close

ప్ర‌త్యేక క‌థ‌నం

తప్పు ఎవరిది? శిక్ష ఎవరికి?

యూరియా నిల్వ చేయని మార్క్‌ఫెడ్‌
రూ.475 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వానికి వినతి
బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడంలో ఆలస్యం
3 లక్షల టన్నుల నిల్వలో మూడు నెలల జాప్యం
అప్పటికే ప్రైవేటు డీలర్లకు అధికంగా కేటాయించిన కంపెనీలు
పరపతి సంఘాల ఎదుట కొనసాగుతున్న రైతుల నిరసనలు

యూరియా కోసం వచ్చిన ఓ మహిళా రైతు స్పృహ కోల్పోయింది. నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయి ప్రాథమిక సహకార సంఘం పరిధిలో  త్రియంబక్‌పేట్‌తండాకు చెందిన బదావత్‌ శోభ (28) శుక్రవారం ఉదయం నుంచి వరుసలో నిల్చోవడంతో స్పృహ తప్పి పడిపోయింది. స్థానికులు ఆమెను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. యూరియా కోసం రైతులు పడుతున్న పాట్లకు ఇది ఒక మచ్చుతునక.

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో యూరియా కొరతకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పలు జిల్లాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్‌) ఎదుట రైతులు యూరియా కోసం బారులు తీరి అల్లాడుతున్నారు. ఈ సంఘాలకు ఎరువులు సరఫరా చేయాల్సిన రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య (మార్క్‌ఫెడ్‌) వద్దా ఎరువు లేదు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభానికి ముందే 4 లక్షల టన్నుల ఎరువులు నిల్వ చేయాలని గత మే 25న వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 3 లక్షల టన్నులు యూరియా, 30 వేల టన్నుల డీఏపీ, మరో 70 వేల టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులుండాలి. వీటి కొనుగోలుకు రూ.500 కోట్లను బ్యాంకుల నుంచి అప్పులుగా తీసుకోవాలని, వడ్డీని, ఎరువుల రవాణాకు, గోదాముల్లో నిల్వకు అద్దెలను, ఇతర ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని ఉత్తర్వులో పేర్కొంది. రాష్ట్ర విభజనకు ముందు నుంచీ తమకు ఇవ్వాల్సిన రూ.475 కోట్ల బకాయిలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్క్‌ఫెడ్‌ పలుమార్లు అడిగింది. సొమ్ములు రాకపోవడంతో ఈ ఏడాది కొనుగోలులో జాప్యమైంది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకూ వర్షాలు కురవక డిమాండు లేక కంపెనీలు ఇస్తామన్నా మార్క్‌ఫెడ్‌ నిధుల్లేక తీసుకోలేదు. జులై నుంచి వర్షాలు కురవడంతో ప్రైవేటు డీలర్లు అప్రమత్తమై కంపెనీల నుంచి తీసుకోవడం ప్రారంభించారు. గూడ్సు రైళ్లలో జిల్లా కేంద్రాలకు సగటున వచ్చే 2500 టన్నుల్లో సగం మార్క్‌ఫెడ్‌కు, మిగతాది ప్రైవేటు డీలర్లకు ఇవ్వాలని వ్యవసాయశాఖ ఆదేశించింది. ఏప్రిల్‌ నుంచి జులై దాకా సమాఖ్య అడగకపోవడం, ఆ తరువాత అడిగినా కంపెనీలు ఇవ్వకపోవడంతో సమాఖ్య వద్ద యూరియా 3 లక్షల టన్నులకు చేరలేదు. ఆగస్టు నుంచి డిమాండు పెరిగి నిల్వలు అడుగంటాయి. కేంద్రం ప్రస్తుత ఖరీఫ్‌లో రాష్ట్రానికి 8.50 లక్షల టన్నుల యూరియా కేటాయించినా ఆగస్టు ప్రారంభం వరకూ 5 లక్షల టన్నులైనా రాలేదు. ఆగస్టులోనూ 2.21 లక్షల టన్నులు కేటాయించినా అందులో 1.40 లక్షల టన్నులు విదేశాల నుంచి వస్తుందని కేంద్రం తెలిపింది. కానీ లక్ష టన్నులు రాష్ట్రానికి ఇవ్వలేదు. దీనికితోడు నగదు బదిలీ రాయితీ విధానం వల్ల ప్రైవేటు డీలర్లు ముందుగా తెచ్చి నిల్వ ఉంచడం మానేశారు.

50 వేల టన్నుల కోత
ఒక్కో నెలలో రాష్ట్రానికి ఎంత యూరియా కావాలనే ప్రతిపాదనలను గత మార్చిలోనే కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయశాఖ ఇచ్చింది. సెప్టెంబరులో డిమాండ్‌ ఉండదని, రాష్ట్రానికి లక్ష టన్నులు చాలని తెలిపింది. జూన్‌, జులై నెలల్లో వర్షాలు లేక సాగు ఆలస్యం కావడం, ఏప్రిల్‌ నుంచి జులై వరకూ నిర్ణీత కోటా రాకపోవడంతో ఈ నెలలో 2.50 లక్షల టన్నులు కావాలని ఇటీవల కేంద్రాన్ని వ్యవసాయశాఖ అడిగింది. అందులో 50 వేల టన్నులు కోత పెట్టి 2 లక్షలటన్నులు ఇస్తామని కేంద్రం తెలిపింది. ‘‘మీరు సెప్టెంబరుకు లక్ష టన్నులే  అడిగారని, అయినా మరో లక్ష టన్నులు అదనంగా ఇస్తున్నట్లు చెప్పింది’’.


సరఫరాపై అసత్య ఆరోపణలు తగదు
- కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: యూరియా సరఫరా విషయంలో కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేయడం తగదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రణాళిక రూపొందించుకోకపోవడం వల్లే సమస్య వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన వెంటనే 50 శాతం యూరియా పంపామని, మరో రెండు రోజుల్లో మిగతా 50 శాతం పంపుతామని తెలిపారు. రాష్ట్రంలో రైతులు యూరియా కోసం ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.