close

ప్ర‌త్యేక క‌థ‌నం

సర్కారు ‘ఇంటర్‌’లో అన్నీ సమస్యలే

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో  భారీగా అధ్యాపకుల కొరత
ఫలితాల్లో వెనకబడుతున్న విద్యార్థులు
పోటీ పరీక్షల్లోనూ నిరాశే
ఇన్‌ఛార్జుల పాలనతో పర్యవేక్షణా నామమాత్రం
ఈనాడు - అమరావతి

ఇంటర్మీడియట్‌.. విద్యార్థి జీవితాన్ని మలుపు తిప్పే దశ. కానీ ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్‌ విద్యపై విద్యా శాఖలో నిర్లక్ష్యం కొనసాగుతోంది. మౌలిక వసతుల లేమి, తీవ్రస్థాయిలో అధ్యాపకుల కొరత, పర్యవేక్షించాల్సిన అధికారుల స్థానంలోనూ ఇన్‌ఛార్జుల పాలన.. వెరసి జూనియర్‌ కళాశాలల్లో ప్రమాణాలు పడిపోతున్నాయి. ఇంటర్‌ ఫలితాల్లోనే అంతంతమాత్రంగా ప్రతిభ చూపుతున్న ప్రభుత్వ కళాశాలలు.. పోటీ పరీక్షల ర్యాంకుల్లో కనుచూపుమేరలో కూడా కనిపించడం లేదు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ అంటే కార్పొరేట్‌ కళాశాలలే అన్న చందంగా పరిస్థితి మారిపోయింది. రుసుములు చెల్లించలేని పేద, మధ్యతరగతి వారే ప్రధానంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చేరుతున్నారు. ఈ కళాశాలలు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. ఇంటర్‌ ఫలితాల నుంచి ఎంసెట్‌ వరకు అన్నింటిలోనూ వెనుకబడుతుండడంతో రాన్రానూ వీటిలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది.

ఇన్‌ఛార్జులే దిక్కు
ఇంటర్‌ విద్యలో దాదాపు అధికారుల పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఇన్‌ఛార్జులతోనే నెట్టుకొస్తున్నారు. కళాశాలల్లో అధ్యాపకుల (లెక్చరర్ల) కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 447 ప్రభుత్వ కళాశాలలకు దాదాపు 4,800 మంది అధ్యాపకులు అవసరం. కానీ శాశ్వత ప్రాతిపదికన పని చేసేవారు 700మంది లోపే ఉన్నారు. ఒప్పంద, అతిథి అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నారు.
* 447 ప్రిన్సిపాళ్ల పోస్టులకు 150 వరకు ఖాళీగానే ఉన్నాయి. వీటికి ఇన్‌ఛార్జులే దిక్కు.
* ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలను తనిఖీలు చేసేందుకు ప్రతి జిల్లాలోనూ జిల్లా వృత్తి విద్యాధికారి ఉండాలి. కానీ 11 జిల్లాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లను ఇన్‌ఛార్జులుగా నియమించారు. శాశ్వత ప్రతిపాదికన అధికారులు లేకపోవడంతో కళాశాలల తనిఖీలు నామమాత్రంగానే సాగుతున్నాయి.
* ఇంటర్‌ విద్యామండలి తరపున పరీక్షల నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకు ప్రాంతీయ తనిఖీ అధికారి (ఆర్‌ఐవో) ఉంటారు. ప్రస్తుతం ఈ పోస్టుల్లోనూ ఇన్‌ఛార్జులే కొనసాగుతున్నారు.
* కడప, గుంటూరు, రాజమహేంద్రవరంలో ప్రాంతీయ సంయుక్త సంచాలకుల (ఆర్జేడీ) పోస్టులు ఉన్నాయి. వీటినీ ఇన్‌ఛార్జులతోనే నెట్టుకొస్తున్నారు.

ఉత్తీర్ణతలో వెనుకే..
ఇంటర్‌ ఫలితాల్లో ప్రైవేటు కళాశాలలతో పోల్చితే ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత తక్కువగా నమోదవుతోంది. గత విద్యాసంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో సరాసరిన ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 66.78%, 76.68% మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ కళాశాలల్లో మొదటి, రెండో సంవత్సరాల్లో వరుసగా 24.5%, 11.03% ఉత్తీర్ణత నమోదైంది. ఎంసెట్‌, ఇతరత్రా పోటీ పరీక్షల్లోనూ ర్యాంకులు తెచ్చుకుంటున్న ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు చాలా తక్కువగానే ఉంటున్నారు. జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్సుడ్‌, నీట్‌ల్లో ర్యాంకులు సాధించడమైతే మరీ అరుదు. ఇటీవల ఇంటర్‌ విద్యా శాఖ ఎంసెట్‌, జేఈఈ, నీట్‌ పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రతి జిల్లాకో ఎక్సలెన్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. వీటిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.