close

ప్ర‌త్యేక క‌థ‌నం

సరిజోడు కోసం.. స్వయంవరమే!

రాజీపడని నేటి యువతులు
ఎంపిక నిర్ణయం పూర్తిగా వారిదే
నచ్చినవాడి కోసం ఎన్నేళ్లయినా ఆగడానికి సిద్ధం
చదువు, ఉద్యోగాలతో చైతన్యం
పెరుగుతున్న సగటు వివాహ వయసు
అబ్బాయిల ధోరణిలోనూ మార్పు

* వధూవరుల ఎంపికలో 70-80 శాతం తల్లిదండ్రులు తమ పిల్లల ఇష్టానికే ప్రాధాన్యమిస్తున్నారు. కేవలం 20-30 శాతం మాత్రమే కన్నవారి సూచనలకు అనుగుణంగా సర్దుకుపోతున్నారు.
* ఓ సంస్థ అధ్యయనం ప్రకారం 80 శాతం మంది ఆడపిల్లలు, 60 శాతం మగపిల్లలు ఆన్‌లైన్‌ ద్వారా చూసిన ఫొటోలు/బయోడేటా నచ్చాకే పెళ్లిచూపులకు అంగీకరిస్తున్నారు.
* రెండుమూడేళ్ల క్రితం వరకు మ్యాట్రిమొనీ వెబ్‌సైట్లలో వివాహం కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకునే యువతీయువకుల సగటు వయసు 26-28 ఉండేది. ప్రస్తుతం అది 29-33కి చేరిందంటూ ఓ వివాహ వెబ్‌సైట్‌ ప్రతినిధి వివరించారు.

మహారాజులు తమ కుమార్తెలకు వివాహవయసు రాగానే ఆ రోజుల్లో స్వయంవరాలు ఏర్పాటు చేసేవారు.యువరాణితో పాణిగ్రహణం చేసేందుకు చుట్టుపక్కల రాజ్యాల యువరాజులంతా కొలువుదీరేవారు. యువరాణీవారు వారిలోని ఒకరి మెడలో వరమాల వేసేది. నిర్ణయాధికారం పూర్తిగా ఆమెదే. అలాగే ఇప్పుడు ప్రతి యువతీ ఒక యువరాణిగా మారి తనకు నచ్చినవాడిని ఎంచుకుంటోంది. ఆన్‌లైన్‌లో కొలువుదీరే వరుల్లో తనకు అన్నివిధాలా సరిపోయేవాడిని వెతికి పట్టుకుంటోంది. మనసుకు నచ్చేవాడు దొరికేవరకు ఎన్నేళ్లయినా ఎదురుచూస్తోంది.

అవును...
అమ్మాయిలు తమ అభిప్రాయాలను దాచుకోవడం లేదు. కాబోయే భర్త గురించి తమ ఆకాంక్షలను సూటిగా స్పష్టంగా చెప్తున్నారు. బయోడేటా చూసే దశలోనే ఆస్తిపాస్తులు, అందం, చదువు, కుటుంబనేపథ్యం, అలవాట్లు అన్నీ చూసుకుని ముందడుగేస్తున్నారు. తమ అంచనాలకు తగ్గట్లు లేని అబ్బాయిలను మొహమాటం లేకుండా తిరస్కరిస్తున్నారు. ఎన్ని సంబంధాలు చూసేందుకైనా...ఎన్నేళ్లు ఆగడానికికైనా వారు వెనకాడటం లేదు.

* హైదరాబాద్‌ అమ్మాయి. కాలేజి బ్యూటీగా గుర్తింపు. చదువులోనూ రాణింపు. ఎంబీఏ ఆఖరి సంవత్సరంలో ఉండగానే ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగం సంపాదించింది. జీవిత భాగస్వామి ఎంపికలో తల్లిదండ్రులు ఆమెకు పూర్తిస్వేచ్ఛనిచ్చారు.తగిన జోడీకోసం మ్యాట్రిమొనీ వెబ్‌సైట్లలో వెతుకులాట ప్రారంభించింది. బయోడేటా, ఫొటోలను చూస్తూ రెండేళ్లు గడిచినా తాను కోరుకునే అన్ని అంశాలున్న యువకుడు తారసపడలేదంటూ కుటుంబ సభ్యులకు చెబుతూవస్తోంది. ఒకరు ఎత్తుగా లేరని.. మరొకరికి తనకంటే తక్కువ ప్యాకేజి అని, కొందరు కుర్రాళ్లు వేతనంలో ఎక్కువమొత్తాన్ని ఈఎంఐలకు ఖర్చుచేస్తున్నారని.. ఇలా ఏదోఒక అంశం తనకు నచ్చలేదంటూ నాలుగేళ్లు నెట్టుకొచ్చింది. అయినా సర్దుకుపోదామని తాను అనుకోవట్లేదు. రాజీపడి ఎవరో ఒకర్ని పెళ్లిచేసుకోవాలని చెప్పేందుకు కన్నవారూ ధైర్యం చేయట్లేదు.

* గుంటూరు జిల్లా యువకుడు దిల్లీ ఐఐటీలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేశాడు. 24వ ఏటనే ప్రముఖ కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. మరుసటి సంవత్సరం బంధువులు తమ కూతుర్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. తను మాత్రం కెరీర్‌లో మరో మెట్టు చేరాక పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దానికి మరో మూడేళ్లు పట్టింది. ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు చేస్తుండగా.. హైదరాబాద్‌లో సొంత విల్లా కొన్నాక వివాహమంటూ మెలికపెట్టాడు. అప్పటికే మూడు పదులు దాటాయి. ఇంట్లో ఒత్తిడి మొదలుకావటంతో పెళ్లిచూపులకు సిద్ధమయ్యాడు. ఆరు నెలల వ్యవధిలో ఏడెనిమిది ప్రాంతాలు చుట్టొచ్చాడు. వాటిలో ఐదుచోట్ల.. ‘అమ్మాయితో పోల్చితే అబ్బాయి వయసు చాలా ఎక్కువంటూ ముఖంమీదే వద్దని చెప్పినంత పనిచేశారు. ఫలితంగా కులపట్టింపులు లేకుండా సరైన జోడి దొరికితే పెళ్లికి సిద్ధం అని స్నేహితులతో అంటున్నాడు.

కొన్నేళ్ల క్రితం వరకూ కుమారులు, కూతుళ్ల వివాహ విషయంలో కుటుంబసభ్యుల మాటే వేద వాక్కు. ఏవైనా లోటుపాట్లున్నా సర్దుకుపోయేందుకు వారిని మానసికంగా సిద్ధం చేసేవారు. అధికశాతం కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రుల మాటకు విలువనిచ్చేవారు. ప్రస్తుతం యువత ఆలోచనాధోరణిలో మార్పులు వస్తున్నాయి. తాము ఎంపిక చేసుకునే జీవిత భాగస్వామిపై భారీగా అంచనాలు పెంచుకుంటున్నారు. ఏ ఒక్కటి తక్కువైనా పెళ్లిమండపం నుంచి కూడా వెళ్లిపోయేందుకూ సిద్ధమవుతున్నారంటూ ఓ వివాహ పరిచయవేదిక నిర్వాహకుడు తెలిపారు. ఒకప్పుడు నిశ్చితార్థం పూర్తయితే చాలు. సగం పెళ్లయినట్టుగానే భావించేవారు. ప్రస్తుతం పెళ్లి జరిగేంతవరకూ భయపడాల్సి వస్తోందంటూ ఆందోళన వ్యక్తంచేశారు.

వీడియో బయోడేటా నేటి ట్రెండ్‌
ఇటీవలి వరకు వధూవరుల ఫొటో ఒక్కటి ఇస్తే సరిపోయేది. ఇప్పుడు వీడియో బయోడేటా ట్రెండ్‌ మొదలైంది. వధూవరుల సమాచారం తెలిపేలా కొందరు గంట, రెండు గంటల వ్యవధిగల వీడియోలను ఆన్‌లైన్‌లో ఉంచుతున్నారు. కుటుంబ సభ్యులు, ఇల్లు, కార్యాలయాల వాతావరణంతో పాటు తమ జీవనశైలిని ప్రతిబింబించేలా వీటిని చిత్రీకరిస్తున్నారు. పెళ్లి కావాలంటే ఏడెనిమిది గంటల సమయం కేవలం వీడియో చిత్రీకరణకు కేటాయించాల్సిందేనంటూ మాదాపూర్‌ నివాసి ఒకరు తెలిపారు. మూడు నుంచి ఆరు నెలలకోసారి మ్యాట్రిమొనీ వెబ్‌సైట్లలో తన ఫొటో మార్చాల్సి వస్తోందని అన్నారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం ఖాతాలనూ పరిగణనలోకి తీసుకొని వ్యక్తిత్వాలను అంచనా వేసుకొంటున్నారు.

అందం కోసం ఆరాటం

తనతో సమానంగా సంపాదన ఉండాలనుకోవడమే కాకుండా చూడగానే వావ్‌ అనిపించేలా జీవిత భాగస్వామి ఉండాలనే అభిప్రాయం ఎక్కువ అవుతోంది. ‘మేడమ్‌ మీరేమైనా చేయండి. పెళ్లయ్యేంత వరకైనా నా జట్టు ఊడకుండా చూడండి. ఖర్చెంతైనా పర్లేదు. నా జుట్టు పలుచగా ఉందంటూ పెళ్లిచూపుల్లో ఆడపిల్లలు చులకన చేస్తున్నారంటూ’ ఓ యువకుడు కన్నీరు పెట్టుకున్నంత పనిచేశాడని చర్మవ్యాధి నిపుణురాలు ఒకరు చెప్పారు. నలుపు, చామనఛాయగా ఉన్న ఆడపిల్లలు తెల్లగా కనిపించేందుకు తన వద్దకు వస్తున్నట్టు ఆమె వివరించారు. ‘ఊబకాయం, అధికబరువుతో ఇబ్బంది పడే యువతీ యువకులు పెళ్లిపీటలు ఎక్కేముందు వ్యాయామం ప్రారంభించేవారు. ప్రస్తుతం పెళ్లిచూపులకు మూడు నెలల ముందు నుంచే కసరత్తులు, యోగశిక్షణ వైపు అడుగులు వేస్తున్నారు. నగరంలోని పలు వ్యాయామకేంద్రాల్లో కేవలం వధూవరుల కోసం ప్రత్యేక ప్యాకేజీ అందిస్తున్నారు. తాము కోరుకున్న లావణ్యం, శరీరరూపు తీర్చిదిద్దేందుకు పోషకాహారం, వ్యాయామ ప్రక్రియలను రూపొందిస్తున్నారని  ఫిట్‌నెస్‌ శిక్షకుడు మహ్మద్‌ ఆదిల్‌ తెలిపారు.

తల్లిదండ్రులే చెప్పాలి

‘‘సరైన జోడీ కోసం వెతుకులాటలో పెరుగుతున్న వయసును గుర్తించలేకపోతున్నారు. భవిష్యత్‌లో ఇది మరింత ఇబ్బందిగా మారుతుంది. అన్నిరంగాల్లో ఉపయోగపడుతున్న సాంకేతిక పరిజ్ఞానం వధూవరుల ఎంపిక విషయంలో ఇబ్బందిగా మారుతోంది. కన్నబిడ్డల ఇష్టాయిష్టాలను గౌరవిస్తూనే వారికి తల్లిదండ్రులే మార్గదర్శనం చేయాలి’’


-శుభమస్తు వివాహ పరిచయ వేదిక ఎండీ రమేష్‌

రాజీపడని ధోరణి పెరిగింది 

‘‘అమ్మాయిలైనా, అబ్బాయిలైనా చదువు పూర్తవగానే ఏదో ఉద్యోగంలో చేరిపోతున్నారు. ఒకప్పటిలా తల్లిదండ్రులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆర్ధికస్వేచ్ఛతో తాము ఆశించినట్టుగా జీవించాలనే ఆలోచన పెరుగుతోంది. అందువల్లే జీవిత భాగస్వామి విషయంలో ఎవరూ రాజీ పడటంలేదు’’


-శ్రీకృష్ణదేవరాయ వివాహ పరిచయ వేదిక ప్రతినిధి సత్యనారాయణ
- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.