close

ప్ర‌త్యేక క‌థ‌నం

అక్షరం... ఇంకెంత దూరం?

దేశంలో 32వ స్థానంలో తెలంగాణ
నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం
జాతీయ సగటు కంటే 30 జిల్లాల్లో తక్కువ అక్షరాస్యత శాతం
ఇప్పటికీ పూర్తిస్థాయి కార్యాచరణ కరవు

ఇల్లాలి చదువు... ఇంటికి వెలుగు; ప్రతి ఇంటా చదువు... సమాజానికి వెలుగు వంటి నినాదాలు అక్షరాస్యత అవసరాన్ని ఎంతో నొక్కి చెబుతున్నా ఇప్పటికీ చాలా ఇళ్లల్లో అక్షర కాంతులు విరజిమ్మడం లేదు. ఇది నాణేనికి ఒక పక్కయితే అందించే విద్యలో నాణ్యత లోపించడం మరో పార్శ్వం. సంపూర్ణ అక్షరాస్యతలో తెలంగాణ బాగా వెనుకబడింది. జాతీయ సగటు అక్షరాస్యతకూ చాలా దూరంగా ఉంది. తేడా ఆరున్నర శాతం. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ 32వ స్థానంలో మిగిలింది. ఇంకా వెనుకనున్న రాష్ట్రాలు నాలుగే నాలుగు... ఝార్ఖండ్‌, రాజస్థాన్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, బిహార్‌.

 

అక్షర వెలుగులు అందేదెన్నడు?
రాష్ట్రంలో ఆలోచనలు మెరుగ్గా ఉన్నా కనిపించని ఆచరణ

తెలంగాణలో అక్షరాస్యత పెంచేందుకు ఆలోచనలు చాలా చేసినా అడుగులు వడివడిగా ముందుకు పడడం లేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015 ఆగస్టులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అక్షరాస్యత పెంచడంపై అధికారులతో సమీక్షించారు. వయోజన విద్యా శాఖ అధికారులు 100 రోజుల్లో 50 లక్షల మంది వయోజనులను అక్షరాస్యులను చేసే కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సీఎంకు సమర్పించారు. దాంతో అక్షరాస్యత శాతం 95కు పెరుగుతుందన్నది వారి ప్రణాళిక. తమ వద్ద  సుమారు రూ.33 కోట్లు అందుబాటులో ఉన్నాయని ఆశాఖ నివేదించింది. అయితే ఆ ప్రణాళికకు ముఖ్యమంత్రి ఆమోదం తెలపకపోవడంతో అది అటకెక్కింది. 2017లో అప్పటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో త్రిపుర రాష్ట్రంలో అక్షరాస్యత ఎలా పెంచారన్న దానిపై పర్యటించి వచ్చారు. తదనంతరం కూడా అక్షరాస్యత కార్యక్రమం ముందుకు కదలలేదు. వయోజన విద్యను తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠంలో కలపాలన్న దానిపై కసరత్తు చేసినా అది ఇప్పటివరకు జరగలేదు.

అక్షరాస్యత పెంచాలని కేంద్ర ప్రభుత్వం 1978 అక్టోబరు 2న వయోజన విద్య కార్యక్రమాన్ని, ఆ తర్వాత 1988లో జాతీయ అక్షరాస్యత ఉద్యమాన్ని ప్రారంభించింది. అవి రాష్ట్రంలో మొక్కుబడిగానే సాగాయి.

మిగతా రాష్ట్రాలతో పోటీపడలేమా?
పలు రాష్ట్రాలు అక్షరాస్యత పెంచుకోవడానికి కృషి చేస్తున్నాయి. మన కంటే అక్షరాస్యతలో వెనుకుండే మధ్యప్రదేశ్‌ 2011లో నాలుగు మెట్లుపైకి చేరుకుంది. ప్రాథమిక విద్యపై దృష్టి పెట్టడం వల్లే అది సాధ్యమని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. ‘కేంద్రం నిధులిస్తే ఖర్చు చేస్తున్నారు తప్ప...సొంత నిధులను రాష్ట్రం ఎన్నడూ వినియోగించలేదు. కేంద్రం ఇస్తుంది కాబట్టి ఖర్చు చేస్తూపోయారు. కేంద్రం ఆపేసరికి ఇప్పుడు అక్షరాస్యత కార్యక్రమం కొద్ది సంవత్సరాలుగా అటకెక్కింది’ అని ఎంవీఎఫ్‌ ఫౌండేషన్‌ జాతీయ కన్వీనర్‌ వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో లెక్కలు ఏం చెబుతున్నాయంటే...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 1.04 కోట్ల మంది నిరక్షరాస్యులున్నారు.
వారిలో 15-49 మధ్య వయసు ఉన్న నిరక్షరాస్యులు దాదాపు 60 లక్షల మంది.
వచ్చే ఏడాది నిర్వహించే జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత శాతం 75కు చేరవచ్చని విద్యాశాఖ అధికారుల అంచనా.
2001-2010 మధ్య 8.5 శాతం అక్షరాస్యత పెరిగిందని, ఆ ప్రకారం తాజా అక్షరాస్యతను అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. దేశ సగటు 79 శాతానికి పెరగవచ్చని వారు పేర్కొంటున్నారు. అంటే జాతీయ సగటు కంటే ఇంకా వెనుకబడినట్లే.

ప్రధాన కారణాలు....

తెలంగాణలో నిజాం పరిపాలనలో పాఠశాలలు లేవు. ఒకటీ అర ఉన్నా ఉర్దూ మాధ్యమంలో చదువు కొనసాగేది. ఈ ప్రాంతంలో ఫ్యూడల్‌ వ్యవస్థ కారణంగా గ్రామాల్లో చాలా మందికి చదువుకోవాలని ఆసక్తి ఉన్నా దొరల ఆగ్రహానికి కారణమవుతామన్న భయంతో వెనుకడుగు వేశారు. బాలురు అధిక శాతం భూస్వాముల వద్ద పాలేర్లుగా పనిచేసేవారు.
పేదరికం వల్ల ప్రజలు చదువు కంటే పోషణకే అధికం ప్రాధాన్యం ఇచ్చారు. రాష్ట్రంలో 80 శాతం వరకు ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, బీసీలే ఉన్నారు. వారిలో అత్యధిక శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారే.
మహబూబ్‌నగర్‌, మెదక్‌ తదితర పాత జిల్లాల్లో పనులు లేక ఇతర ప్రాంతాలకు అధిక శాతం మంది వలసపోయేవారు. పెద్దల వెంట పిల్లలూ వెళ్లేవారు. ఇప్పటికీ పాలమూరు జిల్లాల్లో వ్యవసాయ పనులు ఉంటే పిల్లల్ని కూలి పనుల కోసం పంపుతుంటారు.
తెలంగాణలో తక్కువ పాఠశాలలు ఉన్నాయని 2000 ప్రాంతంలో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను నెలకొల్పింది. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడం, పేదరికం, వలసల వల్ల లక్షల మంది పిల్లలు మధ్యలోనే చదువుకు దూరమయ్యారు.

డిజిటల్‌ అక్షరాస్యత..

పల్లెలకు కూడా అత్యాధునిక స్మార్ట్‌ ఫోన్లు చేరిపోయిన నేటి తరుణంలో కేవలం అక్షరాలు చదవడమే కాక.. వాటి అర్థం తెలుసుకోవడమూ ముఖ్యమే. డిజిటల్‌ అక్షరాస్యత కొరవడితే మోసాల బారిన పడి జేబులు గుల్ల చేసుకోవడం ఖాయం. ఈ నేపథ్యంలో ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు అంటే ఏంటన్న విషయమూ నేర్పించక తప్పదు.

పిల్లలతో చదువు చెప్పిస్తాం
- జనార్దన్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి

అక్షరాస్యత దినోత్సవం నుంచి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈసారి విద్యార్థులే తమ కుటుంబ సభ్యులకు చదువు నేర్పేలా ప్రయోగం చేస్తున్నాం. పకడ్బందీగా నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నాం.

 

-ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.