close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఇదే అదను.. ఇక పాలనకు పదును..!

మంత్రివర్గ విస్తరణతో ఊతం
మంత్రివర్గంలోకి హరీశ్‌, కేటీఆర్‌
మహిళలకు చోటుతో విమర్శలకు సమాధానం
విపక్షాలను దీటుగా ఎదుర్కొనే వ్యూహం

ఈనాడు, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అదునుచూసి అస్త్రాలను సంధించారు. గత మంత్రివర్గంలో తనకు కుడి ఎడమలుగా ఉన్న కేటీఆర్‌, హరీశ్‌రావులకు మళ్లీ పాలన పగ్గాలు అందించారు. ఇద్దరు మహిళలకు మంత్రివర్గంలో చోటుకల్పించి విమర్శలకు దీటుగా జవాబిచ్చారు. భౌగోళికంగా, సామాజికంగా అందరినీ సంతృప్తిపరచడానికి యత్నించారు. ఒకవైపు పార్టీలో అంతర్గత సమస్యలు మొదలయ్యాయి. పార్టీ నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలయింది. వీటికి తోడు యూరియా పంపిణీ, యాదాద్రిలో రాజకీయ చిత్రాల వివాదంపై విపక్షాలు మూకుమ్మడి దాడికి పూనుకున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పదవులను ఆశిస్తున్నారు. వారికి పురపాలక ఎన్నికల అనంతరం అవకాశాలు కల్పిస్తామని సీఎం గతంలో ప్రకటించినా పురపాలక ఎన్నికలు ఎప్పుడు వచ్చేదీ స్పష్టత రాలేదు. దాంతో వారిలో అసంతృప్తి పెరుగుతోంది.  మంత్రివర్గంలో మహిళలకు చోటు లేకపోవడం, గిరిజనులు, బీసీల్లో బలమైన సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం లేకపోవడం తదితర అంశాల ప్రభావం  కనిపించింది. మంత్రివర్గంలో ఎస్టీ లేకపోవడంపై విమర్శలు తలెత్తాయి. బీసీలలో ముఖ్య సామాజికవర్గం నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలున్నా మంత్రిగా అవకాశం ఇవ్వలేదని విపక్షాలు దాన్ని ఒక అంశంగా చేశాయి. ఈ నేపథ్యంలో పాలన, పార్టీపై పూర్తిస్థాయి పట్టు అవసరమని సీఎం భావించారు.  జాప్యం చేస్తే మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని భావించి సీఎం పదవుల భర్తీని చేపట్టినట్లు తెలుస్తోంది. ముందుగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు పదవులు కేటాయించి తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టారు.

శాసనసభ ఎన్నికల అనంతరం కేటీఆర్‌ను మంత్రివర్గంలోకి తీసుకోకుండా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షునిగా పార్టీ బాధ్యతలు అప్పగించారు. వీటిని ఆయన నిర్వహిస్తున్నా... ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా ఉండడానికి వీలుగా ఆయనకు మంత్రి పదవి ఉండాలని పార్టీ నేతలు సీఎంకు సూచించారు. హరీశ్‌రావు పార్టీలో కీలక నేతగా ఉన్నారు. అనుభవం దృష్యా ఆయన మంత్రిగా ఉండాలనే అభిప్రాయాలు శ్రేణుల్లో వ్యక్తమయ్యాయి. మరోవైపు మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం గతంలో కొంతమందికి హామీ ఇచ్చి ఉన్నారు.

ఆచితూచి శాఖల అప్పగింత..
విస్తరణలో శాఖల కేటాయింపులోనూ సీఎం ఆచితూచి వ్యవహరించారు. కీలకమైన ఆర్థిక శాఖకు అనుభవజ్ఞుడైన హరీశ్‌ సేవలు కావాలనుకున్నారు. పాత శాఖలపైనే కేటీఆర్‌ ఆసక్తి చూపడంతో ఆయనకు ఆ అవకాశం ఇచ్చారు. తన వద్ద, ఇతర మంత్రులకు అదనంగా ఉన్న శాఖల్లో కొన్నింటిని మిగిలిన మంత్రులకు కేటాయించారు. రెవెన్యూ, నీటిపారుదల, ప్రణాళిక, గనుల వంటి శాఖలను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నారు. మంత్రివర్గం సంపూర్ణంగా ఏర్పడినందున ఇక పాలన పరుగులు తీస్తుందని ఆయన ఆశిస్తున్నారు. తెలంగాణలో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటుతో పాలన పరుగులు తీయనుంది. అన్నిశాఖలను సమర్థంగా నిర్వహించడంతో పాటు విపక్షాలను దీటుగా ఎదుర్కొని ముందుకు సాగాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశిస్తున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.