close

ప్ర‌త్యేక క‌థ‌నం

కులమత రహిత స్నేహం

పాఠశాల స్థాయి నుంచే అడుగులు
ఈ భావన మనసులో నుంచి రావాలి
ధ్రువీకరణ పత్రం మంజూరుకు చట్టం చేయాలి
కులమతాలను రాజకీయ నేతలు వాడుకుంటున్నారు.
ఈనాడు ఇంటర్వ్యూలో స్నేహ పార్థిబరాజా

ఈనాడు డిజిటల్‌, చెన్నై: కుల, మతరహితంగా జీవనాన్ని సాగించటం ప్రస్తుత సమాజంలో సాధ్యమేనా? దీనికి ఎన్నో ప్రశ్నలను, మరెన్నో సవాళ్లను అధిగమించవలసి ఉంటుంది. న్యాయవాద వృత్తిలో ఉన్న స్నేహ పార్థిబరాజా వేటినీ లెక్కచెయ్యలేదు. దశాబ్దానికి పైగా అలుపెరగని పోరాటం చేశారు. కులమతాలను అధికారికంగా రద్దు చేసుకుని, నేను భారతీయురాలినని సగర్వంగా చాటగలిగేలా... ఈ ఏడాది ఫిబ్రవరిలో ధ్రువపత్రాన్ని పొందారు. ఇలాంటి ఖ్యాతి దక్కించుకున్న తొలి వ్యక్తిగా ఆమె తన పేరు నమోదు చేసుకున్నారు. తమిళనాడులోని వేలూరు జిల్లా తిరుపత్తూరు రెట్టమలై శ్రీనివాసన్‌పేటైకు చెందిన స్నేహ ‘ఈనాడు’ ముఖాముఖీలో తన ప్రయాణాన్ని వివరించారు.

కుల, మత రహిత ధ్రువీకరణ పత్రాన్ని పొందాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అందుకు బలమైన కారణం ఏమైనా ఉందా?
మా తల్లిదండ్రులకు ముగ్గురు అమ్మాయిలం. మాకు స్నేహ, ముంతాజ్‌, జెనిఫర్‌ అని పేర్లు పెట్టారు. బడిలో చేర్చేటప్పుడు మాకు కులం, మతం  లేవన్న విషయం చెప్పి పంపారు. పాఠశాల యంత్రాంగం దీనికి ఒప్పుకోలేదు. తరువాత మా అమ్మానాన్న ఆందోళనలు చేయటంతో పాఠశాలలో చేర్చుకున్నారు. దీనితో కళాశాల చదువు పూర్తయ్యే వరకు కూడా బదిలీ ధ్రువపత్రాల్లో కులరహితం అనే పేర్కొంటూ వచ్చాం. మా తల్లిదండ్రుల మాదిరిగానే నాదీ కులాంతర వివాహం. మా ముగ్గురు పిల్లలకి ఆదిరై నస్రీన్‌, ఆదిలా ఐరిన్‌, ఆరిఫా జెస్సీ అని పేరుపెట్టాం. మేం ఎక్కడికి వెళ్లినా కుల ధ్రువీకరణ పత్రాన్ని అడుగుతున్నారు. దీంతో కొన్ని చోట్ల తప్పనిసరి పరిస్థితుల్లో కులం లేదని నోటరీ అఫిడవిట్‌ సమర్పించా. అప్పుడు నాకు కుల రహిత ధ్రువపత్రం ఉంటే దానిని సమర్పించవచ్చన్న ఆలోచన వచ్చింది. మనిషికి పుట్టుకతోనే జాతి, మతం సంక్రమిస్తాయని మన చట్టాలు చెబుతున్నాయి. ఎవరైనా పుట్టేటప్పుడు కులం, మతం అనే వాటిని ధరించరనే భావనతో నేను పదేళ్లు పోరాడి ఈ ధ్రువపత్రం పొందాను.

ధ్రువీకరణ పత్రాన్ని పొందడానికి మీకు ఎలాంటి ప్రోత్సాహం లభించింది? అందరూ ఈ విషయాన్ని ఎలా స్వాగతించారు?
న్యాయవాదులయిన మా తల్లిదండ్రులిద్దరూ ప్రోత్సహించారు. సినీ ప్రముఖులు కమల్‌హాసన్‌, విశాల్‌, సత్యరాజ్‌, పార్థిబన్‌, రోహిణి, సూర్య, విఘ్నేశ్‌ శివన్‌ తదితరులు నా ప్రయత్నాన్ని అభినందించారు. రాజకీయ నాయకుల్లో వీసీకే అధినేత తిరుమావళవన్‌, డీఎంకే నేత దయానిధి మారన్‌, హైకోర్టులో న్యాయవాదులు తదితరులు అభినందనలు తెలిపారు.

ఎవరైనా ఇలాంటి ధ్రువపత్రం పొందాలంటే ఎలా ముందుకెళ్లాలి?
ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి ధ్రువపత్రం కావాలని అడిగితే ఇవ్వొచ్చు అనే విధానం లేదు. కేవలం విచక్షణ ఆధారంగా మాత్రమే ఇస్తున్నారు. అందువల్ల దీనిని ప్రభుత్వం చట్టంగా చేస్తే బావుంటుంది.

మీ అభిరుచులు...?
నాకు భరతనాట్యంలో ప్రవేశం ఉంది. దాంతోపాటు తమిళనాడు డప్పు వాయిద్యం పరైలోనూ ప్రావీణ్యం ఉంది. ఎప్పటికైనా రాజకీయ నేతగా ఎదిగి ప్రజలకు సేవలందించాలన్నది ఆశయం. ప్రజలకు ఉచిత న్యాయసేవా శిబిరాలు నిర్వహిస్తుంటాను. ప్రస్తుతం జాతీయ విద్యావిధానం మంచిదనే విషయంపై అవగాహన పెంచడానికి సదస్సులు నిర్వహిస్తున్నాం. నాకు స్ఫూర్తి ప్రదాత  కార్ల్‌ మార్క్స్‌.

మీ జీవిత భాగస్వామి నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభిస్తోంది?
మాది ప్రేమతో కూడిన పెద్దలు కుదిర్చిన వివాహం. మా ఆయన పార్థిబరాజా కళాశాలలో ఆచార్యుడిగా తమిళ సాహిత్యం విభాగంలో పని చేస్తారు. ఆయన థియేటర్‌ ఆర్టిస్టు. 25 వరకు పుస్తకాలు రచించారు.

నేటి యువతకు మీరిచ్చే సందేశమేంటి?
యువత మూడు విషయాలకు బానిసలుగా మారుతున్నారు. ఒకటి... మాదకద్రవ్యాల వాడకం, మద్యపానం, ధూమపానం. రెండోది ..సినిమా, టీవీ, సామాజిక మాధ్యమాలు. మూడోది ప్రేమ వ్యవహారాలు. లైంగిక వాంఛ తీర్చుకోవడానికే అన్నట్లు ప్రేమ మారడం బాధాకరం. పుస్తక పఠనం అలవాటును పెంచుకుంటే యువతలో పరివర్తన సాధ్యమవుతుంది.

కులం, మతం అనేవి దాదాపు అందరిలో జీర్ణించుకుపోయాయి కదా... అవి పూర్తిగా ఎప్పుడు సమసి పోతాయి?
కులాన్ని పారదోలాలన్న భావన మనస్సుల్లోంచి రావాలి. కుల, మతాల కంటే ముందు వారి భాషలపై వారికి ప్రేమ ఉండాలి. నేను తమిళ పౌరుణ్ని. నేను తెలుగువాడిని, నేను మళయాళీని అన్న భావన ఆయా రాష్ట్రాల వారికి ఉండాలి. కులమతాలను రాజకీయ నాయకులు వారికి అనుకూలంగా వాడుకుంటున్నారు. దీనిపై ప్రజలే పోరాటం చేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.