close

ప్ర‌త్యేక క‌థ‌నం

జ్వరం గుప్పిట జనం

5 వారాల్లో 1348 డెంగీ కేసులు
4 వారాల్లో 1.31 లక్షల మందికి విష జ్వరాలు
వీరిలో 50 శాతం మంది చిన్నారులే
కిక్కిరిసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు
ఓపీ దగ్గరే గంటల తరబడి పడిగాపులు
ప్లేట్‌లెట్లు తగ్గుతుండడంతో ఆందోళనలో తల్లిదండ్రులు
సర్కారు, ప్రైవేటు దవాఖానాల్లోనూ పడకలు కరవు
నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్న ఆరోగ్యశాఖ   
రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ సహా విషజ్వరాల పంజా

ఇది ఖమ్మం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో జ్వర పీడితుల చికిత్స కోసం నిర్దేశించిన వార్డు. ఆసుపత్రిలో ఏ వార్డు చూసినా ఇలానే కిక్కిరిసిపోయింది. జ్వరంతో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉండడం.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మేలైన చికిత్స కేవలం జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లోనే లభ్యమవుతుందన్న భరోసా ఉండడంతో జనం ఎక్కువగా ఇక్కడికే తరలివస్తున్నారు. దీంతో పడకలు సరిపోని పరిస్థితి. దీంతో ఒకే పడకపై ఇద్దరిని, పిల్లలయితే ముగ్గురు చొప్పున పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. ఓ వార్డులో ఇలా రెండు పడకలపై ఇద్దరేసి చొప్పున పడుకోబెట్టి నాలుగు సెలైన్లు ఎక్కిస్తున్నారు. 

ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రం మొత్తమ్మీద ఖమ్మం జిల్లాలో అత్యధిక డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇక్కడ టైఫాయిడ్‌ తన ప్రభావం చూపిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 3,663 టైఫాయిడ్‌ పరీక్షలు చేయగా.. 1,036 మందికి ఉన్నట్లుగా నిర్ధారించారు. గన్యా జ్వరాలు 65 మందికి సోకినట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో గత 5 వారాల్లో 1348కి పైగా డెంగీ కేసులు అధికారికంగా నమోదయ్యాయి. 
వాతావరణంలో మార్పులు కారణంగా వస్తున్న జ్వరాల్లో 80 శాతానికి పైగా వైరల్‌ జ్వరాలేనని, డెంగీ సహా వైరల్‌ జ్వరాల్లోనూ రక్తంలో ప్లేట్‌లెట్లు తగ్గడం సాధారణమేనని నిపుణులు చెబుతున్నారు. ప్రజల్లో మాత్రం డెంగీ బూచీ వెన్నాడుతోంది. వైద్యుడు సూచించకపోయినా అత్యధికులు ప్లేట్‌లెట్ల పరీక్ష చేయించుకోవడానికే మొగ్గుచూపుతున్నారు.

1.31 లక్షలు
గత 4 వారాల్లో జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వైరల్‌ జ్వరపీడితుల సంఖ్య ఇది. వీరిలో దాదాపు 50 శాతం మంది చిన్నారులే.

9

డెంగీ ముప్పు అధికంగా ఉన్న జిల్లాలివి... 
హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, పెద్దపల్లి, కరీంనగర్‌ 

 


జ్వరం గుప్పిట్లో జనం

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. పల్లె, పట్నమంటూ తేడా లేకుండా రాష్ట్రమంతటా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వరం రాగానే అది డెంగీ కావచ్చేమోననే భయం ప్రజల్లో నెలకొంది. దీంతో సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కాదని ఎక్కువమంది పెద్దాసుపత్రులకు, ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. అన్నిచోట్లా ఓపీకి గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. విషజ్వరాలతో పాటు వాంతులు, విరేచనాలు, గొంతునొప్పి, కడుపునొప్పి, తదితర సమస్యలో వస్తున్న బాధితులూ పెద్దసంఖ్యలోనే ఉన్నారు. మొత్తంగా రాష్ట్రం జ్వరపీడితంగా మారిపోయింది. 

హైదరాబాద్‌లోని ఫీవర్‌, గాంధీ, నిలోఫర్‌, ఉస్మానియా, వరంగల్‌లోని ఎంజీఎం, ఇతర జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రులకు నిత్యం సుమారు 2 వేలమంది ఔట్‌పేషంట్లుగా వస్తున్నారు.
ఎంజీఎంలో జ్వర బాధితులతో వార్డులు కిక్కిరిసిపోయాయి. 
ఆదిలాబాద్‌ జిల్లా రిమ్స్‌ ఆసుపత్రిలో జ్వర బాధితులతో పడకలతో నిండిపోయింది. రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇతర వార్డుల్లో పడకలు ఏర్పాటుచేసినా సరిపోవడం లేదు. దీంతో కొన్ని పడకలపై ఇద్దరిని కూడా పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. 
నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రోజుకు సుమారు 400-500 మంది వరకూ ఓపీలో జ్వరాలతో చికిత్స కోసం వస్తున్నారు. ఇక్కడి జనరల్‌ వార్డులో సుమారు 250 మంది జ్వరాలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. వార్డుల్లో పడకలు నిండిపోవడంతో కింద పడకలేసి జ్వరపీడితులకు చికిత్స అందిస్తున్నారు. 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ అటవీ ప్రాంతంలో గిరిజన పల్లెల్లో అత్యధికులు జ్వరాల బారినపడి మంచమెక్కారు. వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లుతుండడంతో, ఇక్కడికి వైద్యసేవలు అందడం కూడా కష్టంగా మారింది.
రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ వైరల్‌ జ్వరాలతో వచ్చేవారి సంఖ్య సగటున రోజుకు సుమారు 50-60 మంది వరకూ ఉంటుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి.

ప్రైవేటులోనూ పైరవీలు
ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు నిండిపోయి, ఒక్కో పడకలో ఇద్దరు ముగ్గుర్ని కూడా ఉంచి చికిత్స అందించాల్సిన పరిస్థితులు ఏర్పడగా.. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ ఇంచుమించుగా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చేర్చుకోవడానికి నిరాకరిస్తుండడంతో.. తమకు తోచిన స్థాయిలో పైరవీలు చేయించుకుని మరీ వాటిలో చేరుతున్నారు. ఇదే అదనుగా కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, ప్రైవేటు వైద్యులు సొమ్ముచేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. 

లక్ష దాటుతున్న ఖర్చు! 
ప్రైవేటులో పరీక్షలకే కనీసం రూ.10వేల వరకూ ఖర్చవుతోంది. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందితే.. ఖర్చు సుమారు రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు కూడా దాటుతోంది. రక్తంలో ప్లేట్‌లెట్లు 20వేల కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే.. లేదా శరీర అంతర్భాగంలో రక్తస్రావం గుర్తించినప్పుడు మాత్రమే.. ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సి ఉంటుందని ఒకపక్క నిపుణులు చెబుతున్నా.. కొందరు వైద్యులు బాధితుల భయాన్ని అడ్డం పెట్టుకొని 80 వేలు, లక్ష ఉన్నప్పుడు కూడా తిరిగి ప్లేట్‌లెట్లను ఎక్కిస్తున్నారనే విమర్శలున్నాయి.

పసి మరణాలు పరిగణించరా?
రోగ నిరోధక శక్తి పిల్లల్లో తక్కువగా ఉండడంతో విష జ్వరాల బారినపడుతున్నవారిలో చిన్నారులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. 
జ్వర బాధితుల రద్దీ దృష్ట్యా పడకలు సరిపోని పరిస్థితి నెలకొంది. 
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న పిల్లల్లో కొందరు నిమోనియా బారిన కూడా పడుతున్నారు. 
ముఖ్యంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల్లో ఇది ప్రమాదకరంగా పరిణమిస్తోంది. 
డెంగీ కారణంగా హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం సహా పలు జిల్లాల్లో పలువురు చిన్నారులు మృతిచెందినట్లుగా తెలుస్తోంది. అయితే వైద్యఆరోగ్యశాఖ అధికారులు మాత్రం డెంగీ మరణాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. 
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకు డెంగీని నిర్ధారించి, పరీక్ష ఫలితాలను చూపించినప్పుడు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. 
ఒకవేళ డెంగీ మరణం కాకపోయి ఉంటే.. ఆ చిన్నారుల మరణాలకు అసలు కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
ఎప్పుడు ప్రమాదం?
ఒంటిపై ఎర్రటి రక్తం చుక్కల మాదిరిగా మచ్చలు రావడం
ఆయాసం
కళ్లు తిరిగి పడిపోవడం
రక్తపోటు తగ్గిపోవడం
ముక్కు, పంటి చిగుర్లు, ఇతర అవయవాల నుంచి రక్తం కారడం
అపస్మారక స్థితికి చేరుకోవడం
వ్యక్తిగత పరిశుభ్రత అవసరం
రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తీసుకోవాలి.
వేడి, తేమ కలిసి ఉన్న వాతావరణాన్ని కీటకాలు ఎక్కువగా ఇష్టపడతాయి. కాబట్టి ఈ వాతావరణంలో దోమలు, ఈగలు, చీమలు ఎక్కువగా ఉంటాయి.
ఎక్కువగా వెలుగు పడని, చీకటి ప్రదేశాల్లో, ఎక్కువగా మనుషులు తిరగాడని మూలల్లో ఇవి స్థానం ఏర్పర్చుకుంటాయి.
ఇంటి లోపల, వెలుపల, పరిసరాల్లో పరిశుభ్రతను కాపాడాలి.
డ్రమ్ముల్లో వారానికంటే ఎక్కువగా నీటిని నిల్వ చేయొద్దు.
ఎయిర్‌ కూలర్లలో నీళ్లను పారబోయాలి.
ఔషధాలు, పరీక్షల కిట్ల కొరత
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఉదయం, సాయంత్రం ఓపీ నిర్వహిస్తున్నారు. బస్తీ దవాఖానాల్లో డెంగీ, మలేరియా పరీక్షల కిట్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే రోజురోజుకూ పెరుగుతున్న తాకిడితో అవసరాలకు అనుగుణంగా పారాసెటమాల్‌ మాత్రలు, ద్రావణాలు వంటి కొన్ని రకాల ఔషధాలు, నిర్ధారణ పరీక్షల కిట్లకు కొన్నిచోట్ల కొరత ఏర్పడినట్లుగా తెలుస్తోంది. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జ్వరానికి వినియోగించే పారాసెటమాల్‌ మాత్రల కొరత ఏర్పడింది. తమకు వరంగల్‌ ఔషధ గిడ్డంగి నుంచి సరిపడా జ్వరం మాత్రలు అందడం లేదని స్థానిక వైద్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని వైద్యశాఖ ఎప్పటికప్పుడూ సమీక్షిస్తోంది

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.