close

ప్ర‌త్యేక క‌థ‌నం

శ్రీశైలానికి నిర్లక్ష్యపు ‘వరద’

నిండుకుండలా జలాశయం
సీడబ్ల్యూసీ నుంచి ఎప్పటికప్పుడు అంచనాలు
అందుకు తగ్గట్టుగా నిర్వహణ ఏదీ?

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్టుల నిర్వహణ గాడి తప్పుతోంది. దీనికి కొందరు ఇంజినీర్ల నిర్లక్ష్యం కూడా కారణమవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం జలాశయం క్రస్ట్‌గేట్ల మీదుగా మంగళవారం వరద జలాలు ప్రవహించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సరైన సమయంలో సరైన రీతిలో గేట్ల నిర్వహణ జరగలేదని, జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులను దాటిపోయినా గేట్లు ఆ మేరకు ఎత్తకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న భావన వ్యక్తమవుతోంది. మంగళవారం ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు 16.97 టీఎంసీల వరద శ్రీశైలానికి వస్తుందని కేంద్ర జలసంఘం నుంచి వర్తమానం ఉంది. అయినా... గేట్లు తెరవడంలో అలసత్వం ప్రదర్శించడం ప్రశ్నార్థకమవుతోంది. డ్యాం నిర్వహణపై దృష్టి సారించే అధికారులు రాబోయే రెండు మూడు రోజుల పరిస్థితిపై అంచనాతోనే వ్యవహరించాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

* జలాశయం నిండుగా ఉన్నందున.... ఆ సమయంలో గాలి ఎక్కువగా ఉండటం వల్ల ఇలా జరిగిందని అధికారులు వివరణ ఇస్తున్నారు. అక్కడ క్రస్ట్‌ గేట్ల నుంచి మళ్లిన నీరు చాలా ఉద్ధృతంగానే ప్రవహించిందని, అది కేవలం గాలి కెరటాల ప్రభావమని మదింపు చేయలేమని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇలా గేట్లపై నుంచి నీరు మళ్లినా ఏం కాదని చెబుతున్నా రేడియల్‌ గేట్లలో ఉండే ఇంజిస్‌ దెబ్బతినే అవకాశం ఉందని చెబుతున్నారు.

* గేట్ల నిర్వహణకు మాన్యువల్‌ ఉంటుంది. పై నుంచి ఎంత వరద వస్తే డ్యాం భద్రత ప్రకారం ఏ మేరకు గేట్లు ఎత్తి ఎంత నీటిని కిందకు వదలాలో అధ్యయనాలతో సహా ఉన్నాయని ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.

* ఎగువ జలాశయాల నుంచి వచ్చే ప్రవాహాలు, దిగువన జలాశయాలన్నీ నిండుకుండలా ఉన్న నేపథ్యంలో శ్రీశైలంలో దాదాపు 40టీఎంసీల వరకు ఖాళీ చేసి ఉంచుకోవచ్చని జలవనరులశాఖలోనే మరో విభాగం సూచించినట్లు సమాచారం. ఈ విషయాన్ని కూడా డ్యాం నిర్వహణ అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు.

ఆగస్టు 14న ఏం జరిగిందంటే...?
గత నెలలో కూడా డ్యాం నిర్వహణలో లోపం తలెత్తగా కర్నూలు నగరానికి ముంపు పెరగడంతో జిల్లా ఉన్నతాధికారి ఒకరు హెచ్చరించారు. దాంతో మళ్లీ కొద్ది గంటల్లోనే నీటి విడుదలను పెంచిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
* ఆగస్టు 14న ఉదయం 8గంటలకు 10గేట్లు 42అడుగుల మేర ఎత్తి (10×42) 7,89,730 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
* 12గంటలకు 5గేట్లు 42అడుగుల మేర ఎత్తి( 5×42) మరో 5గేట్లు 30అడుగులకు దించేసి (5×30) మొత్తం 7,19,050 క్యూసెక్కులు వదిలారు.
* మధ్యాహ్నం 2గంటలకు 10గేట్లు 30అడుగులకు దించేసి 6,36,230 విడుదలను తగ్గించారు. ఇలా సాయంత్రం 6గంటల వరకు 30అడుగులకు తగ్గించి నీటిని వదిలేశారు.
* అనంతరం హఠాత్తుగా సాయంత్రం 7గంటలకు అన్ని గేట్లు మళ్లీ ఏడు అడుగుల మేర పైకి ఎత్తి నీటి విడుదలను పెంచారు.

ఎస్‌ఈగా చంద్రశేఖర్‌రావు

శ్రీశైలం జలాశయం పర్యవేక్షక ఇంజినీరు శ్రీనివాసరెడ్డిని మారుస్తూ ఏపీ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన స్థానంలో తూర్పుగోదావరి నీరు-ప్రగతి పర్యవేక్షక ఇంజినీరుగా ఉన్న ఎస్‌.చంద్రశేఖర్‌రావుకు ఎస్‌ఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. మరో పక్క డ్యాం భద్రతకు సంబంధించి పరిశీలన చేపట్టేందుకు ఈ నెల 18, 19 తేదీల్లో డ్యాం భద్రత కమిటీ పర్యటించనుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.