close

ప్ర‌త్యేక క‌థ‌నం

నాలుగేళ్లలో.. 49 లక్షల దరఖాస్తులు

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ 
ఇప్పటికే 24.58 లక్షల మంది ఎదురుచూపు 
ఏటా పెరుగుతున్న ఉద్యోగార్థుల సంఖ్య 
టీఎస్‌పీఎస్సీ వద్ద నమోదైన గణాంకాల్లో వెల్లడి 
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. సర్కారీ కొలువుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థుల సంఖ్య పెరుగుతోంది. కొడితే ప్రభుత్వ కొలువే కొట్టాలన్న ఉద్దేశంతో నిరుద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఏటా డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు కొత్తగా ఈ కేటగిరీలోకి వచ్చిచేరుతున్నారు. ఉన్నత చదువులు చదివినప్పటికీ అర్హత ఉంటే చాలు.. ఏ చిన్న ఉద్యోగ ప్రకటన వచ్చినా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం దాదాపు 24.58 లక్షలమంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఒక్క టీఎస్‌పీఎస్సీ వద్ద నమోదైన ఉద్యోగార్థుల వన్‌టైం రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. ఇప్పటివరకు కమిషన్‌ జారీచేసిన 101 ఉద్యోగ ప్రకటనలకు దాదాపు 49.04 లక్షల దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతోందని, తెలంగాణ పట్టణ యువతలో నిరుద్యోగం 32.8 శాతంగా ఉందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నివేదికలో వెల్లడించింది.


కరీంనగర్‌లో అత్యధికం.. 

 

టీఎస్‌పీఎస్సీ వెలువరించిన 101 ఉద్యోగ ప్రకటనల్లో సాంకేతిక, వైద్య, ప్రొఫెషనల్‌, సాధారణ అర్హతలు కలిగిన 36,601 పోస్టులు ఉన్నాయి. ఒక్కో పోస్టుకు సగటున రాష్ట్రంలో 133 మంది ఉద్యోగార్థులు పోటీపడ్డారు. రెవెన్యూశాఖలో 700 వీఆర్‌వో పోస్టులకు అత్యధికంగా 10.58 లక్షలమంది దరఖాస్తు చేశారు. సాధారణ అర్హత కలిగిన అభ్యర్థులు ఎక్కువగా పోటీపడ్డారు. ఈ పోస్టులకు సగటున 1,511 మంది పోటీపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థుల సంఖ్యను పరిశీలిస్తే జిల్లాల వారీగా కరీంనగర్‌లో 3 లక్షలు దాటింది. తరువాత వరంగల్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, ఖమ్మం రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో మినహా మిగతా జిల్లాల్లో మహిళా ఉద్యోగార్థుల కన్నా పురుష ఉద్యోగార్థుల సంఖ్య ఎక్కువగా నమోదైంది.


బీసీలే అత్యధికం.. 

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడుతున్న వారిలో బీసీ అభ్యర్థులు అత్యధికంగా ఉన్నారు. ఆ తరువాతి స్థానంలో ఎస్సీలు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ఖమ్మం, నిజామాబాద్‌ మినహా మిగతా పూర్వజిల్లాల్లో బీసీ అభ్యర్థుల సంఖ్య లక్షకు పైగా నమోదైంది. బీసీల్లో అత్యధికంగా కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌ నిలిచాయి. ఎస్సీల్లో కరీంనగర్‌, నల్గొండ, వరంగల్‌ జిల్లాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల పోటీలో ఇతర వర్గాల అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉంది. హైదరాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో గిరిజన నిరుద్యోగులు తక్కువ ఉన్నట్లు ఓటీఆర్‌ గణాంకాల్లో వెల్లడైంది.


 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.