
ప్రత్యేక కథనం
అండాలు, వీర్యకణాలకు బ్యాంకులు
నగరాల్లో పెరుగుతున్న నయా ట్రెండ్
ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరాలంటారు పెద్దలు. ఈ మాట వెనుక ఎంతో అర్థం పరమార్థం ఉందన్నది నిరూపితమవుతోంది. వయసు ముదిరిన తర్వాత సంతానం కనడం మంచిది కాదని, అలా పుట్టిన పిల్లల్లో అనేక సమస్యలు రావొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చదువు, ఆ తర్వాత ఉద్యోగం, కెరీర్లో ఎదగడం ఇలా ఎన్నో కారణాలతో వివాహాలను, ఆ తర్వాత సంతానాన్ని వాయిదా వేసుకుంటున్న దంపతులు ఈ సమస్యకు కొత్త పరిష్కారాన్ని వెతుక్కొంటున్నారు. మంచి యవ్వనంలో ఉన్నప్పుడే అండాలను, వీర్యకణాలను నిల్వ చేసుకుని సంతానం కావాలనుకున్నప్పుడు వాటిని ఉపయోగించుకుంటున్నారు. నూతన దంపతులు ఎంచుకుంటున్న నయా పంథా ఇది.
ఈనాడు - హైదరాబాద్
పదహారేళ్లకే పెళ్లి... ఇరవై ఏళ్లకే సంతానం. ఇది ఒకప్పటి మాట. నేడు ఆ తీరు మారింది. చదువు, కేరీర్లో పడి యువతీ, యువకులు పెళ్లిళ్లే కాదు...పెళ్లి తర్వాత పిల్లలు కనే విషయంలో కూడా వాయిదాలు వేస్తున్నారు. అయితే ఈ జాప్యం.. సంతానంలో అనేక రకాల సమస్యలకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో నూతన దంపతులు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. వీర్యకణాలు, అండాలు నిల్వ చేసుకొని జీవితంలో ఒక స్థిరత్వం వచ్చిన తర్వాత తిరిగి వాటి ద్వారా పిల్లలను కంటున్నారు. రాజధానిలో ఈ కొత్త తరహా ధోరణి పెరుగుతోంది. వీర్యకణాలు, అండాల బ్యాంకులను నిర్వహించేందుకు కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు కూడా ముందుకు వస్తున్నాయి. మంచి సంబంధం అనో...వయస్సు పెరుగుతుందనో...చాలామంది తల్లిదండ్రులు పిల్లల కేరీర్ మధ్యలోనే పెళ్లిళ్లు చేస్తుంటారు. పెళ్లి తర్వాత చదువుకోవచ్చుననే భరోసాతో కొందరు యువతులు తల్లిదండ్రుల మాట కాదనలేక పెళ్లికి సరే అంటున్నారు. వాస్తవంలో జరుగుతున్నది వేరే. పెళ్లి..పిల్లలు...ఆ సందడిలో పడి చదువు, కేరీర్ మధ్యలోనే ఆగిపోతోంది. మారుతున్న కాలంతోపాటు యవతీ, యువకుల ఆలోచన ధోరణిలో క్రమంగా మార్పు వస్తోంది. పెళ్లి అయిన తర్వాత కూడా చదువు...కేరీర్‌కు సమయం కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో పిల్లలను కనడాన్ని వాయిదా వేస్తున్నారు. కొందరు 2-3 ఏళ్లు...మరికొందరు గరిష్ఠంగా అయిదేళ్ల వరకు ఆగుతున్నారు. దీనివల్ల నష్టం కూడా జరుగుతోంది. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్యకరమైన వీర్యకణాలు...అండాల లభ్యత తగ్గుతుంది. లేదంటే బలహీన వీర్యకణాలు, అండాల వల్ల పుట్టే పిల్లల్లో జన్యుపరమైన సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఈ క్రమంలో పెళ్లయిన వెంటనే కొత్త దంపతుల నుంచి వీర్యకణాలు, అండాలు సేకరించి వాటిని దాచి పెడుతున్నారు. చదువు...కేరీర్లో ఒక స్పష్టత వచ్చిన రెండుమూడేళ్ల తర్వాత తిరిగి వాటితో పిల్లలను కంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. దంపతుల నుంచి సేకరించిన వీర్యకణాలు, అండాలను ఫ్రీజింగ్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి వినియోగించుకోవచ్చు. ఇందుకు ఏటా కొంత ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. తొలుత దంపతులకు కౌన్సెలింగ్ చేసిన తర్వాతే ఈ సేవలు అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. హైదరాబాద్‌లో ఈ తరహా బ్యాంకులకు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోందన్నారు.
సంతానలేమికి ఇవీ కారణాలు
* పెళ్లిళ్లు ఆలస్యంగా జరగడం.(మహిళలు 30 ఏళ్ల వరకు, పురుషులు 40 ఏళ్లవరకు వివాహం చేసుకోక పోవడం)
* వివాహం తర్వాత కూడా సంతానాన్ని వాయిదా వేసుకోవడం.
* జీవనశైలిలో వేగంగా వస్తున్న మార్పులు
* వాతావరణ కాలుష్యం
* పంటల్లో విచ్చలవిడిగా పురుగుమందుల వాడకంతో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం, పురుషుల్లో వీర్య కణాలు బలహీనం అవుతుండటం
* స్త్రీలల్లో అండాశయ ఇన్ఫెక్షన్లు, ఊబకాయం, పీసీఓడీ సమస్యలు
* ఉద్యోగాల పనివేళలు, ఒత్తిళ్లు
* ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు
* మధుమేహం, అధిక రక్తపోటు లాంటి జబ్బుల బారినపడటం
ఆ ధోరణి పెరుగుతోంది..
-డాక్టర్ రత్న, సీనియర్ ఇన్ఫెర్టిలిటీ నిపుణులు, రెయిన్బో ఆసుపత్రి, హైదరాబాద్
సంతానం విషయంలో కొత్త జంటల ధోరణి విభిన్నంగా ఉంటోంది. రకరకాల కారణాలతో వాయిదా వేస్తున్నారు. రెండుమూడేళ్ల తర్వాత మళ్లీ ప్రయత్నించినా ప్రయోజనం ఉండటం లేదు. ఇలాంటి వారంతా పిల్లల కోసం ఆసుపత్రులు చుట్టూ తిరుగుతున్నారు. ముందే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. చిన్నప్పటి నుంచి సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఎంత కేరీర్లో పడినా ఒత్తిడి తగ్గించుకోవాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. యువతీ యువకులు 30 ఏళ్లలోపే సంతానం కనేలా ప్రణాళిక వేసుకోవడం చాలా అవసరం. ఇంకా వీలు కాదంటే వీర్యకణాలు, అండాలు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే వాటిని ఫ్రీజింగ్ చేసుకొని రెండు, మూడేళ్ల తర్వాత వాడుకోవచ్చు. అయితే అప్పటి వరకు కూడా ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి.
మరిన్ని

దేవతార్చన
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’