close

ప్ర‌త్యేక క‌థ‌నం

జ్వరమొస్తే జేబు గుల్లే

చిరుద్యోగులు, చిరు వ్యాపారులు, దినసరి కూలీలపై తీవ్ర భారం
అటు ఉపాధి కోల్పోయి.. ఇటు చికిత్సకు వ్యయంతో చితికిపోతున్న బాధితులు

రాష్ట్రంలో విజృంభిస్తున్న విష జ్వరాల తాకిడికి ఆరోగ్యం దెబ్బతినడమే కాదు.. చాలామంది ఆర్థికంగానూ కుదేలైపోతున్నారు. దోమలు రక్తం పీల్చేస్తుంటే.. ఆసుపత్రులు వారి సొమ్ములు లాగేస్తున్నాయి.. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలవారు, చిరుద్యోగులు, చిరు వ్యాపారులు, కార్మికులు, దినసరి కూలీలు తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారు. ఇంట్లో ఒక్కరికి జ్వరమొచ్చినా జేబు గుల్లవుతోంది. ఒకేసారి ఇద్దరు ముగ్గురు జ్వరాల బారిన పడిన కుటుంబాలకు చికిత్స ఖర్చు పెను భారమవుతోంది. పస్తులుండేవాళ్లు కొందరైతే.. పుస్తెలమ్ముకునేవారు మరికొందరు.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రైవేటు ఆసుపత్రులూ నెలరోజులుగా జ్వర పీడితులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల తాకిడి అధికంగా ఉండడంతో.. ఆర్థికంగా స్థోమత లేనివారు కూడా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లక తప్పడంలేదు. సాధారణంగా జిల్లా కేంద్రాల్లో ఓపీలో రూ. 200-300 తీసుకునే వైద్యులు ఇదే అదనుగా కొన్నిచోట్ల తమ సంప్రదింపుల రుసుమును రూ. 400-500కు కూడా పెంచేశారు. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందితే ఆసుపత్రి స్థాయిని బట్టి, చికిత్స పొందిన రోజులను బట్టి, జ్వర తీవ్రతను బట్టి.. రూ.2 లక్షల వరకూ చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బాధితుల్లోని ఆందోళనను కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోయిందంటే రోగులను భయపెట్టే పర్వం ప్రారంభమవుతుంది. ప్లేట్‌లెట్ల సంఖ్య లక్ష కంటే తక్కువకు తగ్గిపోతే ఇక అరాచకం తారస్థాయికి చేరుతుంది. ఆసుపత్రిలో చేరాల్సిందేనని కొందరు వైద్యులు ఒత్తిడి పెంచుతున్నారు. ఐసీయూ చికిత్స, గంటకోసారి పరీక్షలు, హడావిడిగా ప్లేట్‌లెట్లు ఎక్కించడం.. వెరసి బిల్లు తడిసి మోపెడవుతోంది.

కుటుంబాలపై ఆర్థిక భారం

* రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లికి చెందిన ఒక బాలుడికి జ్వరం రావడంతో నిలోఫర్‌ ఆసుపత్రిలో చేర్చారు. కూలిపనులు చేసుకొనే భార్యాభర్తలిద్దరూ వారంరోజులుగా నిలోఫర్‌లోనే గడుపుతున్నారు. తల్లి లోపల బాలుడి వద్ద ఉంటే తండ్రి బయట ఉంటున్నాడు. ఇప్పుడు తండ్రి లోపలికి వెళ్లాలంటే.. అక్కడి భద్రతా సిబ్బందికి రూ. 10 ఇవ్వాల్సిందే. ఐసీయూలోకి వెళ్లాలంటే అక్కడి సిబ్బందికి మరో రూ. 10 ఇవ్వాలి. బాలుడికి దుస్తులు మార్చాలన్నా.. పడకపై దుప్పటి తీసి మరోటి వేయాలన్నా.. అక్కడి సిబ్బందికి ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే. అలా తల్లి లోపలికి కనీసం రెండుసార్లు, తండ్రి రెండుసార్లు వెళ్లి వచ్చారంటే.. భద్రతా సిబ్బందికిచ్చే ముడుపులే రూ. 100 దాటుతున్నాయి. ఇక తల్లిదండ్రులిద్దరికీ తిండికి, కాలకృత్యాలు తీర్చుకోడానికి, స్నానాలకు.. వెరసి రోజుకు కనీసం రూ. 500 వరకూ ఖర్చవుతోంది. వారిద్దరూ ఇక్కడే వారం రోజుల్నించి ఉంటుండడంతో.. ఉపాధినీ కోల్పోతున్నారు.

* కరీంనగర్‌ జిల్లా రామడుగుకు చెందిన ఓ మహిళ(45) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. వారంరోజులుగా జ్వరమొస్తుంటే స్థానిక వైద్యుడికి చూపించుకుంది. రక్తపరీక్షలు చేయిస్తే ప్లేట్‌లెట్లు తగ్గినట్లుగా తేలింది. డెంగీ అని నిర్ధారణ కాకపోయినా.. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందితే మేలని స్థానిక వైద్యుడు సలహా ఇచ్చాడు. కరీంనగర్‌ జిల్లా ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతుండడంతో.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. నాలుగు రోజులు చికిత్స పొందింది. రక్తపరీక్షలు, వైద్యుని సంప్రదింపులు, ఔషధాలు.. తదితరాలన్నీ కలిపి రూ. 50,000 చెల్లించి ఇంటికి చేరాల్సి వచ్చింది.

* హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి కుమారుడి(9)కి జ్వరమొచ్చింది. ఇక్కడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పిస్తే.. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే రూ. 2 లక్షల బిల్లు కాగా, మరో రూ.లక్ష వరకూ వ్యయమవుతుందని అంచనా.

* ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి చెందిన బియ్యాల రాములు కూలీగా జీవనం సాగిస్తున్నాడు. వారంరోజుల కిందట జ్వరం వస్తే ఇచ్చోడలోని ప్రైవేటు వైద్యుని వద్ద చూపించుకున్నాడు. ఆదిలాబాద్‌లో ప్రైవేటు నర్సింగ్‌హోంలో నాలుగు రోజుల పాటు వైద్యం పొందాడు. మొత్తంగా రూ. 15,000 ఖర్చయింది. వారం రోజుల కూలి నష్టపోవటమే కాకుండా ఉన్న డబ్బంతా ఖర్చయిపోయిందని ఆయన వాపోతున్నాడు.

జ్వరాల వాత.. లక్ష ఖర్చు 

ఖమ్మం జిల్లాకు చెందిన ఒక కుటుంబం మొత్తం ఒకేసారి వైరల్‌ జ్వరాల బారినపడ్డారు. ఒక స్టీలుషాపులో నెలకు రూ. 7,000 వేతనానికి పనిచేసే ఆ చిరుద్యోగి ఒక ప్రైవేటు ఆసుపత్రి జనరల్‌ వార్డులో చికిత్స పొందాడు. ఉపాధి కోల్పోవడమే కాకుండా రూ.లక్ష వరకూ ఖర్చవడంతో ఆ కుటుంబం ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటోంది. 

పుస్తెలు అమ్ముకోవలసి వచ్చింది.. 

*  హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో కిరాణాషాపు వ్యాపారి కుమార్తె(10)కు విషజ్వరమని తేలింది. ప్రైవేటులో చేరితే డెంగీ అని నిర్ధారించి చికిత్స చేశారు. రూ. 60,000 బిల్లయితే.. చివరకు పుస్తెలతాడును అమ్ముకోవాల్సి వచ్చిందని తల్లి వాపోయింది. 

బిల్లు కట్టలేక.. ప్రాణాలు పణం 

*  మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం రేగులతండా పరిధిలోని రామచంద్రాపురానికి చెందిన ఒక బాలిక(9)కు కొద్దిరోజుల కిందట జ్వరమొచ్చింది. ప్లేట్‌లెట్లు తగ్గుతున్నాయని గుర్తించి మహబూబాబాద్‌లో చికిత్స అందించారు. రూ. 40,000 ఖర్చయింది. ఇంటికొచ్చాక మళ్లీ ఆ బాలిక నీరసించడంతో ఈసారి ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈసారి కూడా ఖర్చు భారీగా పెరుగుతుండడంతో.. భరించే స్తోమత లేక బాలికను ఇంటికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమించి ఆమె కన్నుమూసింది. 
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ జ్వర నిర్ధారణ పరీక్షలు,  ఔషధాలు, చికిత్సలను ఉచితంగానే అందిస్తున్నారు. అయినా.. జ్వర బాధితులకు జేబుల్లోంచి ఖర్చుపెట్టక తప్పడం లేదు. సర్కారు ఆసుపత్రిలో ప్రవేశం దగ్గర్నుంచి.. ప్రతి సేవల్లోనూ అదనంగా అక్కడి సిబ్బంది వసూలు చేస్తుండడంతో చిల్లరగానే వందల్లో ఖర్చవుతోంది. స్నానాల గదుల వంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో వాటికి కూడా చెల్లించాల్సి వస్తోంది.

సర్కారు దవాఖానాలో 
*చికిత్స పొందినా ఇతరత్రా అవసరాల కోసం రోజుకు అవుతున్న ఖర్చు రూ.500-1000 
*ప్రైవేటు ఆసుపత్రులైతే సుమారుగా అవుతున్న బిల్లు రూ. 50,000 - రూ. 2 లక్షలు

- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.