close

ప్ర‌త్యేక క‌థ‌నం

అందుబాటులో ఆవాసం

మధ్య, అల్పాదాయ వర్గాలు భరించే స్థాయిలో గృహ నిర్మాణం
ఈ తరహా ఇళ్లు నిర్మిస్తున్న ప్రపంచ నగరాలపై డబ్ల్యూఈఎఫ్‌ విశ్లేషణ

ప్రపంచవ్యాప్తంగా పట్టణాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. పెరుగుతున్న పట్టణ జనాభాకు వసతి కల్పన ఇప్పుడో పెద్ద సవాలు. అదీ అందుబాటు ధరల్లో ఇళ్లు లభ్యమైతేనే మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల వారు భరించగలరు. అలాంటి ఇళ్లకే డిమాండు ఎక్కువ. కానీ ప్రపంచంలోని అనేక నగరాల్లో దాదాపు 90 శాతం ఇళ్ల ధరలు సామాన్యులు భరించేస్థాయిలో లేవని ఇటీవల 200 నగరాల్లో జరిపిన ఓ సర్వే నిగ్గుతేల్చింది. వ్యక్తుల ఆదాయాల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఇళ్ల ధరలు పెరుగుతున్నాయి. డిమాండు, భూ లభ్యత, జనాభా పెరుగుదల, కుటుంబాల విభజన.. ఇత్యాది వాటికి అనుగుణంగా పట్టణాల్లో ఇళ్ల నిర్మాణం జరగడం లేదు. ఈ సమస్యను హేతుబద్ధంగా అధ్యయనం చేసిన ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్‌) ‘నగరాల్లో అందుబాటు ధరలకు ఇళ్ల లభ్యత తప్పనిసరి’ పేరుతో తాజాగా ఒక నివేదికను విడుదలచేసింది. అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించడానికి ఏమేం చేయాలో వివరిస్తూనే.. ప్రపంచంలోని వివిధ నగరాలు కనుగొన్న అత్యుత్తమ పరిష్కారాలను ఈ సందర్భంగా వివరించింది.

భూ సేకరణ
(నగరాలు.. చెంగ్డు, చోంకింగ్‌- చైనా)

కొత్త ఇళ్ల నిర్మాణానికి గ్రామీణ భూమిని వినియోగించే అధికారం చైనాలోని స్థానిక ప్రభుత్వాలకు పరిమితంగానే ఉంటుంది. అందువల్ల ‘భూమికి భూమి కోటా’ అనే కొత్త సూత్రాన్ని చైనాలోని చెంగ్డు, చోకింగ్‌ నగరాలు పాటిస్తున్నాయి. దీని ప్రకారం.. నగర శివార్లలో ఇళ్ల కోసం వినియోగించే భూమికి ప్రత్యామ్నాయంగా నగర సరిహద్దులకు ఆవల భూమిని వ్యవసాయం కోసం చూపాల్సి ఉంటుంది. దీనివల్ల నగర శివార్లలో భూ సేకరణ వ్యయమూ, ఇళ్ల నిర్మాణ వ్యయమూ తగ్గి... అందుబాటు ధరల్లో ఇళ్లు లభ్యమవుతున్నాయి.

స్థానికుల సహకారంతో..
(నగరం.. సిడ్నీ, ఆస్ట్రేలియా) 

ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌ ప్రభుత్వం స్థానిక కమ్యూనిటీలతో మమేకమవుతూ భారీగా సామాజిక ఆవాసాలు, అందుబాటు ధరల్లో ఇళ్లు నిర్మిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వేతర సంస్థలు, ప్రైవేటు రంగం, కమ్యూనిటీ గృహ నిర్మాణ గ్రూపులతో చేతులు కలిపింది. దీనివల్ల సామాన్యులకు అందుబాటు ధరల్లో ఇళ్లను అందిస్తోంది.

నిర్మాణ సామగ్రిలో నవ్యత (భారతదేశం)

భవన నిర్మాణాలకు సంబంధించి మద్రాసు ఐఐటీ సరికొత్త ప్రతిపాదనలు చేసింది. గాజు, ఫైబర్‌ మిళిత జిప్సమ్‌(జీఎఫ్‌ఆర్‌జీ)ని భవన నిర్మాణాలకు వినియోగిస్తే ఖర్చు తగ్గుతుందని సూచించింది. జిప్సమ్‌ వ్యర్థాలతో తయారయ్యే ప్రీఫ్యాబ్రికేటెడ్‌ ప్యానెళ్లను వినియోగించడం వల్ల కాంక్రీటు, ఉక్కు, ఇటుకలు తక్కువగా వాడొచ్చు. నిర్మాణ వ్యయం తగ్గి.. సరసమైన ధరలకు ఇళ్లు అందించడానికి వీలవుతుంది. దాదాపు 10 అంతస్తుల వరకు ఇలాంటి నిర్మాణాలకు భారత ప్రభుత్వం అనుమతించింది.

ఖాళీ స్థలాలు వేరే అవసరాలకు
(నగరం.. లాస్‌ఏంజెలిస్‌- అమెరికా)

ఇళ్లు లేని వారికి శాశ్వత గృహాల కోసం ఖాళీగా ఉన్న మోటెళ్లను వినియోగించడానికి లాస్‌ఏంజెలిస్‌ నగరం ఇటీవల ఓ చట్టం చేసింది. కొత్తగా నిర్మించడం కన్నా ఇవి చౌక. మోటెళ్లలో చిన్నచిన్న మార్పులు చేస్తే నివాసగృహంగా వినియోగించుకోవచ్చు. అల్పాదాయ వర్గాలకు ఇవి అందుబాటు ధరల్లో లభ్యమవుతాయి.

డిజైన్‌ 
(నగరం- డెన్వర్‌, అమెరికా) 

ఆకాశహర్మ్యాల్ని నిర్మించి వాటిపై హరిత పైకప్పులు, సౌర ఫలకాలు ఏర్పాటుచేసే ప్రాజెక్టుల్ని డెన్వర్‌ నగరం అమలుచేస్తోంది. అందుబాటు ధరల్లో గృహ ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రాధాన్యమిస్తోంది. దీనివల్ల అల్పాదాయ వర్గాలకు దీర్ఘకాలంలో జల, వాయు కాలుష్యం ముప్పు, విద్యుత్తు బిల్లులూ తగ్గుతాయి.

నిర్మాణ లోపాల్ని సరిదిద్దుకోవడం 
(నగరం- లండన్‌, ఇంగ్లండ్‌)

నిర్మాణ నైపుణ్యాల్లో లోటుపాట్లను సరిదిద్దుకుంటే గృహ నిర్మాణ వ్యయాలూ తగ్గుతాయి. ఇందుకోసం లండన్‌ నగరం ‘మేయర్‌ కన్‌స్ట్రక్షన్‌ అకాడమీ’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటుచేసింది. నిర్మాణరంగంలో ఉన్న వారికి శిక్షణ ఇప్పించడం, నిధుల సమీకరణ, సామగ్రి అందజేత లాంటి పనుల్ని ఇది చేస్తుంది. నిర్మాణ రంగానికి చేయూతనిచ్చి.. అందుబాటు ధరల్లో ఇళ్లు లభ్యమయ్యేలా చూడటం దీని ఉద్దేశం. 

అర్హులకే 
(నగరం- డ్యుప్‌నిట్సా, బల్గేరియా) 

దాదాపు 150 సామాజిక గృహ యూనిట్లను నిర్మించిన డ్యుప్‌నిట్సా నగరం వీటికి కొన్ని అర్హతలు నిర్దేశించింది. ఈ ఇళ్ల లబ్దిదారులకు ఎలాంటి ఆస్తి ఉండకూడదు, ఆదాయం నిర్దిష్ట పరిమితి దాటకూడదు. వ్యక్తుల ఉపాధి, విద్య స్థాయి, వయసు, ఎంతమంది పిల్లలు అనే ప్రాతిపదికగా వారి దరఖాస్తుల్ని పరిశీలిస్తారు. దీని ఉద్దేశం మధ్యతరగతి, అల్పాదాయ వర్గాలకు ఇళ్లు అందివ్వడమే.

ఇంటి యాజమాన్యం 
(నగరం-మెల్‌బోర్న్‌, ఆస్ట్రేలియా)

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో ‘బార్నెట్‌ మోడల్‌ డెవలప్‌మెంట్‌’ పేరుతో ఓ అపార్ట్‌మెంట్‌ ప్రాజెక్టును చేపట్టారు. ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టు ఇది. ఇందులోని 34 అపార్ట్‌మెంట్‌లలో ఆరింటిని మార్కెట్‌ ధరకు విక్రయిస్తారు. తద్వారా ఎక్కువగా వచ్చిన మొత్తాన్ని మిగతా 28 సామాజిక గృహ వినియోగదారులకు సబ్సిడీ కింద ఇస్తారు. ఇది అల్పాదాయ వర్గాలకు మేలు.

‘‘ప్రపంచంలో కేవలం 13 శాతం నగరాల్లో మాత్రమే అందుబాటు ధరల్లో ఇళ్లు లభ్యమవుతున్నాయి’’

- ఐక్యరాజ్యసమితి 

ఆవాసాల నివేదిక 

అందుబాటు  ధరలకు ఇళ్లు అందించడానికి నగర పాలక మండళ్లు చేపట్టాల్సిన నిర్మాణాత్మక చర్యల్ని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) నివేదిక విస్పష్టంగా వివరించింది. 

చేయాల్సిందేమిటి?

* పారదర్శకంగా భూ సేకరణ
* భూమిపై ఆస్తి హక్కు కల్పన
* సరికొత్త ఫైనాన్సింగ్‌ పద్ధతులకు అవకాశమివ్వడం
* నిర్మాణ రంగంలో నైపుణ్యాలకు ప్రోత్సాహం
* ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం
* నిర్మాణ వ్యయాలు పెరగకుండా చూడటం, ఆధునిక సాంకేతికత వినియోగం
* 3 డీ ప్రింటింగ్‌, ప్రత్యామ్నాయ సామగ్రి వాడకం
* ఇంధన ఆదా గృహాల నిర్మాణానికి సరికొత్త నమూనాల అభివృద్ధి 
* ఇళ్ల నిర్మాణంలో లాభాపేక్షలేని వారిని ప్రోత్సహించడం
* సామూహిక గృహ నిర్మాణాల కోసం స్థానిక కమ్యూనిటీలతో కలిసి పనిచేయడం

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.