close

ప్ర‌త్యేక క‌థ‌నం

మీ బోరులో జలం జర భద్రం

ఎప్పటికప్పుడు భూగర్భ నీటి మట్టాలపై రైతులకు సమాచారం
జీహెచ్‌ఎంసీ, పట్టణ ప్రాంతాలకూ సూచనలు
భూగర్భ జలవనరుల శాఖలో టెలిమెట్రీ యూనిట్ల సాంకేతికత

‘‘మీ గ్రామం పరిధిలో జలమట్టం పడిపోతోంది. బోరుబావులపై ఎక్కువగా ఆధారపడితే పంటలకు నీళ్లు అందడం కష్టం. జాగ్రత్త పడండి’’ అంటూ రైతులను అప్రమత్తం చేస్తూ సమాచారం.
‘‘జీహెచ్‌ఎంసీ పరిధిలో భూగర్భజలాలు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. గతంతో పోలిస్తే జలమట్టంలో తేడాలు నమోదవుతున్నాయి. నీటిని    పొదుపుగా వాడుకోండి.’’ అంటూ నగర వాసులకు ఆన్‌లైన్‌ ద్వారా సూచనలు.
‘‘ఆధునిక వ్యవసాయ పద్ధతులను వాడుకలోకి తీసుకొచ్చి భూగర్భ జలవనరులను సంరక్షించండి. రాష్ట్రంలో ఎక్కడెక్కడ నీటి వినియోగం అధికంగా ఉంది, జలసంరక్షణ చర్యలు చేపట్టిన చోట నీటిమట్టం ఎలా పెరిగింది. తగ్గినచోట సూక్ష్మ, బిందు సేద్యంలాంటి విధానాలు అవలంబించాలి.’’ అంటూ ప్రభుత్వానికి విలువైన సూచనలు.  ఈ తరహా విలువైన సమాచారం త్వరలో  అందుబాటులోకి రానుంది.
రిగిపోతున్న భూగర్భ జలసంపదను తిరిగి పెంపొందించుకునేందుకు భూగర్భ జలవనరుల శాఖ సాంకేతిక పద్ధతులను అమలు చేయబోతోంది. ప్రస్తుతం నెలకోమారు సంప్రదాయ పద్ధతిలో చేపడుతున్న జలమట్టం నమోదు స్థానంలో గంటలు, రోజుల వ్యవధిలో మట్టం వివరాలను నమోదు చేయనుంది. అంతేకాదు ఈ సమాచారాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు ఆన్‌లైన్‌, యాప్‌లను రూపొందిస్తోంది. జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో 503 యూనిట్లలో టెలిమెట్రీ (నీటిమట్టం, ప్రవాహాలను కొలిచే పరికరం) సాంకేతికతను వినియోగించనున్నారు. దీనికోసం ఆ శాఖ కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖకు ప్రతిపాదనలు పంపించింది. అనుమతులు రాగానే టెండర్లు పిలవనున్నారు.

ఈ ఏడాది 300 యూనిట్ల నిర్మాణం

రాష్ట్రంలో ప్రస్తుతం 960 ఫీజో మీటర్లు (భూమిలో నీటిమట్టం కొలిచే కేంద్రాలు) ద్వారా నీటిమట్టం వివరాలు నమోదు చేస్తున్నారు. నెలకోసారి ఈ ప్రక్రియను చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ కేంద్రాల్లోనే టెలిమెట్రీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. తొలిదశలో 503 యూనిట్లకు 300 యూనిట్లలో ఈ సాంకేతికతను ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నీటిమట్టం వివరాలు తెలిపేందుకు కొన్ని యూనిట్లు, జీహెచ్‌ఎంసీ పరిధిలో మరికొన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఫీజో మీటర్ల పరిస్థితిని పరీక్షిస్తున్నారు. చెడిపోయిన చోట కొత్తవి ఏర్పాటు చేయడం, బోర్లు పూడిపోయిన చోట ఫ్లషింగ్‌ లాంటి ప్రక్రియలు పూర్తి చేస్తున్నారు. నూతన సాంకేతికతపై భూగర్భ జలవనరులశాఖ అధికారులు స్పందిస్తూ.. ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే విలువైన సమాచారం ప్రజలకు అందుతుందని తెలిపారు. జలాన్ని సంరక్షించుకునేలా ఆన్‌లైన్‌, యాప్‌ల ద్వారా భూగర్భ జలవనరుల శాఖ అందించే సమాచారం తోడ్పడుతుందని చెబుతున్నారు.

ప్రయోజనాలు ఇవిగో..

* టెలిమెట్రీ సాంకేతికతతో భూగర్భంలో నీటిమట్టం స్థాయిని గంటల వ్యవధి లేదా రోజుల వ్యవధిలో అంచనా వేయొచ్చు.
* మట్టం తగ్గిపోవడం, పెరగడం లాంటి మార్పులను నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.
* పొట్టదశకు వచ్చాక బోర్లు ఎండిపోయాయంటూ రైతులు బాధ పడకుండా నీటి స్థాయులను నిరంతరం వారికి తెలియజేయవచ్చు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.