close

ప్ర‌త్యేక క‌థ‌నం

అక్రమాల ఆడిట్‌

వసూళ్లే లక్ష్యంగా వాణిజ్య పన్నుల అధికారుల తనిఖీలు
యథేచ్ఛగా అనధికార పరిశీలనలు
అడపాదడపా వెలుగు చూస్తోంది కొంతే
జీఎస్టీతో మూసుకుపోయిన అక్రమ దారులు
కొత్త మార్గంలో దోపిడీ

ఇటీవల సరూర్‌నగర్‌ డివిజన్‌లో శివకుమార్‌ అనే ఏసీటీఓను ఓ వ్యాపారి సంప్రదించారు. ఐదేళ్ల తన వ్యాపార లావాదేవీలకు సంబంధించి నివేదిక కోరారు. ఆ అధికారి రూ.50 వేలు డిమాండ్‌ చేశారు. దీంతో సదరు వ్యాపారి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా..వారు వలవేసి ఆ అధికారిని పట్టుకున్నారు.

ఈనాడు - హైదరాబాద్‌

ప్రభుత్వ ఖజానాకు ఎక్కువ రాబడిని అందించే వాణిజ్యపన్నులశాఖలో అవినీతికి తెరతీశారు కొందరు అధికారులు. జీఎస్టీతో పాత దారులు మూసుకుపోగా కొత్త దారులతో దండుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మాంద్యం ప్రభావం పన్ను వసూళ్లపై ఉన్నా.. వీరి అవినీతిపై మాత్రం లేదు. గతంలో వ్యాపారుల రిజిస్ట్రేషన్‌ నుంచి అవినీతి మొదలయ్యేది. రిజిస్ట్రేషన్‌, నిల్వలు, పన్ను రిటర్న్‌దాఖలు, రిఫండ్‌, ఆడిట్‌, చెక్‌పోస్టుల్లో తనిఖీలు..ఇలా వివిధ సందర్భాల్లో అవినీతికి ఆస్కారం ఉండేది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్‌, రిటర్న్‌దాఖలు, రిఫండ్‌ ఆన్‌లైన్‌ విధానంలోకి మారిపోవడంతో అధికారుల ప్రమేయం లేకుండా పోయింది. దీంతో ఆడిట్‌ పేరుతో అవినీతికి పాల్పడుతున్నారు. నాలుగైదేళ్లకు సంబంధించిన లావాదేవీల నివేదికలివ్వాలని వ్యాపారులను బెదిరిస్తున్నారు. పన్ను చెల్లింపు అంతరాలుంటాయని వ్యాపారులు సుముఖత చూపకపోవడంతో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు.

ఖజానాకు గండికొడుతూ వాణిజ్య పన్నులశాఖ అధికారులు, వ్యాపారులు చాలా చోట్ల ఒక్కటవుతున్నారు. అధికారుల అగడాలు భరించలేక అక్కడక్కడ కొందరు వ్యాపారులు మాత్రం ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. కొంతమంది డిప్యూటీ కమిషనర్లు ఇష్టారాజ్యంగా ఆడిట్‌లు చేయాలని కిందిస్థాయి అధికారులకు సూచించిన అంశం వెలుగులోకి రావడంతో వాణిజ్యపన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అప్రమత్తమయ్యారు. ఆడిట్‌ చేయడానికి ప్రత్యేక విధానం తీసుకువచ్చారు. ఈ విధానం ప్రకారం అక్రమాలు అసాధ్యమని గుర్తించిన కొంతమంది అధికారులు అనధికార ఆడిట్‌లకు తెరలేపి వసూళ్లకు పాల్పడుతూనే ఉన్నారు.

అనధికారికంగా వాహనాల తనిఖీ
జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత చెక్‌పోస్టులు లేవు. తనిఖీలకు ప్రత్యేక విధానం ఉంటుంది. తనిఖీ చేస్తే కేసులు నమోదు చేయాలి. అధికారులు అవేవీ పట్టించుకోవడం లేదు. అక్రమంగా సరకులు రవాణా అవుతున్నాయని పేర్కొంటూ యథాలాపంగా వాహనాలు తనిఖీ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. నిబంధనల మేరకే వ్యవహరించాలని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నా.. తమ పరిధిలోని అంశమని పేర్కొంటూ అధికారులు వాహనాల తనిఖీలు కొనసాగిస్తున్నారు.

కమిషనర్‌పైనే ఆకాశ రామన్న ఉత్తరం
రాష్ట్రంలో వాణిజ్య పన్నులశాఖలో 12 డివిజన్లున్నాయి. వీటిలో దాదాపు 70 శాతంపైగా రాబడినిచ్చే ఏడు డివిజన్లు హైదరాబాద్‌ కేంద్రంగానే ఉన్నాయి. అత్యధిక రాబడి ఇచ్చే చోట పోస్టింగుల కోసం కొందరు అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ప్రయత్నం ఫలించక ఓ అధికారి ఏకంగా ఆ శాఖ కమిషనర్‌పైనే ఆకాశరామన్న ఉత్తరం రాయడం కలకలం రేపింది. కమిషనర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ రాసిన లేఖకు నేపథ్యం పోస్టింగ్‌ల్లో అసంతృప్తే కారణమని, ప్రధానంగా హైదరాబాద్‌లో నియమించకపోవడమని ఉన్నతాధికారుల పరిశీలనలో వెల్లడైంది.

ఏం చేయలేకపోతున్నాం
హైదరాబాద్‌లోని మూడు డివిజన్లలో ఉన్నతాధికారులను బేఖాతరు చేస్తూ కింది స్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వ్యాపార సంస్థల్లో పరిశీలనలు, వాహనాల తనిఖీలు, నోటీసులివ్వడం వంటి వాటికి పాల్పడుతున్నారు. అటువంటి ఉద్యోగుల విషయంలో ఒత్తిళ్లు వస్తుండటంతో ఏమీ చేయలేకపోతున్నట్లు ఒక డివిజన్‌ అధికారి చెప్పడం పరిస్థితి తీవ్రతకు దర్పణం.

దొరుకుతోంది కొందరే
* పంజాగుట్ట డివిజన్‌లో సనత్‌నగర్‌ సర్కిల్‌ ఏసీటీఓ సత్యనారాయణ రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఇటీవల అవినీతి నిరోధకశాఖకు చిక్కారు. వ్యాపార సంస్థకు అనుకూలంగా ఆడిట్‌ రిపోర్టు ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. జీఎస్టీకి సంబంధించి రిటర్న్‌దాఖలు చేసే ట్యాక్స్‌ కన్సల్టెంట్‌ ఒకరు ‘ఈనాడు’తో మాట్లాడుతూ కొందరు ఉన్నతాధికారులు ప్రతి అంశానికి డబ్బులు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
* రిజిస్ట్రేషన్‌లో మార్పులతో పాటు వాణిజ్యపన్నులశాఖ అధికారుల జోక్యంతో జరగాల్సిన ప్రతి పనికి డబ్బులు డిమాండ్‌ చేయడం సాధారణ అంశంగా మారిందని వ్యాపారులు పేర్కొంటున్నారు.
* దాఖలు చేసిన రిటర్న్‌లలో చిన్న అంతరం ఉన్నా అధికారులు నోటీసులిస్తున్నారు. డబ్బు డిమాండ్‌ చేస్తున్నారని పలువురు వ్యాపారులు ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
* టాస్క్‌ఫోర్సుకు చెందిన కొందరు ఉద్యోగులు  వ్యాపారులను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్‌ చేస్తున్న ఘటనలపై  ఫిర్యాదులు రాగా అంతర్గత విచారణ కొనసాగుతోంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.