close

ప్ర‌త్యేక క‌థ‌నం

సాగుకు ఎదురీత

నైరుతి ఆలస్యం... వర్షాలు అంతంతమాత్రం 
ఊపందుకోని ఖరీఫ్‌ పంటల సాగు 
చెరువులు, బోర్లలో పెరగని నీటి మట్టాలు 
భారీ వర్షాల కోసం అన్నదాతల ఎదురుచూపు 
ఆరుద్రలోనూ చినుకు రాలకుంటే దిగుబడులు దిగదుడుపే 
బ్యాంకుల్లో పూర్తి బకాయి చెల్లిస్తేనే కొత్త పంటరుణం 
మాఫీ ఆశతో బకాయి కట్టేందుకు ముందుకురాని రైతులు 
జనగాం, సిద్దిపేట జిల్లాల నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి

తొలకరి ఆశలు సన్నగిల్లుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యాయి. ఎక్కడా జలవనరుల్లోకి నీరు చేరలేదు. నాలుగు బొట్లుగా పడిన జల్లులతో నేలతల్లి దాహమే తీరలేదు. రోహిణి, మృగశిర కార్తెల్లో చినుకు జాడ లేక నిరాశే మిగిలింది. ‘ఆరు కార్తెలు పోతే.. ఆరుద్ర కార్తే దిక్కు’ అనుకుని రైతులు భారీ వర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ కార్తెలో విత్తనాలు, నారు పోయకుంటే ఇక ఈ సీజన్‌లో పంట దిగుబడి పడిపోతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అడపాదడపా వర్షాలు కురుస్తున్నా అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. జూన్‌ తర్వాత వర్షాలు పడి విత్తులు వేసినా పంటలకు తెగుళ్ల బెడద ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతుండడం వారికి మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితిపై ‘ఈనాడు’ క్షేత్రస్థాయి పరిశీలనతో అందిస్తున్న కథనం. 

చినుకు పడేదెన్నడు.. నేల తడిసేదెన్నడని రైతులు ఎదురుచూస్తున్నారు. వానజల్లు లేక పల్లెల్లో వ్యవసాయ పనులు ఊపందుకోలేదు. గతేడాది 16 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులేర్పడ్డాయి. ఈ వానాకాలం (ఖరీఫ్‌) సీజన్‌లోనూ ప్రస్తుతం 27 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నాయి. ఈనెల ఇప్పటివరకూ ఆరు జిల్లాల్లో మాత్రమే సాధారణ స్థాయిలో వర్షాలు కురిశాయి. రాష్ట్ర సగటు వర్షపాతం 106.1 మిల్లీమీటర్ల (మి.మీ.)కు గాను 68.1 మి.మీ.లే కురిసింది. ఇది సాధారణంకన్నా 36 శాతం తక్కువ. కొన్ని జిల్లాల్లో అయితే సాధారణంకన్నా 60 నుంచి 70 శాతం వరకూ తక్కువ వర్షపాతం నమోదైంది. కాంక్రీట్‌ జంగిల్‌గా పేరొందిన హైదరాబాద్‌ జిల్లాలో సాధారణంకన్నా 7 శాతం అధిక వర్షపాతముంటే అడవుల జిల్లా ములుగులో సాధారణంకన్నా 70శాతం తక్కువ కురిసింది. వర్షాలు లేనందున విత్తనాలు, ఎరువులు కొనేందుకు రైతులు కూడా పెద్దగా ముందుకు రావడం లేదని జనగాం జిల్లా బచ్చన్నపేటకు చెందిన ఎరువుల వ్యాపారులు తెలిపారు. రైతుబంధు పథకం కింద ఇప్పటికే 33.70 లక్షలమంది రైతుల ఖాతాల్లో వ్యవసాయశాఖ రూ.3,430 కోట్లను జమచేసింది. సాగు ఖర్చులకు సొమ్ము చేతికందినా వర్షాలు లేక ఎదురుచూస్తున్నారు. ఈఏడాది కోటీ 28లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి సాధించాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ వర్షాల ఆలస్యం వల్ల లక్ష్య సాధన కొంత కష్టంగానే కనిపిస్తోంది. 
వడ్డీ కడితే పునరుద్ధరణ 
గతేడాది ఖరీఫ్‌లో అంటే 2018 జూన్‌ 20న ఓ రైతు బ్యాంకు నుంచి రూ.లక్ష పంటరుణం తీసుకుంటే అతను తిరిగి 2019 జూన్‌ 19లోగా తిరిగి చెల్లిస్తే వడ్డీ కట్టనవసరం లేదని ‘వడ్డీ లేని పంటరుణం’ (వీఎల్‌ఆర్‌) పథకాన్ని వ్యవసాయశాఖ అమలుచేస్తోంది. కానీ దాదాపు అన్ని బ్యాంకులు వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఏడాది క్రితం రూ.లక్ష పంటరుణం తీసుకున్న రైతు నుంచి 7 శాతం వడ్డీ కింద రూ.7,000 కట్టించుకుంటున్నట్లు జనగాం జిల్లా బచ్చన్నపేటలోని ఓ బ్యాంకు అధికారి తెలిపారు. ఈ వడ్డీ కట్టిన రైతు పాత బాకీ మొత్తం కట్టినట్లుగా రాసుకుని కొత్త పంటరుణం ఇస్తున్నట్లు తెలిపారు. పాత బాకీ కింద మొత్తం రూ.లక్షా ఏడు వేలు కట్టమని అడిగితే రైతులు ముందుకు రావడం లేదని, అందువల్ల వడ్డీ సొమ్ము రూ.7 వేలు కట్టించుకుని పాత బాకీ పూర్తిగా కట్టినట్లు రాసి, తిరిగి కొత్త రుణం ఇచ్చినట్లు మంజూరుచేసి పాతబాకీని వసూలులో చూపుతున్నట్లు చెప్పారు. కానీ రుణమాఫీ రాదేమోనన్న భయంతో చాలామంది రైతులు ఇలా వడ్డీ కట్టి రెన్యూవల్‌ చేసుకోడానికి కూడా ముందుకు రావడం లేదని సదరు అధికారి వివరించారు. దీనివల్లనే పంటరుణాల పంపిణీ చేయలేకపోతున్నట్లు వివరించారు. కొన్ని బ్యాంకుల్లో మాత్రమే పూర్తిగా బకాయి కట్టిన రైతులకే కొత్త రుణం ఇస్తున్నట్లు బ్యాంకు మేనేజర్లు తెలిపారు. 
ఆదిలాబాద్‌, మంచిర్యాల, కుమురం భీం తదితర జిల్లాల్లో పంటరుణాల బాకీలను బ్యాంకులకు కట్టేందుకు వచ్చే పేద రైతులతోనూ కొందరు దళారులు వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. ఒక రైతుకు బ్యాంకులో పాత బాకీ రూ.లక్ష ఉంటే అతనికి రూ. 2,000 వడ్డీకి వారంలోగా తిరిగి చెల్లించే ఒప్పందంతో దళారులు అప్పు ఇస్తున్నారు. ఆ సొమ్ము బ్యాంకులో కట్టేసి కొత్త రుణం వారంలోగా తీసుకుని సదరు దళారీకి రైతు చెల్లించాలనేది ఈ ఒప్పందాల సారాంశం.

ఉపాధి పనులూ లేవు.. 
వర్షాలు లేక వ్యవసాయ పనులు ఊపందుకోలేదు. పల్లెల్లో పనులు లేక ఉపాధి ఉండటం లేదని సిద్దిపేట జిల్లా లకుడారం గ్రామస్థులు ‘ఈనాడు’కు చెప్పారు. తమ గ్రామంలో గతేడాది, ఈ ఏడాది సరిగా వర్షాలు లేవని చెప్పారు.

కొత్త రుణాలకు వెళ్లని రైతులు 

ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమై నెల కావస్తున్నా ఇంతవరకూ బ్యాంకుల్లో పంటరుణాల పంపిణీ జాడేలేదు. చాలా బ్యాంకుల్లో ఇంతవరకూ కొత్త రుణాలను రైతులు అడగటం లేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారు 
ఉదాహరణకు సిద్దిపేట జిల్లా ముస్త్యాలలోని ఎస్‌బీఐలో గతేడాది 600 మంది వరకూ రైతులు పంటరుణాలు తీసుకున్నారు. వీరిలో ఇప్పటివరకూ 45 మంది మాత్రమే పాత బాకీ కట్టి కొత్త పంటరుణం తీసుకున్నారని (రెన్యూవల్‌) బ్యాంకు అధికారి ఒకరు చెప్పారు. పాత బాకీ పూర్తిగా కట్టేందుకు రైతులు ముందుకు రావడం లేదని, రుణమాఫీ కింద ప్రభుత్వం నిధులు ఇస్తుందేమోనని ఎక్కువమంది ఎదురుచూస్తున్నారని ఆయన వివరించారు.

20 ఏళ్లలో మొదటిసారి బోరు పూర్తిగా ఎండిపోయింది

నాకు 15 ఎకరాల భూమి ఉన్నా ఇప్పటివరకూ వర్షాలు లేక కనీసం దుక్కి కూడా దున్నలేదు. గత 20 ఏళ్లలో మా పొలంలో బోరు మొదటిసారిగా పూర్తిగా ఎండిపోయింది. చెరువులోనూ చుక్కనీరు లేదు. వర్షాలు లేక అగమ్యగోచరంగా ఉంది. బోరులో నీరు రాకుంటే పంటలు సాగు చేయలేం. గతంలో ఎప్పుడూ ఈ సమయానికి వరి నార్లు పోసి, ఇతర పంటల విత్తనాలు వేసేవాళ్లం. ఇప్పటికైనా వర్షాలు లేకపోతే ఈసారికి సాగు మానేయాల్సిందే. 

- పి.రాజిరెడ్డి, రైతు, బచ్చన్నపేట, జనగాం జిల్లా 

రూ.3 వడ్డీకి అప్పులు తెచ్చాను 

నాకు 3 ఎకరాల భూమి ఉంది. రెండు బోర్లు వేయిస్తే నీరు రాక ఎండిపోయాయి. మా ప్రాంతంలో వర్షాలు లేవు. గతేడాది కంది, వరి సాగుకు రూ.వందకు నెలకు రూ.3 చొప్పున వడ్డీ కట్టే ఒప్పందంతో రూ.60 వేల అప్పు చేశాను. పంట సరిగా రాక అది తీర్చలేకపోయాను. ఇప్పుడు వానలు పడితేనే పంటలు సాగుచేస్తాను. 

-  ఎల్లోల నర్సయ్య, రైతు, తవుసుపల్లి, సిద్దిపేట జిల్లా 

3 నెలలుగా పంటరుణం కోసం  తిరుగుతున్నా 

నాకు ఎకరం భూమి ఉంది. వానాకాలం సాగు కోసం పెట్టుబడి దొరక్క బ్యాంకు రుణం కోసం 3 నెలలుగా తిరుగుతున్నాను.ధరణి పోర్టల్‌లో వివరాలు కనిపించేదాకా కొత్త పంటరుణం ఇవ్వం అని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. చేసేది లేక బయట వ్యాపారుల వద్ద అప్పు తీసుకునేందుకు తిరుగుతున్నా.

-  రామావత్‌ బాప్యా, రైతు, నర్సాయపల్లి, నాగర్‌కర్నూలు జిల్లా 

వర్షం కురవక ఎండిపోతున్నాయి

సొంత భూమి ఆరు ఎకరాలు ఉండగా.. 15 ఎకరాలు కౌలుకు తీసుకున్నా.. ప్రారంభంలో కురిసిన వర్షాలకు మూడు ఎకరాల్లో పత్తి, మిగిలిన భూమిలో సోయా విత్తుకున్నాను.. మొలకలు వచ్చినప్పటి నుంచి వర్షం కురవక ఎండిపోతున్నాయి. మరో మూడు రోజుల్లో వర్షం కురియకపోతే తిరిగి విత్తుకోవల్సిందే. 

-  లస్మన్న యాదవ్‌, కౌలు రైతు, జైనథ్‌, ఆదిలాబాద్‌ జిల్లా 

దీర్ఘకాలిక వంగడాల జోలికి పోవద్దు 

తెలంగాణలో వ్యవసాయ పనులకు జూన్‌లో కురిసే తొలకరి వర్షాలు చాలా కీలకం. ఈనెల 29 వరకూ రాష్ట్రమంతా భారీ వర్షాలు పడే సూచనలేమీ లేవని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల మొత్తంమీద వర్షపాతం లోటు 30 శాతానికి పైగా ఉంటే పంటల దిగుబడి 10 శాతం వరకూ తగ్గే అవకాశాలున్నాయి. వరి రైతులు దీర్ఘకాలిక వంగడాల సాగుకు పోవద్దు. 120 రోజుల్లోపు చేతికొచ్చే వరి వంగడాలనే వేయాలి. మొక్కజొన్నలో 90 రోజులకే పంట చేతికొచ్చే సంకరజాతి విత్తనాలనే సాగుచేయాలి. జులై 15 తరవాత సోయా చిక్కుడు సాగుచేయకూడదు. వర్షాలు ఆలస్యం కావడం వల్ల జులైలో వేసే పంటలకు తెగుళ్ల వ్యాప్తి కూడా అధికంగా ఉండే ప్రమాదం ఉంది. ప్రధానంగా రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. రైతులు అప్రమత్తంగా ఉండాలి. 

- డాక్టర్‌ జగదీశ్వర్‌, పరిశోధనా సంచాలకుడు, జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం 

 వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. 

గతేడాది తీసుకున్న పంటరుణం బకాయిని తిరిగి కట్టేటప్పుడు రైతులు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. వడ్డీ లేని రుణాల పథకం కింద త్వరలో నిధులు విడుదల చేస్తాం. రుణమాఫీ పథకం అమలుకు త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులిస్తుంది. పాత బాకీ చెల్లించిన రైతులకు కొత్త పంటరుణం ఇవ్వాలని బ్యాంకులకు చెప్పాం. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 

-  సి.పార్థసారథి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.