close

ప్ర‌త్యేక క‌థ‌నం

విరామమెరుగని వృద్ధాప్యం

94 ఏళ్ల యువకుడు.. జిమ్మీ కార్టర్‌
పదవీవిరమణ వద్దంటున్న వృద్ధులు
65 దాటినా.. ఉద్యోగాల్లో రాణింపు

60 దాటగానే చేతికర్ర పట్టుకుని.. పడక్కుర్చీలో పడుకుని కాలక్షేపం చేసే రోజులు పోయాయి. పదవీవిరమణ అనేది ఉద్యోగానికే తప్ప మనసుకు కాదని చెప్పేవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. ఆధునిక వైద్య పరిజ్ఞానం కారణంగా జీవన ప్రమాణాలు పెరగడానికి తోడు పనిచేయడానికి అవకాశాలు ఉండటం, పిల్లల మీద ఆధారపడకూడదనే మనస్తత్వం కారణంగా వయసు మీరినా పని చేసేందుకే ఉరకలెత్తుతున్నారు. భారతదేశంలోనూ ఈ తరహా పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగవిరమణ చేసిన తర్వాత కన్సల్టెంట్లుగానూ, అధ్యాపక వృత్తిలోనూ స్థిరపడుతున్నవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇతర వృత్తుల వైపూ వెళ్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 65 ఏళ్ల పైబడినవారి సంఖ్య 2050 నాటికి మొత్తం జనాభాలో 21.1% ఉంటుందని అంచనా.

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ 94 ఏళ్ల వయసులోనూ తన భార్యతో కలిసి ఓ బృహత్తర బాధ్యతను తలకెత్తుకున్నారు. మే నెలలో కిందపడి తుంటి శస్త్రచికిత్స కూడా చేయించుకున్న ఆయన.. దాన్నుంచి కోలుకుని మళ్లీ నిరుపేదల కోసం దగ్గరుండి ఇళ్లు కట్టిస్తున్నారు. తన భార్య రోజ్‌లిన్‌ కార్టర్‌తో కలిసి టెన్నెస్సీలోని నాష్‌విల్లె ప్రాంతంలో 21 కొత్త ఇళ్లు కట్టించేందుకు తాజాగా ఉద్యుక్తులయ్యారు. హేబిటాట్‌ ఫర్‌ హ్యుమానిటీ అనే సంస్థ తరఫున ఈ దంపతులు 1984 నుంచి.. అంటే గత 35 ఏళ్లుగా వలంటీర్లుగా పనిచేస్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షులలో జీవించి ఉన్నవారిలో అత్యంత పెద్ద వయస్కుడైన కార్టర్‌ 2018లోనూ తన భార్యతో కలిసి కార్టర్‌ వర్క్‌ ప్రాజెక్ట్‌లో పాల్గొన్నారు. 2017లో ఒకసారి బయట పనిచేస్తూ డీహైడ్రేషన్‌కు గురై ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినా.. ఇటీవలే తుంటి శస్త్రచికిత్స చేయించుకున్నా.. ఆ దంపతుల దీక్ష మాత్రం సడలలేదు.

4 నెలలకే మళ్లీ

బ్రిటన్‌కు చెందిన రెవరెండ్‌ మైఖేల్‌ సోల్స్‌బీ (82) ఆసుపత్రిలో రోగుల వద్ద ప్రార్థనలు చేస్తుంటారు. 68 ఏళ్ల వయసులో చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌లో పదవీవిరమణ చేశానని, 4 నెలల తర్వాతి నుంచి మళ్లీ పనిచేయడం ప్రారంభించానని ఆయన చెప్పారు. బాప్టిజం ఇప్పించడం, జనన మరణాల సమయంలో ప్రార్థనలు, ఆదివారం చర్చి కార్యక్రమాలు, ఆసుపత్రిలో అసవరమైన వారికి సేవలు చేయడం లాంటి వాటిని వృత్తిగా స్వీకరించారు. శారీరకంగా 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నానో ఇప్పటికీ అలాగే ఉన్నానని ధీమాగా చెబుతున్నారు.

65+ ఏ దేశంలో ఎలా?

* అమెరికాలో 52 లక్షల మంది ఈ వయసులో ఇంకా ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో 28% మంది పురుషులు కాగా, 16% మంది  మహిళలున్నారు.
* సింగపూర్‌ మొత్తం జనాభాలో 13% మంది 65 ఏళ్లు పైబడినవారే. వారిలో 26.8% మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు.
* బ్రిటన్‌లో 65 ఏళ్లు దాటిన జనాభాలో 13.2% మంది పురుషులు, 7.3% మంది మహిళలు ఏదో ఒక వృత్తిలో ఉన్నారు.
* జపాన్‌లో అత్యధికంగా 2.7 కోట్ల మంది 65 ఏళ్ల పైబడిన వయసులో పనులు చేస్తున్నారు.
* ఆస్ట్రేలియాలో 13% మంది వృద్ధులు ఏదో ఒక ఉద్యోగంలో ఉంటున్నారు.

65 దాటాక పని ఎందుకంటే

* మానసిక సంతృప్తి
* సమయం గడిపేందుకు
* అదనపు ఆదాయం
* చురుగ్గా ఉండాలన్న కోరిక
* రుజువు చేసుకోవాలన్న తపన

ప్రధాన కారణాలు ఇవీ

* సగటు జీవనప్రమాణం పెరగడం
* ఆధునిక వైద్య సదుపాయాలు
* శారీరక పటుత్వంపై అవగాహన
* మెదడు చురుగ్గా ఉండటం

పనికొచ్చే ఉద్యోగాలు

* అకౌంట్లు/ పుస్తకాల నిర్వహణ
* పార్ట్‌టైం అధ్యాపకులు
* ఈవెంట్‌ ప్లానర్లు, సమన్వయకర్తలు
* ప్రాజెక్టు కన్సల్టెంట్లు
* వృద్ధాశ్రమాల నిర్వాహకులు
* సేవా సంస్థల సలహాదారులు
-ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.