
ప్రత్యేక కథనం
చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-2 వ్యోమనౌక దిగే క్షణాల కోసం యావత్ భారత దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే తమిళనాడులోని ఈ రెండు గ్రామాల్లో ఆ ఉత్కంఠ మరింత ఎక్కువగా ఉంది. చంద్రయానంతో ఈ ఊళ్లకున్న విడదీయరాని బంధమే ఇందుకు కారణం. ఆ వ్యోమనౌకలోని ల్యాండర్‌కు, రోవర్‌కు నడకను నేర్పిన గ్రామాలివీ.
చంద్రుడి ఉపరితలం మొత్తం బిలాలు, శిలలు, ధూళితో నిండి ఉంటుంది. అక్కడి నేల తీరు.. మన నేలకు చాలా భిన్నం. అక్కడి పరిస్థితులు మనకు కొత్త. ల్యాండర్‌లోని కాళ్లు చంద్రుడి ఉపరితలంపై సాఫీగా దిగేలా, రోవర్‌లోని చక్రాలు అక్కడ సక్రమంగా ముందుకుసాగేలా చూడాలి. ఇందుకు వాటిని విస్తృతంగా పరీక్షించాలి. అందుకు జాబిల్లి ఉపరితలాన్ని పోలిన వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించాల్సి ఉంటుంది. అయితే చంద్రుడి ఉపరితలాన్ని పోలిన మట్టి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వద్ద లేదు. అమెరికా నుంచి దాన్ని దిగుమతి చేసుకోవాలని భావించింది. అందుకు భారీ మొత్తాన్ని ఆ దేశం డిమాండ్ చేసింది. చౌకలో అంతరిక్ష ప్రయోగాలకు పెట్టింది పేరైన ఇస్రోకు అది నచ్చలేదు. ఏకంగా 70 టన్నుల చంద్రుడి మట్టి అవసరం కావడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది.
రెండు రకాలు: చంద్రుడిపై ప్రధానంగా రెండు రకాల శిలలు ఉన్నాయి. 1. బసాల్టిక్ 2. ఆంత్రోసైట్.
అన్వేషణ: దేశీయంగా జాబిల్లి మట్టిని తయారుచేసేందుకు నిర్ణయించుకున్న ఇస్రో భారత భూగర్భ శాస్త్రవేత్తలను ఆశ్రయించింది. అంతిమంగా తమిళనాడులోని సేలంకు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతంపూండి, కున్నామలై గ్రామాల్లోని ఆంత్రోసైట్ శిలలు ఉన్నట్లు గుర్తించారు. పెరియార్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎస్.అన్బళగన్ నేతృత్వంలోని బృందం 2004లోనే స్పెక్ట్రల్ అధ్యయనాలు నిర్వహించి వీటిని పసిగట్టింది.
పొడి చేసి..: ఈ గ్రామాల నుంచి శిలలను వెలికితీసి, అవసరమైన పరిమాణంలో పిండి చేశారు. ఈ రేణువుల పరిమాణం 30 నుంచి 200 మైక్రాన్ల మేర ఉండేలా చూశారు. వివిధ నిష్పత్తుల్లో వీటి మిశ్రమాన్ని సిద్ధం చేశారు. రసాయన, భౌతిక లక్షణాల పరంగా ఇది అచ్చంగా చంద్రుడి నేల (రెగోలిథ్)ను పోలి ఉన్నట్లు హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన కేంద్రం (ఎన్జీఆర్ఐ) సహా అనేక సంస్థలు ధ్రువీకరించాయి. ఈ మట్టిని బెంగళూరులోని ‘లూనార్ టెరైన్ ఫెసిలిటీ’కి తీసుకెళ్లి, కృత్రిమంగా జాబిల్లి ఉపరితలాన్ని సృష్టించారు. అక్కడ చంద్రయాన్-2లోని ల్యాండర్, రోవర్లను విస్తృతంగా పరీక్షించారు. భూమితో పోలిస్తే చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి ఆరో వంతు మేర మాత్రమే ఉంటుంది. అలాంటి పరిస్థితిని సృష్టించడానికి రోవర్‌ను హీలియంతో నిండిన బెలూన్‌తో కొంతమేర పైకి లేపారు.
నేర్చిన పాఠాలు: ఈ ప్రయోగాలు కలిసొచ్చాయి. తొలుత రోవర్‌కు నాలుగు చక్రాలనే అమర్చాలని ఇస్రో భావించింది. పరీక్షల్లో ఎదురైన అనుభావాల ఆధారంగా చక్రాల సంఖ్యను ఆరుకు పెంచారు. వాటి పరిమాణాన్నీ పెంచాల్సి వచ్చింది.
ఔదార్యంతో తగ్గిన ఖర్చు: జాబిల్లి మట్టి తయారీకి ఇస్రో రూ.25 కోట్లు కేటాయించింది. వాస్తవ ఖర్చు మాత్రం గణనీయంగా తగ్గిపోయింది. ఈ మట్టిని సిద్ధం చేయడంలో సాయపడిన అనేక సంస్థలు ఎలాంటి రుసుములను వసూలు చేయకపోవడమే ఇందుకు కారణం.
మరిన్ని

దేవతార్చన
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి