close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఎన్నికల సేవలకు చెల్లింపులేవి?

కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న కార్ల యజమానులు, ఫొటో, వీడియోగ్రాఫర్లు
ఇబ్బందులు పడుతున్న స్థానిక అధికారులు
మరో రూ.300 కోట్లు కావాలన్న ఎన్నికల సంఘం!

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయి నెలలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో చెల్లింపులు జరగకపోవడంతో సేవలు అందించిన వారు, అధికారులు లబోదిబోమంటున్నారు. పోలింగ్‌ కేంద్రాల పెరుగుదల, మౌలిక సదుపాయాలు, రాజకీయ పార్టీల ఆరోపణలు అనుసరించి తీసుకున్న పలు చర్యలవల్ల 2014 ఎన్నికల కంటే 2019 ఎన్నికల వ్యయం భారీగా పెరిగింది. అయితే..అందుకు తగ్గట్లు నిధుల విడుదల సక్రమంగా లేక జిల్లాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

నియోజకవర్గ పరిధి పరిగణనలోకి తీసుకోకుండా..
రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలకు కనీసం 10 నుంచి 25 లక్షల రూపాయల వరకు నిధులు విడుదలవ్వాల్సి ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అదీకాకుండా.. నియోజకవర్గ పరిధి, ప్రాంతం, అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఒకేరకమైన కేటాయింపులు జరుగుతుండటంతో ఇబ్బందులు నెలకొంటున్నట్లు తెలిపాయి.

మంత్రికి వినతి ఇచ్చిన అధికారులు
ఒక్కో నియోజకవర్గానికి కనీసం 1.95 కోట్ల వరకు ఖర్చు అయిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఖర్చుకు తగినట్లు నిధుల విడుదల కానందున సేవలు అందించిన వారికి సమాధానం ఇవ్వలేకపోతున్నట్లు అధికారులు వాపోతున్నారు. ఈ విషయమై పలువురు సీనియర్‌ తహశీల్దార్లు రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను సచివాలయంలో కలిసి విజ్ఞాపనపత్రాన్ని అందజేశారు.

వివరాలు సమర్పించే వరకూ మార్చొద్దంటూ..
ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించే వరకు తహశీల్దార్లను వారి పాత స్థానాలకు పంపొద్దని కొద్ది రోజుల క్రితం ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది. 2014 ఎన్నికల ఖర్చులతో పోలుస్తూ అదనంగా అయిన వ్యయ వివరాలను స్పష్టంగా చూపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఎన్నికల విధుల నిమిత్తం వేరే జిల్లాలకు బదిలీలపై వెళ్లిన దాదాపు 600మంది తహశీల్దార్లకు తాజా ఉత్తర్వులు ఇబ్బందికరంగా మారాయి. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఖర్చు కింద తొలివిడతగా ప్రభుత్వం రూ.315 కోట్లను విడుదల చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎన్నికల వ్యయం నిమిత్తం అదనంగా మరో రూ.300 కోట్లను విడుదల చేయాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. మరోవంక..రాష్ట్ర ప్రభుత్వం గతవారం భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. 9 జిల్లాలకు కొత్తగా కలెక్టర్లు వచ్చారు. దీనివల్ల ఖర్చుల వివరాలను తేల్చడంలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు.

సీఎం పరిశీలనలో తహశీల్దార్ల దస్త్రం
తహశీల్దార్లను తమ పాత స్థానాలకు పంపడంలో జరుగుతున్న జాప్యంపై మంత్రి సుభాష్‌చంద్రబోస్‌ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌తో సచివాలయంలో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన దస్త్రం సీఎం పరిశీలనలో ఉందని మన్మోహన్‌సింగ్‌ తెలిపారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.