close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఠారెత్తిస్తున్న ఎండలు

46 డిగ్రీలకుపైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
వాతావరణంలో పడిపోయిన తేమశాతం
పెరిగిన ఎండలు, వడగాల్పులు
జూన్‌ వచ్చినా తగ్గని విద్యుత్తు వాడకం
ఈనాడు - అమరావతి

రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలంటారు. ఈ ఏడాది మాత్రం మృగశిర వచ్చినా ఉష్ణ తీవ్రత ఎంతమాత్రం తగ్గలేదు. శనివారం ఉదయం పదిగంటల నుంచే ఠారెత్తించాయి. మధ్యాహ్నానికి నిప్పుల కొలిమిని తలపించాయి. రాష్ట్రంలోనే గరిష్ఠంగా విజయనగరం జిల్లా వేపాడలో 46.8, విశాఖపట్నం జిల్లా కనిమెరకలో 46.5 డిగ్రీలు నమోదైంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో ఎండల ప్రభావం అధికంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 137 వాతావరణ నమోదు కేంద్రాల పరిధిలో శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో 43 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలకు తోడు వడగాల్పుల ప్రభావం కూడా తోడైంది. మండుటెండల తీవ్రత మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని ఆర్టీజీఎస్‌ సూచించింది.

తేమశాతం తగ్గడమే
వాతావరణంలో తేమశాతం తగ్గడం వల్ల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. గతవారం నుంచి 44 డిగ్రీల లోపు ఉన్న ఎండలు.. శనివారం ఒక్కసారిగా 46 డిగ్రీలకు చేరాయి. మంగళవారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని ఆర్టీజీఎస్‌ సూచించింది. ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు వడగాల్పుల తీవ్రత పెరుగుతుందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండల్లో తిరగకుండా చూడాలని కోరింది. చిన్నారులు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

జూన్‌లోనూ తగ్గని విద్యుత్తు వాడకం
సాధారణంగా జూన్‌లో విద్యుత్తు వినియోగం  తగ్గుతుంది. గతేడాది కూడా జూన్‌ మొదటి వారంలోనే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. దీంతో ఎండల తీవ్రత తగ్గింది. దీనికి అనుగుణంగా విద్యుత్తు వాడకం కూడా తగ్గుతూ వచ్చింది. ఈ ఏడాది మాత్రం జూన్‌ 15 వచ్చినా వినియోగం తగ్గలేదు. శనివారం 194.21 మిలియన్‌ యూనిట్ల వాడకం నమోదైంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.