Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

ముందు చూపే కాపాడుతోంది

ముంపును తట్టుకుని నిలబడుతున్న ఇల్లు
కేరళ వరద బాధితులకు ‘ఈనాడు సహాయనిధి’తో ప్రణాళికాబద్ధంగా గృహాల నిర్మాణం

కేరళను గత ఏడాది జలవిలయం అతలాకుతలం చేసింది. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. నాటి గాయం నుంచి అలప్పుజ, ఎర్నాకులం లాంటి జిల్లాలు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇలాంటి చోట.. బాధితులకు చీకటిలో వెలుగురేఖలా కొన్ని స్వచ్ఛంద సంస్థలు అండగా నిలిచాయి. ఉచితంగా ఇళ్లు కట్టించి బతుకుపై భరోసా కల్పిస్తున్నాయి. అందులో ‘ఈనాడు-రామోజీ గ్రూపు సంస్థలు’ ముందు వరుసలో నిలిచాయి. పక్కా ప్రణాళికతో ఇళ్లు నిర్మిస్తూ నిరాశ్రయులకు భరోసా కల్పిస్తున్నాయి. అలప్పుజ జిల్లాలో కట్టించిన నమూనా ఇల్లు ఒకటి ప్రతికూల పరిస్థితుల్ని సైతం తట్టుకుని నిలబడి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తుపాను ప్రభావంతో విలవిల్లాడిన అళప్పుజ జిల్లాలో రూ.7.7 కోట్ల ‘ఈనాడు సహాయ నిధి’తో మూడు దశల్లో మొత్తం 120 నుంచి 130 ఇళ్లు కట్టించి ఇస్తామని ‘ఈనాడు-రామోజీ గ్రూపు’ ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం 85 ఇళ్ల నిర్మాణం సాగుతోంది. వాటిలో ముందుగా ఒకదాని నిర్మాణాన్ని పూర్తిచేశారు. కుట్టనాడులోని నెడికుడి పంచాయతీలో ప్రయోగాత్మకంగా కట్టిన ఈ ఇల్లు నీటి ముంపును తట్టుకుని నిలబడటంతో అధికారులు, స్థానికుల ఆనందానికి అవధుల్లేవు. మిగిలిన సంస్థలు కట్టే ఇళ్లకంటే ఈ ఇల్లు ఎంతో భిన్నంగా ఉంది. సాధారణంగా ఇక్కడ పొలాలకు పెంబనాడ్‌ నది నుంచి నీటిని వదులుతుంటారు. ఈ సారి కాస్తంత ఎక్కువగా నీరు వచ్చి.. చుట్టుపక్కల ఇళ్లను ముంచెత్తినా.. ఈనాడు సహాయ నిధితో నిర్మించిన ఈ ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా నిలిచింది. సముద్ర మట్టానికి ఒకటిన్నర మీటరు ఎత్తు వరకు పునాది నిర్మించి.. దానిపైన ఇల్లు కట్టడంతో ఎంత వరద వచ్చినా చుక్కనీరు కూడా లోపలకు రాలేదు. వరదలు ఎంత తీవ్రతతో వచ్చినా తట్టుకుని నిలబడేలా వినూత్న నమూనాతో ఈ ఇళ్లు నిర్మిస్తున్నారు. ‘అయామ్‌ ఫర్‌ అలెప్పి’ ప్రాజెక్టు కింద.. కుటుంబశ్రీ జిల్లా కార్యాలయంతో కలిసి ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టారు. తెలుగువారైన సబ్‌ కలెక్టర్‌ వీఆర్‌ కృష్ణతేజ ఈ ప్రాజెక్టును దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ ఇళ్ల నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. దీనివల్ల వారికి ఉపాధీ లభిస్తోంది.

కుట్టనాడే ఎందుకంటే...

కుట్టనాడు ప్రాంతవాసుల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. బ్యాక్‌వాటర్‌ వచ్చే ప్రాంతంలోనే మట్టితో వీళ్లు ఇళ్లు కట్టుకునేవారు. వ్యవసాయ పనుల కోసం అక్కడే ఉండాల్సి రావడంతో దూరం వెళ్లి నివసించే పరిస్థితి లేదు. సరిగ్గా ఇలాంటి ప్రాంతంలోనే వరదలను తట్టుకుని పదికాలాల పాటు నిలబడే ఇళ్ల అవసరం ఉంది. సమస్య నుంచి తాత్కాలిక ఉపశమనం కంటే దానికి శాశ్వత పరిష్కారం చూపించాలన్న మహోన్నత లక్ష్యంతో ‘ఈనాడు సహాయనిధి’ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది.

అనుకున్నది అనుకున్నట్లే
- కృష్ణతేజ

లప్పుజ జిల్లాలో ‘ఈనాడు సహాయనిధి’తో ఇళ్లు కట్టిస్తున్నామని సబ్‌ కలెక్టర్‌ వీఆర్‌ కృష్ణతేజ ‘ఈటీవీ భారత్‌’కు తెలిపారు. ఇక్కడ కట్టే ఇళ్లు వరదలు, వర్షాల్లాంటి ప్రకృతి విపత్తులను తట్టుకునేలా ఉండాలని భావించి, ఆ మేరకు ప్రణాళికాబద్ధంగా అడుగులేశామన్నారు. భవిష్యత్తులో తాత్కాలిక తుపాను షెల్టర్లుగా ఉపయోగపడేలా కూడా ఈ ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు. ముందుగా మట్టిని పరీక్షించి.. అక్కడ ఎలాంటి నిర్మాణ సామగ్రి వాడాలో నిర్ణయించినట్లు తెలిపారు. సముద్రమట్టం కంటే ఒకటి నుంచి ఒకటిన్నర మీటర్ల ఎత్తు వరకు పునాది తీసి.. దానిపైన ఇళ్లు కట్టిస్తున్నామన్నారు. 400 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే ఒక్కో ఇంటికి నిర్మాణ వ్యయం రూ.6 లక్షలు అవుతోందని చెప్పారు. నెడికుడి పంచాయతీలో ముందుగా లతాశంకర్‌ కుట్టి అనే మహిళకు ఇల్లు కట్టించి ఇచ్చామని.. ఆమె ఇల్లు పొలం మధ్యలో ఉంటుందని చెప్పారు. ఇటీవల పొలంలోకి వరద నీళ్లు వచ్చినపుడు చుట్టుపక్కల అన్ని ఇళ్లలోకీ నీళ్లు ప్రవేశించినా.. ఈ ఇంట్లోకి మాత్రం ఒక్క చుక్క కూడా వెళ్లలేదని, దాంతో చుట్టుపక్కల వాళ్లు కూడా వచ్చి ఆ ఇంట్లో ఆశ్రయం తీసుకున్నారని తెలిపారు. తాము అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిందంటూ హర్షం వ్యక్తంచేశారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.