close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఉదయించేదెప్పుడు?

విశాఖ-విజయవాడ డబుల్‌ డెక్కర్‌  ఏసీ రైలు తయారై 3 నెలలు 
ఏ దిక్కూ లేకుండా జలంధర్‌లోనే పడి ఉన్న రేక్‌ 
పంజాబ్‌ నుంచి తీసుకురావడంలో తూ.కో.రైల్వే నిర్లక్ష్యం 
ఈనాడు - విశాఖపట్నం

రైల్వే సదుపాయాల విషయంలో తూర్పు కోస్తా రైల్వే తీరుకు ఇది మరో నిదర్శనం. అమరావతి-విశాఖల నడుమ తాకిడి గణనీయంగా పెరిగిన దృష్ట్యా అధునాతనమైన ‘ఉత్కృష్ట్‌ డబుల్‌ డెక్కర్‌ ఏసీ యాత్రీ’ (ఉదయ్‌) ఎక్స్‌ప్రెస్‌ రైలును ఈ మార్గంలో ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే మంత్రి హోదాలో సురేశ్‌ ప్రభు 2016-17 బడ్జెట్‌లోనే ప్రకటించినా ఇప్పటికీ ఇది పట్టాలపైకి రాలేదు. రైలు తయారైపోయినా తీసుకురావడంలో ఎనలేని అలసత్వం కనిపిస్తోంది. చివరకు ఇది అతీగతీ లేకుండా పంజాబ్‌లోని జలంధర్‌లో పడి ఉంది. బడ్జెట్‌ ప్రకటనకు అనుగుణంగా ఆ రైలు (రేక్‌) తయారీ బాధ్యతను 2018లో పంజాబ్‌లోని కపుర్తల రైలు పెట్టెల తయారీ కర్మాగారానికి అప్పగించారు. విశాఖ-విజయవాడ రైలుకు 22701, విజయవాడ-విశాఖ రైలుకు 22702 నంబర్లను కేటాయించారు. ఈ ఏడాది మార్చి 19న కపుర్తల కర్మాగారం నుంచి ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ రేక్‌లను తూ.కో.రైల్వేకు అప్పగిస్తూ అధికారులు దస్త్రాలు సిద్ధం చేశారు. ఆ ప్రకారం రైలును స్వాధీనం చేసుకుని వెంటనే సర్వీసును ప్రారంభించాలి. కానీ ఆ రైలు గురించే పట్టించుకోలేదు. గత్యంతరం లేక రైలును కపుర్తలకు 35 కిలోమీటర్ల దూరంలోని జలంధర్‌ రైల్వేస్టేషన్‌ వెలుపల ఉంచారు. అలాగే వదిలేస్తే దీని విడిభాగాలు చోరీకి గురయ్యే అవకాశాలున్నాయని జలంధర్‌, కపుర్తలలోని రైల్వే ఉన్నతాధికారులు చెబుతున్నారు. 
సీఆర్‌ఎస్‌ అనుమతి లేకనే 
కర్మాగారం నుంచి పట్టాలపైకి కొత్త రైలు రావాలంటే రైల్వే భద్రత కమిషనర్‌ (సీఆర్‌ఎస్‌) అనుమతించాలి. ప్రయాణానికి ఈ రైలు అనువుగా ఉందా లేదా? వెళ్లే మార్గం అనువైనదా? కాదా? అన్నది అది నిర్ధరిస్తుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంది. దీన్ని ఇంతవరకు తూ.కో.రై. ఉన్నతాధికారులు పూర్తి చేయలేదని కపుర్తలలోని అధికారులు ‘ఈనాడు’కు చెప్పారు. దీనిపై తూ.కో.రై. అధికారులను ప్రశ్నించగా.. సంప్రదింపులు జరుపుతున్నామని సమాధానమిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ మీదుగా విశాఖ-తిరుపతి డబుల్‌ డెక్కర్‌ రైలు తిరుగుతోంది. దీనికి సీఆర్‌ఎస్‌ అనుమతులున్నాయి. దీన్ని చూపించైనా సులువుగా అనుమతులు తెచ్చుకోవచ్చు. ఆ రైలును విశాఖకు తెచ్చుకుని సీఆర్‌ఎస్‌ అనుమతికి ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. అదీచేయలేదు. విశాఖ-విజయవాడ మధ్య నిత్యం 20 రైళ్లు తిరుగుతున్నా అన్నీ కిటకిటలాడుతుంటాయి. శీతల బోగీలైతే అసలు ఖాళీ ఉండడంలేదు. అమరావతి రాజధాని అయ్యాక రద్దీ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఏర్పడింది. 
రైలు ప్రత్యేకత 
9 డబుల్‌ డెక్కర్‌ కోచ్‌లు, 2 పవర్‌కార్‌లు ఉన్నాయి. 
సీట్ల మధ్య ఖాళీని పెంచారు. 
వైఫై సేవలతో పాటు ఎల్‌సీడీ తెరలు ఉన్నాయి. 
ఉద్యోగులకు వీలుగా ఈ రైలు విశాఖలో ఉదయం 5.45 గంటలకు బయల్దేరి విజయవాడకు 11.15 గంటలకు చేరుకుంటుంది. విజయవాడలో సాయంత్రం 5.30కి బయల్దేరి రాత్రి 10.55కు విశాఖకు చేరుకునేలా సమయాలను నిర్ణయించారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.