close

ప్ర‌త్యేక క‌థ‌నం

పసివాడికి జరమొచ్చింది

డెంగీ కోరల్లో చిన్నారులు
బాధితుల్లో 30% మంది 15 ఏళ్లలోపు వారే
పసివాళ్లు మరణిస్తున్నా గణించని ఆరోగ్యశాఖ
పాఠశాలల్లో 30-40% తగ్గిన హాజరు
విద్యాసంస్థలే వైరస్‌ వ్యాప్తికి కేంద్రాలు
డెంగీ ‘ఆత్యయిక స్థితి’ ప్రకటించాలని నిపుణుల సూచన
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో డెంగీ జ్వరం తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. గత ఐదేళ్లలో ఎన్నడూలేని స్థాయిలో ఈ ఏడాది ఇప్పటివరకూ ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 4 వేలకు పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. గత నాలుగు రోజుల్లోనూ ఈ జ్వరం భయంతో సుమారు 19 వేల మంది పరీక్షలు చేయించుకోగా.. 1,156 మందిలో డెంగీ వైరస్‌ ఉన్నట్లు వెల్లడైంది. బాధితుల్లో సుమారు 30 శాతం మంది 15 ఏళ్లలోపు పిల్లలే కావడం మరో ఆందోళనకర పరిణామం. జ్వరాలతో చిన్నారులు అల్లాడుతుండడంతో అన్ని పాఠశాలలు, కళాశాలల్లో గత నాలుగైదు వారాలుగా హాజరు గణనీయంగా తగ్గింది. అత్యధిక విద్యాసంస్థల్లో 50 నుంచి 60 శాతం హాజరు మాత్రమే నమోదవుతోంది. డెంగీ ఇంత తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందడంలో విద్యాసంస్థలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని, ఈ వైరస్‌ సోకిన విద్యార్థిని కుట్టిన దోమ మరో విద్యార్థిని కుట్టడం ద్వారా వారిలోనూ డెంగీ కనిపించే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిలోఫర్‌, ఫీవర్‌, గాంధీ, ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్కోచోట రోజుకు 1,500- 2,000 మందికి పైగా ఓపీలో చికిత్స కోసం వస్తున్నారు. సాధారణంగా రోజుకు 100 మందిని చేర్చుకునే నిలోఫర్‌, ఫీవర్‌ వంటి ఆసుపత్రుల్లో ఇప్పుడు 300 మంది జ్వరాల తీవ్రతతో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి. సాధారణ వార్డులు, గదులు, ఐసీయూలు అన్నీ జ్వర బాధితులతో నిండిపోయాయి.

విషమిస్తున్న పరిస్థితి... డెంగీ సోకిన 6-12 ఏళ్లలోపు చిన్నారుల్లో ఎక్కువగా పరిస్థితి తీవ్రంగా ఉంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వీరిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుండడం దీనికి కారణమవుతోంది. ముఖ్యంగా పౌష్టికాహార లోపంతో బాధపడేవారిలో తీవ్రత అధికంగా ఉంటోంది.

ఏడాదిలోపు వారు ఈ జ్వరం బారిన పడితే మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ఇతర అవయవాలపై త్వరగా దుష్ప్రభావం చూపుతుంది. డెంగీలో వేర్వేరు శ్రేణుల వైరస్‌లుంటాయి. ఏ తరహా వైరస్‌ సోకిందనేది కూడా ప్రమాద తీవ్రతకు కారణమవుతోంది. డెంగీ మృతుల్లోనూ అత్యధికులు 6-12 ఏళ్లలోపు వయసువారే ఉంటున్నారు. ‘డెంగీ’తో చిన్నారులు మృతి చెందుతున్నారని ఆసుపత్రులు ధ్రువీకరిస్తున్నా.. వైద్య ఆరోగ్యశాఖ పరిగణనలోకి తీసుకోవడం లేదు.

జ్వరం తగ్గిన తర్వాతే విషమం..
* డెంగీ జ్వరం వచ్చిన వారిలో నూటికి 99 శాతం మందికి సాధారణంగానే తగ్గిపోతుంటుంది. ఒక్క శాతం మందిలో మాత్రమే సమస్య తీవ్రమవుతుంది.
* ఈ జ్వరం మూడు దశల్లో ఉంటుంది. దాదాపు 5 రోజుల వరకూ తొలిదశలో జ్వరం తీవ్రంగా ఉంటుంది. ఈ దశలో వాంతులు వంటి ఇతర లక్షణాలేవీ లేకపోతే పారాసిటమాల్‌ ఔషధాన్ని తగిన మోతాదులో వాడితే సరిపోతుంది.
* జ్వరం తగ్గిన తర్వాతే కొందరిలో విషమ పరిస్థితి ఎదురవుతుంది. రక్తం చిక్కపడటం, హిమోగ్లోబిన్‌ మోతాదు ఎక్కువవడం, రక్తపోటు పడిపోవడం, ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోవడం జరగవచ్చు.
* కొందరిలో అంతర్గత అవయవాల్లో రక్తస్రావం కూడా కావచ్చు.

ఎప్పుడు సందేహించాలి?
వాంతులు, కడుపునొప్పి, అస్థిరత, చికాకు, మగత, అపస్మారకం.. చిగుళ్లు వంటి ఇతర అవయవాల నుంచి రక్తం కారడం, చర్మం మీద ఎర్రటి మచ్చలు కనిపించడం, రక్తపోటు పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ఈ దశలో సరైన చికిత్స అందించకపోతే కొందరిలో ఊపిరితిత్తులు, క్లోమం, గుండె, మెదడు వంటి ఇతర అవయవాలపై దుష్ప్రభావం చూపుతుంది.

మంచి నీటి దోమ ఇది..
* డెంగీ కారక దోమ 2-4 వారాలు జీవిస్తుంది. 200-300 వరకూ గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లు ఏడాది పాటు కూడా జీవిస్తాయి.
* ప్రధానంగా మంచి నీటిలోనే ఈ దోమ గుడ్లు పెడుతుంది. పెద్ద జలాశయాలేమీ అక్కర్లేదు.. కొబ్బరిచిప్పలో నిలిచిన వాననీటిలోనూ గుడ్లు పెడుతుంది.

ఈ జాగ్రత్తలు తీసుకోండి

* ఇళ్లలో, ఇంటి పరిసరాల్లో, విద్యాసంస్థల్లో, రోడ్లపై, భవన నిర్మాణాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
* నిల్వ నీటిపై దోమల మందు పిచికారీ చేయాలి.
* నీటి డ్రమ్ములు, సంపులు, ట్యాంకులపై మూతలు పెట్టాలి.
* దోమలు కుట్టకుండా శరీరాన్ని కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి.

మనుషులే డెంగీ వైరస్‌ వ్యాప్తికి ప్రధాన కారకులు

* అన్ని ‘ఈడిస్‌ ఈజిఫ్టై’ దోమల్లో డెంగీ వైరస్‌ ఉండదు.
* ఈ వైరస్‌ ఉన్న ‘ఈడిస్‌ ఈజిఫ్టై’ దోమ కుట్టిన వ్యక్తిలో 2-7 రోజుల్లో ఆ వైరస్‌ రక్తంలో కలిసిపోతుంది. వారికి సాధారణంగా 4-5 రోజుల్లో జ్వరం వస్తుంది. కొందరిలో 12 రోజుల్లోనూ కనిపించవచ్చు.
* ఈ వైరస్‌ మనిషి శరీరంలో 12-14 రోజుల వరకూ ఉంటుంది.
* డెంగీ సోకిన వ్యక్తిని.. ఆ వైరస్‌ లేని ‘ఈడిస్‌ ఈజిఫ్టై’ దోమ కుట్టడం ద్వారా తొలుత ఆ దోమలోకి, ఆ తర్వాత ఆ దోమ మరో మనిషిని కుట్టడం ద్వారా ఆ మనిషికి వ్యాప్తి చెందుతుంది.

జనసమ్మర్థ ప్రాంతాలకు వెళ్లకపోవడమే మేలు
- డాక్టర్‌ సురేశ్‌కుమార్‌ సూరపనేని, పిల్లల వైద్య నిపుణులు

ప్పటికే డెంగీ జ్వరంతో బాధపడినవారుగానీ, వైరల్‌ జ్వరంతో చికిత్స పొందినవారుగానీ.. ఎక్కువమంది గుమిగూడే ప్రాంతాలకు.. ఉదాహరణకు వినాయక నిమజ్జనం వంటి ప్రాంతాలకు వెళ్లకపోవడమే మేలు. డెంగీ వైరస్‌ శరీరంలో 14 రోజుల పాటు సజీవంగా ఉంటుంది.
నీరు నిల్వ ఉన్న ప్రాంతాలకు ఆ జ్వర బాధితులు వెళ్లడం ద్వారా వారిని కుట్టిన దోమ మరొకరిని కుట్టి వ్యాధిని వ్యాప్తి చేసే అవకాశాలుంటాయి. దీంతో భారీగా డెంగీ వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉంది.

ఆత్యయిక స్థితి ప్రకటించాలి
- డాక్టర్‌ సుదర్శన్‌రెడ్డి, పిల్లల వైద్య నిపుణులు

తంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఈ సంవత్సరం అత్యధికంగా డెంగీ కేసులు నమోదవుతున్నాయి. పరిస్థితి తీవ్రంగా ఉన్నా.. ప్రభుత్వానికి సరైన నివేదికలు అందడంలేదు. ఐపీఎంలో చేయించిన పరీక్ష మాత్రమే చెల్లుబాటు అవుతుందంటే ఎలా? అందరూ అక్కడికి వెళ్లి చేయించుకోగలరా? ప్రైవేటులోనూ అత్యాధునిక పరికరాలున్నాయి. వాటిల్లో డెంగీ పరీక్షలు చేస్తే నాణ్యమైన ఫలితాలే వస్తాయి. వాటిని పరిగణనలోకి తీసుకోకపోవడం ఎంతమేరకు సమంజసం? డెంగీ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ‘ఆత్యయిక స్థితి’ని ప్రకటించాలి. పాఠశాలలు, కళాశాలల్లో దోమల నిర్మూలనకు ఉద్ధృతంగా చర్యలు చేపట్టాలి. స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయాలి. సామాజిక ఉద్యమంగా కదలాలి. ప్రతి కుటుంబం డెంగీకి వ్యతిరేకంగా పోరాడాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.