close

ప్ర‌త్యేక క‌థ‌నం

సముద్ర గాలుల వల్లే రుతుపవనాలు ఆలస్యం

  వాయు తుపాను నైరుతిలో తేమను లాగేసింది
  భూతాపం పెరుగుదల వల్ల అసాధారణ మార్పులు
  జిల్లా కేంద్రాల్లో వాతావరణ కేంద్రాలకు ప్రతిపాదనలు
  ‘ఈనాడు’తో వాతావరణ శాఖ సంచాలకుడు వై.కె.రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ఫసిఫిక్‌, హిందూ మహాసముద్రాల్లో గాలుల్లో తేడా వల్లనే నైరుతి రుతుపవనాల కదలికలపై తీవ్ర ప్రభావం పడిందని వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర సంచాలకుడు వై.కె.రెడ్డి చెప్పారు. రుతుపవనాలు ఆలస్యం కావడం, జూన్‌లోనూ వడగాలుల వీస్తుండటం తదితర అనేక అంశాలపై ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన మాటల్లోనే..

* తెలంగాణకు 22 దాకా రుతుపవనాలు వచ్చే అవకాశం లేదా? కారణాలేంటి?
తాజా అంచనాల ప్రకారం జూన్‌ 21న ఏపీకి, 22న తెలంగాణలోకి ప్రవేశిస్తాయి. తరవాత రెండురోజులకు రాష్ట్రమంతా విస్తరిస్తాయి. రుతుపవనాల్లో తేమనంతా అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘వాయు’ తుపాను లాగేయడం వల్ల ఇవి కదలకుండా ఆగిపోయాయి. ఇది అనూహ్యంగా ఏర్పడిన వాతావరణం.

* గతంలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదా?
రుతుపవనాలు ఈసారి కేరళకే చాలా ఆలస్యంగా జూన్‌ 8న వచ్చాయి. తరవాత వెంటనే అరేబియా సముద్రంలో వాయు తుపాను ఏర్పడింది. నైరుతిలోని తేమనంతా వాయు లాగేయడంతో ఇక ఇవి ముందుకు కదలలేదు. సాధారణంగా నైరుతి రుతుపవనాలు అండమాన్‌, లక్ష ద్వీపాల మీదుగా కేరళకు సమీపించే సమయానికి ఇటు బంగాళాఖాతం, అటు అరేబియా సముద్రంలో వర్షాలు కురిపిస్తూ ముందుకొస్తాయి. దీనివల్ల రెండు సముద్రాల్లో వాతావరణం బాగా చల్లబడుతుంది. అలాంటి వాతావరణంలో సముద్రంలో వాయుగుండం, తుపానులాంటివి ఏర్పడటం అరుదు. తుపాను ఏర్పడటం వల్ల ఈసారి అంచనాలు మారాయి.

* నైరుతి కదలకపోవడం వల్లనే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయా?
రుతుపవనాలపై వాయు తుపాను ప్రభావం అధికంగా ఉన్నందున అవి ముందుకు విస్తరించకుండా కేరళలోనే ఆగిపోవడం వల్ల ఎక్కడా వర్షాలు లేవు. దీనివల్లనే వేసవి స్థాయిలో సాధారణంకన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనివల్ల తెలుగు రాష్ట్రాలకు వర్షాలు బాగా ఆలస్యమయ్యాయి. కానీ ఈ నెలాఖరులో బాగా కురుస్తాయని అంచనా.

* అసలు కేరళకే చాలా ఆలస్యంగా వచ్చాయి కదా.. దానికి కారణాలేంటీ?
కేరళకు ఆలస్యంగా రావడానికి వాతావరణంలో ఏర్పడిన మార్పులే కారణం. సాధారణంగా ఆస్ట్రేలియా తీరంలో ఫసిఫిక్‌ మహా సముద్రంలో అధిక పీడనం ఏర్పడినప్పుడు ఆఫ్రికా ఖండంలోని సోమాలియా తీరం ప్రాంతంలో అల్ప పీడనం ఉంటుంది. ఈ రెండు పీడనాల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటే దానివల్ల ఏర్పడే బలమైన గాలులు వేగంగా భూమధ్య రేఖ మీదుగా హిందూ మహాసముద్రం వైపు వస్తాయి. వీటి వల్ల నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు కదలడం సాధారణం. కానీ ఈ ఏడాది వేసవిలో ఆస్రేలియా, ఆఫ్రికా తీరాల మధ్య పీడనంలో పెద్దగా వ్యత్యాసం లేదు. దీనివల్ల భూమధ్య రేఖ మీదుగా గాలుల రాక బలంగా లేదు. కేరళకు రుతుపవనాలు జూన్‌ 8 దాకా ఆలస్యం కావడానికి ఇదొక ప్రధాన కారణం.

* 14 రోజులు ఆలస్యంగా తెలంగాణకు వస్తాయంటున్నారు. ఇంత ఆలస్యం ఎప్పుడైనా జరిగిందా ?
గత పదేళ్లలో ఎన్నడూ జరగలేదు. ఇంతకుముందు అత్యంత ఆలస్యంగా 2014లో జూన్‌ 19న తెలంగాణకు వచ్చాయి. ఆ ఏడాది కేరళకు జూన్‌ 6న వచ్చాయి. అంటే 13 రోజులు ఆలస్యంగా ఇక్కడికి చేరాయి. ఈ ఏడాది ఆ రికార్డు చెరిగిపోయే అవకాశాలున్నాయి. ఏకంగా 14 రోజులు ఆలస్యం కావడం కూడా కీలక వాతావరణ పరిణామమే.

* జూన్‌ మూడోవారంలో సైతం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలుంటున్నాయి. ప్రధాన కారణాలేంటి?
ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో మార్పులే కారణం. పర్యావరణ పరిరక్షణకు అందరూ పాటుపడితేనే మంచి వర్షాలు కురుస్తాయి. ప్రతీ ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. సాధారణంకన్నా 5 డిగ్రీలకు తక్కువ లేదా ఎక్కువుంటే ఆ ప్రాంతంలో అసాధారణ మార్పులున్నట్లుగా భావించాలి. ఉదాహరణకు మెదక్‌ సోమవారం పగలు 39.2 డిగ్రీలుంది. ఇది సాధారణంకన్నా 5.5 డిగ్రీలు అధికం. విశాఖపట్టణంలో సాధారణంగా ఈరోజుల్లో 32.4 డిగ్రీలకు మించకూడదు. కానీ సోమవారం 38 డిగ్రీలుంది. ఇది చాలా ఎక్కువ. వాతావరణంలో మార్పుల వల్లనే ఇలాంటి అధిక వ్యత్యాసాలు ఏర్పడుతుంటాయి.

* వాతావరణ కేంద్రాలు తక్కువగా ఉన్నాయి కదా. వాటిని పెంచే ఆలోచన ఉందా?
రాష్ట్ర ప్రణాళికాభివృద్ధి సొసైటీ రాష్ట్రవ్యాప్తంగా ఆటోమేటిక్‌ వాతావరణ కేంద్రాలనుంచి సమాచారం సేకరిస్తోంది. భవిష్యత్తులో వాతావరణ శాఖ తరఫున అన్ని జిల్లా కేంద్రాల్లో వాతావరణ కేంద్రాలు ఏర్పాటుపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపాము. రామగుండంలో ఉన్న కేంద్రాన్ని నెలలోగా రేడియో బెలూన్‌ సౌండ్‌ కేంద్రంగా అభివృద్ధి చేయబోతున్నాం.అంటే అక్కడ వాతావరణంలోకి బెలూన్లు పంపి ఎప్పటికప్పుడు మార్పులను నమోదు చేస్తాం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.