉన్నట్లు గుర్తించారు.

2007 నుంచి 2017 మధ్య రాష్ట్రంలో భూగర్భ జలాలపై రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా అధ్యయనం చేపట్టాయి. ఈ పదేళ్ల కాలంలో నీటి మట్టం మరింత లోతుకు పడిపోయినట్లు గుర్తించారు. ఫ్లోరైడ్‌, నైట్రేట్‌ శాతాలు పెరిగినట్లు తేలింది. దీంతో పలు అంశాలకు సంబంధించి సూచనలు చేశారు.

ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో భూగర్భ జలాల వినియోగం భవిష్యత్తుకు ముప్పుగా మారుతోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాలే తాగునీటి వనరులుగా ఉంటూ వస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల రిజర్వాయర్ల నుంచి ఉపరితల నీటిని సరఫరా చేస్తున్నా ప్రజలు మాత్రం భూగర్భ జలాన్ని వినియోగిస్తున్నారు. భూగర్భ జలాలను తోడి శుద్ధి చేసి విక్రయిస్తున్న ప్రైవేటు ఆర్‌ఓ కేంద్రాల డబ్బా నీటిపై ఆధారపడుతున్నారు. దీంతో అనేక సమస్యలు ఏర్పడుతున్నా గుర్తించలేకపోతున్నారు.

ఆ ఎనిమిది జిల్లాల్లో
ఫ్లోరైడ్‌ శాతం పరిమితికి మించి భూగర్భ జలం ఉన్న జిల్లాల్లో నల్గొండ, సంగారెడ్డి, కామారెడ్డి, వరంగల్‌, కరీంనగర్‌, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ జిల్లాల్లో వర్షాకాలం ముందు లోతుల్లోకి నీళ్లు వెళ్తున్నాయి. ఆ సమయంలో తక్కువ నీటిలో ఎక్కువ మొత్తంలో ఫ్లోరైడ్‌ కలిసి నీటి గాఢత పెరుగుతున్నట్లు గుర్తించారు. వర్షాలు కూడా తగ్గిపోవడంతో ఏటికేడు ఈ జిల్లాల్లో భూగర్భ జల మట్టం సైతం పడిపోతూ వస్తోంది. జనాభా పెరుగుతుండటం కూడా నీటి వినియోగం పెరగడానికి కారణమవుతోంది.

ఊరికో డబ్బా నీళ్ల కేంద్రం

2007-2017 మధ్య కాలంలో భూగర్భ జలం వాణిజ్య వస్తువుగా మారింది. రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రధాన గ్రామాల్లో ప్రైవేటు నీటి శుద్ధి కేంద్రాలు కోకొళ్లలుగా ఏర్పడ్డాయి. వెయ్యి లీటర్ల నీటిని ఆర్‌ఓ (రివర్స్‌ ఆస్మోసిస్‌ పద్ధతి) కేంద్రంలో శుద్ధి చేస్తే 500 లీటర్ల నీళ్లు తాగడానికి పనికొస్తాయి. ఇలా ఒక్కో కేంద్రం రోజులో వేలాది లీటర్ల నీటిని భూమి నుంచి తోడిపోస్తోంది. గ్రామాలు, అర్బన్‌ ప్రాంతాల్లో డబ్బా నీళ్లుగా వ్యవహరించే ఈ శుద్ధ నీటికి ప్రజలు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రభుత్వం, స్థానిక సంస్థలు క్లోరినేషన్‌ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా  పట్టించుకోకుండా గృహ అవసరాలకే వినియోగిస్తున్నారు.
* పడిపోతున్న భూగర్భాన్ని కాపాడుకునేందుకు రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ ప్రభుత్వానికి చేసిన పలు సూచనలు

ప్రమాదపుటంచుల్లో...

భూగర్భంలోని నీరు ఖాళీ అవుతోంది. పరిధికి మించి తోడటంతో జలమట్టం ప్రమాదపుటంచులను చేరుకుంటోంది. రాజధాని హైదరాబాద్‌లోనైతే వినియోగం విపరీతంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వాడకమే తప్ప సంరక్షణ చర్యలు లేకపోవడంతో ఏటికేడు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నేలలోకి ఇంకుతున్న నీటి శాతానికి, తోడుతున్న నీటికి అంతరం భారీగా పెరిగిపోయి భూమి పొరలు ఎండిపోతున్నాయి. దీంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వెయ్యి అడుగుల లోతులో బోరు వేసినా నీటి చుక్క కానరావడం లేదు. 2016-17 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా చేపట్టిన అధ్యయన నివేదికను ఇటీవల విడుదల చేశారు. అందులోని అంశాలు తక్షణం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతున్నాయి.

రాష్ట్రంలో ఇప్పటికే 23.19 లక్షల వ్యవసాయ బోర్లు ఉన్నాయి. ఏటా కొత్తగా తవ్వుతున్నవి 1.52 లక్షలకుపైగానే ఉన్నాయి. వీటి కిందే ప్రధానంగా పంటలు సాగవుతున్నాయి. దాదాపు 28 లక్షల బోర్లు (ప్రభుత్వ, గృహాల్లోని కలిపి) తాగునీటి కోసం వినియోగిస్తున్నట్లు అంచనాలున్నాయి.

ఆందోళనకరంగా హైదరాబాద్‌ పరిస్థితి..

హైదరాబాద్‌ జిల్లాలో భూగర్భ జలం కనుమరుగవుతోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా 341 శాతం భూగర్భ జలాన్ని ఈ జిల్లా వినియోగిస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అడుగడుగునా బోర్లు.. బహుళ అంతస్థుల నిర్మాణంతో నీటిని పెద్దఎత్తున తోడుతున్నారు. జనసాంద్రత ఎక్కువగా ఉండటంతో వినియోగమూ ఎక్కువగానే ఉంటోంది. అదేసమయంలో కాంక్రీట్‌ జంగిల్‌లో నీరు ఇంకే పరిస్థితి లేకపోవడం ప్రతికూలంగా మారింది.

ఆసిఫాబాద్‌లో తక్కువ వినియోగం..

నివేదిక తయారీలో భాగంగా 31 జిల్లాల జల వినియోగాన్ని లెక్కగట్టారు. హైదరాబాద్‌ జిల్లా తర్వాత రెండో స్థానంలో 94 శాతం వినియోగంతో మేడ్చల్‌ మల్కాజిగిరి, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి. అతి తక్కువగా ఆసిఫాబాద్‌ జిల్లా 23 శాతం భూగర్భ జలాల్ని వినియోగిస్తోంది. ఈ జిల్లాల్లో జన సాంద్రత తక్కువగా ఉండటం, అడవుల విస్తీర్ణం ఉండటం కూడా ఇందుకు ఓ కారణంగా కనిపిస్తోంది

మరో 6.15 లక్షల హెక్టార్ల సాగుకే నీళ్లు!

వ్యవసాయ బోరు బావుల కింద సాగు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో భూగర్భ జలమట్టం లోలోతుకు వెళ్లింది. రాష్ట్రంలో కృష్ణా-గోదావరి పరీవాహకాలు, పరీవాహకంలో లేని ప్రాంతాలు కలిపి మొత్తం 437 టీఎంసీల భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. వీటిలో 285 టీఎంసీలను తాగు, సాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. మరో 152 టీఎంసీల జలం మాత్రమే భవిష్యత్తు అవసరాలకు మిగిలి ఉంది. ఈ నీటితో రాష్ట్రంలో 6.15 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగుచేసుకోవడానికి వీలుందని నివేదిక తెలిపింది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.