close

ప్ర‌త్యేక క‌థ‌నం

బోధకులు.. సాధకులు

నేడు ఉపాధ్యాయ దినోత్సవం

అక్షరాలు దిద్దించే వాత్సల్యం 
పాఠాలు బోధించే నైపుణ్యం 
జీవితాన్ని తీర్చిదిద్దే కర్తవ్యం 
కలబోస్తే అది గురురూపం.

మోడల్‌ స్కూల్లో అయినా.. మన వీధి చివరి సర్కారీ బళ్లోనయినా 
విద్యార్థుల బంగరు భవితకు బాటలు వేసేది ఉపాధ్యాయులే. 
విద్యాబోధన సృజనాత్మక వృత్తి.. చిన్నారుల చిట్టి బుర్రలను 
వికసింపజేయడం.. వారిలో తృష్ణను రేకెత్తించడం.. జ్ఞాన సంపన్నులుగా మార్చటం! 
పిల్లలకు ఒక పాఠం చెప్పడానికి ఎన్నో పుస్తకాలు శోధించే టీచర్లు కొందరైతే.. 
శాస్త్రవిషయాల్నీ సులువుగా, తెలివిగా బోధించేవారు మరికొందరు. 
సర్వేపల్లి రాధాకృష్ణన్‌ స్ఫూర్తిగా నిరంతరం సాధన చేసే గురువులూ... 
విద్యార్థుల ఎదుగుదల కోసం అనుక్షణం తపించేవారూ ఎందరో!

మేలైన విద్యాబోధన కోసం ఎందరో ఉపాధ్యాయులు పుస్తకాలను శోధిస్తున్నారు.. కాలానుగుణంగా కొత్త పంథాలో సాగుతున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు మరో అడుగు ముందుకేసి సరికొత్త బోధన విధానాలకు శ్రీకారం చుడుతున్నారు. సమాజంలో వస్తున్న మార్పులను.. తల్లిదండ్రుల ఆశలను గుర్తెరిగి ముందుకు సాగుతున్నారు. పాఠశాలల నిర్వహణలోనే కాదు.. విద్యాబోధనలోనూ నూతన విధానాలను అనుసరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒత్తిడి లేని విద్యను అందిస్తూ.. పిల్లలు రాణించే రంగాలను గుర్తించి ప్రోత్సహిస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బడి నిర్వహణ, విద్యాబోధనలో ఉత్తమ విధానాలు పాటిస్తున్న గురువులు, విద్యాలయాలపై ప్రత్యేక కథనాలు..

- ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే యంత్రాంగం
 

 

 


ఒత్తిడి లేని చదువు 

తేజ విద్యాలయ, కోదాడ, నల్గొండ జిల్లా

 
విద్యార్థుల సంఖ్య: 300 (1-10 తరగతులు) 
ప్రధానోపాధ్యాయురాలు: వి.రమాదేవి

* రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ క్విజ్‌ పోటీలు జరిగినా ఈ పాఠశాల విద్యార్థులు పాల్గొనాల్సిందే. జీకే క్విజ్‌ పోటీల్లో కాకుండా చరిత్ర, వారసత్వ సంపద, పర్యావరణం, సాంకేతికత లాంటి వాటిల్లోనూ ప్రతిభ చూపుతున్నారు. గత ఏడాది నాలుగు జాతీయ క్విజ్‌ పోటీల్లో గెలుపొందారు. తాజాగా ఐఐటీ గువాహటి నిర్వహించిన టెక్నోథాన్‌లోనూ 2 బంగారు పతకాలు సాధించారు.

* తరగతి గదిలో ఉపాధ్యాయులు గైడ్‌గా మాత్రమే ఉంటారు. ప్రతిదీ బోర్డుపై తాను చేయడం కాకుండా పిల్లలతో చేయిస్తారు. చేస్తూ నేర్చుకోవడం అనే విధానాన్ని ఇక్కడ అనుసరిస్తారు.

* చదువులో భాగంగా వివిధ  అంశాలపై క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరి. 
* ‘మాతోట’ అనే కార్యక్రమం ద్వారా విద్యార్థులు విత్తనాలు సేకరించి కూరగాయల పంటలు పండిస్తారు. 
* దినపత్రికలు చదవడం తప్పనిసరి.

ప్రత్యేకతలు.. 
* ఇది ప్రైవేట్‌ పాఠశాల అయినా మిగిలిన ప్రైవేట్‌ బడులకు భిన్నమైంది. ఇక్కడ బట్టీ చదువులు ఉండవు. విద్యార్థులపై ఒత్తిడి అసలే ఉండవు. విద్యకు సమానంగా విద్యేతర కార్యక్రమాలైన క్రీడలు, సాంస్కృతికం లాంటి వాటికి సమాన ప్రాధాన్యం ఇస్తారు.


సెలవు రోజుల్లో ప్రత్యేక శిక్షణ 
ధర్మారం ప్రాథమికోన్నత పాఠశాల, కోరుట్ల మండలం, జగిత్యాల జిల్లా 


విద్యార్థుల సంఖ్య: 187 
(2013లో 60 మంది మాత్రమే) 
ప్రధానోపాధ్యాయుడు: మోహన్‌రెడ్డి

* సీనియర్‌ విద్యార్థులను చిన్న తరగతుల వారికి గైడ్లుగా నియమిస్తారు. ఉపాధ్యాయులు విధులకు రాని రోజున పెద్ద పిల్లలే బోధించేలా శిక్షణ ఇస్తారు. 
* ప్రభుత్వ పాఠ్య పుస్తకాలతోపాటు సబ్జెక్టు మరింత పెంచుకోవడానికి ఇతర పుస్తకాలూ వినియోగిస్తారు. 
* పాఠశాల సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు పెంచి 3 నుంచి 7 తరగతుల వారికి కంప్యూటర్‌ విద్య అందిస్తున్నారు. 
* చుట్టుపక్కల గ్రామాల పిల్లలతోపాటు ఇతర గ్రామాల వారూ ఇక్కడే చదువుకుంటున్నారు. 
* గ్రామస్థుల ఆర్థిక సహకారంతో ఇక్కడ ప్రొజెక్టరు, క్రీడా వస్తువులు, కంప్యూటర్లు తదితరవి ఎన్నో సమకూరాయి. 
* గ్రామస్థులంతా కలిసి ఈ పాఠశాల ప్రాంగణంలో సరస్వతి దేవి ఆలయాన్ని నిర్మించడం విశేషం.

ప్రత్యేకతలు 
తరగతులు ప్రారంభానికి ముందు, ముగిసిన తర్వాత 5వ తరగతి విద్యార్థులకు ప్రతిరోజూ (సెప్టెంబరు నుంచి జనవరి వరకు) జవహర్‌ నవోదయ, సైనిక్‌ పాఠశాలల ప్రవేశ పరీక్షకు శిక్షణ ఇస్తారు. 
ఆ కొద్ది నెలలు సెలవు దినాల్లోనూ శిక్షణ ఉంటుంది. 
2017-18 నుంచి ఏటా ఇద్దరైనా నవోదయ సీట్లు సాధిస్తున్నారు.


నిత్య పర్యవేక్షణ.. ప్రయోగాత్మక బోధన 
బోర్గాం ఉన్నత పాఠశాల, నిజామాబాద్‌ జిల్లా 


విద్యార్థుల సంఖ్య: 1,440 
ప్రధానోపాధ్యాయుడు:   నర్రా రామారావు

* ప్రధానోపాధ్యాయుడు రామారావు నిత్య పర్యవేక్షణ కారణంగా నాణ్యమైన విద్య అందుతుందన్న అభిప్రాయం తల్లిదండ్రుల్లో బలపడింది. వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. విద్యార్థులను బృందాలుగా చేసి చదివిస్తారు. 
* కొన్ని అంశాలపై అవసరమైనప్పుడు ప్రత్యక్షంగా చూపిస్తారు. ఉదాహరణకు గుండె గురించి బోధిస్తుంటే మేక/గొర్రెల గుండెను తెచ్చి వివరిస్తారు. 
* తల్లిదండ్రులు, దాతలు, పూర్వ విద్యార్థుల విరాళాలతో విద్యానిధి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రూ.3.65 లక్షలు సమకూరాయి.

ప్రత్యేకతలు: 
అయిదారేళ్లలోనే విద్యార్థుల సంఖ్య 550 నుంచి 1,440కి పెరిగింది. ఈ ఏడాది ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల నుంచి 425 మంది వచ్చి ఇక్కడ ప్రవేశాలు పొందారు. 
* తరగతి గదుల్లో ఉపాధ్యాయులు సెల్‌ఫోన్లు వాడడాన్ని నిషేధించారు. 
* ఏటా బాసర ఆర్‌జీయూకేటీలో ఈ పాఠశాల విద్యార్థులు సీట్లు పొందుతున్నారు. 
* ఉపాధ్యాయుల బోధన తీరుపై ఎప్పటికప్పుడు విద్యార్థులను అడిగి తెలుసుకుంటారు. 
* ప్రధానోపాధ్యాయుడు సైతం 9, 10 తరగతులకు బోధించడమే కాకుండా ఉపాధ్యాయులు బోధిస్తుంటే ఆయన అక్కడే కూర్చుంటారు


సర్కారు బడికీ ఓ యాప్‌ 
సిద్దిపేటలోని ఇందిరానగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 


 

ప్రత్యేకతలు.. 

ఇక్కడ ఉపాధ్యాయులకు రికార్డుల నిర్వహణ బాధ్యత ఉండబోదు. ప్రగతి నివేదికల (పోగ్రెస్‌ రిపోర్టు) తయారీ, హాజరు, ప్రవేశాలు, నిర్వహణ తదితర వాటి కోసం ప్రత్యేకంగా ‘జడ్పీహెచ్‌ఎస్‌ ఇందిరానగర్‌’ పేరిట యాప్‌ను నిర్వహిస్తున్నారు. దీనిద్వారా తల్లిదండ్రులు సైతం తమ పిల్లల పురోగతిని తెలుసుకోవచ్చు.

 

ప్రతి విద్యార్థికి కనీస సామర్థ్యాలు సాధించే దిశగా విద్యార్థి సూచిక (స్టూడెంట్‌ ప్రొఫైల్‌) ఉంటుంది. సబ్జెక్టుల వారీగా వెనుకబడిన తీరు, పురోగతి సాధిస్తున్న అంశాలను ఇందులో పొందుపర్చారు. 
రోజువారీగా ఉదయం 9 నుంచి 9.30 గంటల వరకు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తారు. ః చివరి తరగతిలో సమగ్ర అభివృద్ధిలో భాగంగా సాంస్కృతిక, క్విజ్‌, ఉపన్యాసం, క్రీడ పోటీల నిర్వహణ తదితర అంశాలపై వివరిస్తారు. 
విద్యార్థులతో కూడిన విద్యా విషయిక, క్రమశిక్షణ, సాంస్కృతిక, క్రీడలు, కార్యక్రమాల నిర్వహణ, సామాజిక అభివృద్ధి కమిటీలు పనిచేస్తాయి. 
పాఠాల అనుశీలనపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. 
ప్రతీ ఉపాధ్యాయుడు తన పనితీరుపై ప్రతీనెలా తానే మార్కులు వేసుకోవాలి.


ఉపకార వేతనాల కోసం తర్ఫీదు 
పాల్వంచ కేటీపీఎస్‌-ఎ కాలనీలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల 


విద్యార్థినుల సంఖ్య: 651 
ప్రధానోపాధ్యాయురాలు: ఆకుల పద్మలత

విద్యార్థునులు పాఠశాలకు హాజరు కాకపోతే ఉపాధ్యాయులే తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి సమాచారం తెలుసుకుంటారు. అది వీలుకాకుంటే విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తెలుసుకుంటారు. 
సుదూర ప్రాంతాల బాలికలు కూడా ఇక్కడ వసతిగృహాల్లో ఉంటూ ఈ పాఠశాలలో చదువుకుంటుండడం విశేషం.

ప్రత్యేకతలు: 
ప్రతీ విద్యార్థినిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అందుకే ఎంత దూరమైనా తమ పిల్లల్ని ఈ పాఠశాలకే పంపడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని గురుకులాలు ప్రవేశపెట్టినా బాలికలు మాత్రం ఈ పాఠశాలలో ప్రవేశం కోసం బారులు తీరుతుంటారు.

పదో తరగతి వార్షిక ఫలితాలు, జాతీయ ఉపకార వేతనాల్లో అగ్రస్థానంలో నిలుస్తున్నారు. 
గత ఏడాది నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌)లకు ఏకంగా 18 మంది బాలికలు ఎంపికయ్యారు. అందుకు ఏటా పేద కుటుంబాలకు చెందిన 8వ తరగతి విద్యార్థినులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు.


పలక.. బలపం లేని బడి 


 

బడి అంటేనే పిల్లలు భయపడతారు. పలక, బలపం పట్టాలి, చెప్పింది రాయాలి. తేడావస్తే బెత్తం దెబ్బలు తప్పవు. ఇది పిల్లల్లో నాటుకుపోయింది. దీనికి స్వస్తిపలికి వినూత్నంగా బోధన సాగిస్తోంది చిత్తూరు జిల్లాలోని రిషివ్యాలీ విద్యావనరుల కేంద్రం (రివర్‌). అక్కడ అందరూ సమానమే. మూడున్నర దశాబ్దాలుగా ప్రాథమిక విద్యపై పరిశోధనలు జరుగుతున్నాయి. పాఠ్యపుస్తకం స్థానంలో ‘మల్టీగ్రేడ్‌ మల్టీలెవల్‌ (ఎంజీఎంఎల్‌)’ విధానం అమలు చేస్తున్నారు. 1993లో పెట్టెలో బడి విధానం.. ఇలా ఒకే ఉపాధ్యాయుడు అన్ని తరగతులకూ బోధించే వ్యవస్థను తీసుకొచ్చారు. దేశంలోని 15రాష్ట్రాలతో పాటు పలు దేశాల్లోనూ రివర్‌ విధానం అమల్లో ఉంది. పిల్లలకు మార్కులు, ర్యాంకులు ఉండవు. బెత్తం, శిక్షలు అసలే ఉండవు. రాష్ట్రంలో 1,571 ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రయోగాత్మకంగా 1-5 తరగతులకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

1987 నుంచి విద్యలో మార్పులు చేస్తూ వస్తున్నాం. స్థానిక మాండలికం, మాతృభాషలే పిల్లల్ని ఆకట్టుకుంటాయి. బోధనవిధానంలో మరిన్ని మార్పులు రావాలి. 
-యర్రవల్లి అనంత పద్మనాభరావు, రమ, రివర్‌ డైరెక్టర్లు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.