close

ప్ర‌త్యేక క‌థ‌నం

చౌకగా సౌర విద్యుత్‌

ప్లాంటు ఏర్పాటు వ్యయం మరింత తక్కువ
గతేడాది కిలోవాట్‌ ఏర్పాటు వ్యయం రూ.68 వేలు
ఇప్పుడు రూ.42,500 ఏర్పాటు చేస్తామన్న కంపెనీలు

సౌర విద్యుత్‌ మరింత చౌకగా లభించనుంది. గతం కన్నా తక్కువ ధరకు ఇస్తామని పలు ప్రైవేటు కంపెనీలు ముందుకొచ్చాయి. గతేడాది కిలోవాట్‌కు రూ.68 వేలను సౌర ఫలకాల ఏర్పాటుకు కంపెనీలు వసూలు చేయగా ఇప్పుడు కనిష్ఠంగా రూ.42,500కే ఇస్తామని ముందుకొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ సంస్థల భవనాలు లేదా ఖాళీ స్థలాల్లో సౌరఫలకాల ఏర్పాటుకు ధరలు చెప్పాలని ‘రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ’(టీఎస్‌ రెడ్కో) ఇటీవల టెండర్లు పిలిచింది. పది కిలోవాట్లలోపు ఉత్పత్తి సామర్థ్యమున్న సౌరవిద్యుత్తి ఫలకాలను భవనంపై(రూఫ్‌ టాప్‌) ఏర్పాటుకు సగటున కిలోవాట్‌కు రూ.54 వేల వ్యయం అవుతుందని ‘కేంద్ర నూతన, సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వశాఖ’(ఎంఎన్‌ఆర్‌ఈ) తెలిపింది. తెలంగాణలో 10 కిలోవాట్లలోపు అయితే సగటున భవనంపై అయితే రూ.52 వేలకు, భవనం ఆవరణలోని ఖాళీ స్థలంలో అయితే రూ.51 వేలకు ఏర్పాటు చేస్తామని ప్రైవేటు కంపెనీలు ముందుకొచ్చాయి. ఒకవేళ ఒకే కార్యాలయానికి 100 కిలోవాట్ల సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యానికి మించి అయితే సగటున కిలోవాట్‌కు రూ.42,500 ఇస్తే చాలని కనిష్ఠ ధరను కోట్‌ చేశాయి. ఇది ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన అతి తక్కువ ధర అని రెడ్కో వర్గాలు వివరించాయి.

యూనిట్‌ ప్రకారమైతే..
* అధిక మొత్తంలో వినియోగించే ప్రభుత్వ సంస్థలు కిలోవాట్‌ చొప్పున కాకుండా యూనిట్‌ ప్రకారం ధర చెల్లించడానికి ఆసక్తి చూపుతున్నాయి.
* యూనిట్‌ ప్రకారం అయితే సౌరఫలకాలను విక్రయించే ప్రైవేటు కంపెనీ పెట్టుబడి పెట్టి ఏర్పాటు చేస్తుంది.
* వాటినుంచి ఉత్పత్తయ్యే సౌరవిద్యుత్‌కు యూనిట్‌కు ధర నిర్ణయించి వచ్చే 25 ఏళ్ల పాటు వసూలు చేస్తుంది.
* దీనివల్ల సాధారణ కరెంటు కన్నా తక్కువకే దీర్ఘకాలం పాటు సౌర విద్యుత్‌ కార్యాలయాలకు లభిస్తుంది.
* ఈ విధానంలో భవనంపై 10 కిలోవాట్లలోపు సౌరఫలకాలు ఏర్పాటు చేస్తే యూనిట్‌కు రూ.4.60, ఖాళీ స్థలంలో అయితే రూ.4.70 అడిగారు.

యూనిట్‌కు రూ.4.10 ఇస్తే చాలన్నాయి..రెడ్కో ఎండీ
ఒకవేళ 100 కిలోవాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యముంటే యూనిట్‌కు రూ.4.10 ఇస్తే చాలని కంపెనీలు తెలిపాయని రెడ్కో ఎండీ జానయ్య ‘ఈనాడు’కు చెప్పారు.ప్రభుత్వ లేదా ప్రయివేటు సంస్థల భవనాలపై ఏర్పాటు చేసే వాటికి రాయితీ ఉండదన్నారు. ఇళ్లపై ఏర్పాటుచేసే వాటికి విడిగా టెండర్లు పిలుస్తామని..కేంద్రం నుంచి 40 శాతం వరకూ రాయితీ ఇస్తుందని తెలిపారు.

-ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.