Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

పుడమి ఊపిరితిత్తుల్లో మంట

అమెజాన్‌ అడవుల్లో భగ్గుమన్న కార్చిచ్చులు
కనీవినీ ఎరుగని రీతిలో అటవీ సంపద ఆహుతి
శరవేగంగా పొరుగు దేశాలకూ విస్తరణ
అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన

బ్రెజిల్‌ అడవుల్లో ఈ ఏడాది ఇప్పటివరకూ 72,843 చోట్ల కార్చిచ్చులు సంభవించాయి. వీటి ధాటికి అమెజాన్‌ అడవులు సగానికిపైగా బుగ్గిపాలయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ అటవీ మంటలు 80% పెరిగాయి. ఈ చిచ్చు అంతర్జాతీయంగా రాజకీయ వేడినీ పెంచింది.

పుడమికి ఊపిరితిత్తులుగా భావించే అమెజాన్‌ వర్షారణ్యం.. అగ్నికీలల్లో బుగ్గయిపోతోంది. గత కొన్నేళ్లలో కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ కార్చిచ్చులు ఈ అడవులను దహించేస్తున్నాయి. ఆగస్టు 14న బ్రెజిల్‌లో కొన్నిచోట్ల మాత్రమే కనిపించిన మంటలు... ఎగిసిఎగిసి వేలాది ప్రాంతాలకు, పొరుగు దేశాలకు శరవేగంగా విస్తరిస్తుండటం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. అమెజాన్‌ కార్చిచ్చులు రాజకీయంగానూ ‘మంట’ పుట్టిస్తున్నాయి.

బ్రెజిల్‌లో పగలు రేయిలా... రేయి పగలులా అనిపిస్తోంది. వారం రోజులుగా ఆకాశం ముదురు బూడిద రంగులో కనిపిస్తోంది. రాత్రి వేళ అగ్నివర్ణపు ధగధగలు దూరం నుంచి ఎగిసిపడుతున్నాయి. ఎక్కడకెళ్లినా పచ్చికట్టెలు కాలుతున్న వాసనే. 55 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన దట్టమైన అమెజాన్‌ అడవులు మంటల్లో ఆహుతైపోతున్నాయి.

మూగజీవులు విలవిల..
దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌లో 60% ఉన్న ఈ అడవులు... పెరూ, కొలంబియా, వెనెజువెలా, ఈక్వెడార్‌, బొలీవియా, గయానా, సరినామ్‌, ఫ్రెంచ్‌ గయానా తదితర దేశాల్లోనూ విస్తరించాయి. సుమారు 400-500 అమెరికన్‌ సంచార గిరిజన తెగలతో పాటు... 2,000 రకాల జీవ జాతులకు అమెజానే స్వర్గం. సర్వం. గోరుచుట్టుపై రోకటి పోటు ఎలా ఉంటుంది? అమెజాన్‌ పరిస్థితీ ఇప్పుడదే! వ్యవసాయం, గనుల తవ్వకం, పశువుల పెంపకం వంటి కార్యకలాపాలతో పాటు ట్రాన్స్‌-అమెజానియన్‌ హైవే నిర్మాణం కారణంగా ఈ అటవీ ప్రాంతం ఇప్పటికే 20 శాతం కుంచించుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున కార్చిచ్చులు చెలరేగడం అత్యంత విపత్కర పరిణామం.

ఈ ఏడాదే ఎక్కువ...

2013 నుంచి (ఏటా జనవరి-1, ఆగస్టు-21) గతేడాది వరకూ ఎప్పుడూ ఇంతగా కార్చిచ్చులు సంభవించలేదు. 2016లో కాస్త ఎక్కువగానే మంటలు చెలరేగినా ఇప్పుడంత స్థాయిలో మాత్రం కాదు. బ్రెజిల్‌ ఉత్తరభాగంలోని రొరైమా, ఏకెర్‌, రాండోనియా, అమెజొనస్‌లో భారీగా మంటలు చెలరేగుతుండగా మిగతాచోట్ల అదుపు చేయదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. మిగతా దేశాల్లోనూ కార్చిచ్చులు ఎగిసిపడుతుండటం ఇప్పుడు మరింత ఆందోళనకు కారణమవుతోంది.

ప్రపంచానికి జీవ వాయువును అందించే అమెజాన్‌ అడవులను తక్షణం పరిరక్షించుకోవాలి.’
 
- ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ 
అమెజాన్‌ అడవులు పుడమికి ఊపిరితిత్తుల్లాంటివి. మానవాళికి అవసరమైన ప్రాణవాయువులో 20% అవి ప్రసాదించినవే. ఇప్పుడవి మంటల్లో చిక్కుకుపోయాయి. మనందరి ఇల్లు కాలిపోతోంది. ఇదొక అంతర్జాతీయ సంక్షోభం. జి-7 దేశాలు దీనిపై చర్చించాలి.’
 
- ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌
ప్రాంతీయ దేశాల భాగస్వామ్యం లేకుండా కేవలం జి-7 దేశాలు మాత్రమే కార్చిచ్చులపై చర్చించాలనుకోవడం (మెక్రాన్‌) వలసవాద మానసిక ధోరణికి అద్దం పడుతోంది. స్వచ్ఛంద సంస్థల తీరు; ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రైతులు మంటలు అంటించడం వల్లే ఈ విపత్కర పరిస్థితి ఎదురైంది. మంటలను అదుపు చేయడంలో పశ్చిమదేశాల జోక్యం అవసరం లేదు.’
 
-బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారో 
ప్రమాదవశాత్తూ అంటుకున్న మంటల కంటే మానవ తప్పిదాలవల్లే అమెజాన్‌లో ఎక్కువ చోట్ల కార్చిచ్చులు చెలరేగాయి.’
 
-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్పేస్‌ రీసెర్చ్‌ పరిశోధకుడు ఆల్బెర్టో సెట్జర్‌
అమెజాన్‌ కార్చిచ్చులు తీవ్ర ఆందోళనకరం, భీతావహం. ఇది అత్యంత అత్యయిక పరిస్థితి.’
 
- జర్మనీ

ఎగిసిన నిరసనలు

లండన్‌లోని బ్రెజిల్‌ రాయబార కార్యాలయం వద్ద శుక్రవారం పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు వందలమంది గుమిగూడి ఆందోళన వ్యక్తం చేశారు. ‘వినాశనాన్ని ఆపండి, పుడమిని రక్షించండి’ అంటూ ప్లకార్డులు, బ్యానర్లు చేతబూని నిరసన వ్యక్తం చేశారు. పర్యావరణ వ్యతిరేక విధానాలను బ్రెజిల్‌ మానుకోవాలని డిమాండ్‌ చేశారు.
- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.