close

ప్ర‌త్యేక క‌థ‌నం

పండగల రైళ్లన్నీఇప్పటికే ఫుల్‌

దసరా, దీపావళికి టికెట్లు దుర్లభం
సంక్రాంతి పండగకూ కిటకిటే
4 నెలల ముందే రిజర్వేషన్లు పూర్తి
అయినా ఎడాపెడా అదనపు టికెట్ల జారీ
ఖరారుకు అవకాశమే లేదంటున్న నిపుణులు
టికెట్ల రద్దు.. సర్వీస్‌ ఛార్జీలతో ప్రయాణికుల జేబులకు చిల్లు
రైల్వే శాఖ దొడ్డిదారి దోపిడీ

సినిమా హాలు నిండిపోయింది..
బయట హౌస్‌ఫుల్‌ బోర్డు కూడా పెట్టారు..
అయినా టికెట్లు అమ్ముతూనే ఉన్నారంటే అర్థమేంటి?
టికెట్లు కొనుక్కుని ప్రేక్షకులు ఏం చేయాలి?
రైల్వేశాఖ తీరు ఇలాగే ఉంది.
రైల్లో ఉన్న బెర్తులన్నింటికీ రిజర్వేషన్‌ టికెట్లు బుక్‌ అయిపోయినా.. ఇంకా వందలాదిగా టికెట్లు జారీ చేస్తూనే ఉంది. చివరిదాకా ఎదురుచూసి టికెట్‌ ఖరారు కాకపోవడంతో వాటిని రద్దు చేసుకునే ప్రయాణికుల నుంచి క్యాన్సిలేషన్‌ ఛార్జీల రూపంలో భారీగా దండుకుంటోంది..

ఈనాడు - హైదరాబాద్‌

సరా, దీపావళి, సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండగలు. ఉద్యోగం, ఉపాధి కోసం దూర ప్రాంతాల్లో ఉంటున్నవారు ఎంతోమంది ఈ పండగలకు సొంతూరు బాట పడతారు. దూరప్రాంతాలకు వెళ్లేవారికి రైలు ప్రయాణమే ఆధారం. రద్దీకి తగినన్ని రైళ్లు నడపని ఈ శాఖ ఉన్న రైళ్లలోనూ పరిమితికి మించి టికెట్లు అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటోంది. దసరా, దీపావళి పర్వదినాలకు ఇప్పటికే రైళ్లలో వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లు కూడా దొరకని పరిస్థితి. ఇక సంక్రాంతి పండక్కి ఏకంగా నాలుగు నెలలు ఉండగానే రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయిపోయాయి. ఆఖరి నిమిషంలో అయినా టికెట్‌ దొరక్కపోదా అన్న చిరు ఆశతో చాలామంది వెయిటింగ్‌ లిస్ట్‌ (నిరీక్షణ)లో టికెట్లు తీసుకుంటున్నారు. ఒక్కో రైల్లో.. పదులు.. వందల్లో కాదు.. కొన్నింటిలో అయితే ఈ నిరీక్షణ జాబితా వెయ్యి దాటేసింది. పండక్కి సొంతూరుకు ఎలా వెళ్లాలన్నది ఒక సమస్య అయితే.. టికెట్ల రద్దు, సర్వీస్‌ ఛార్జీ పేరుతో ప్రయాణికుల జేబులకు భారీగా చిల్లు పెడుతుండడం మరో సమస్య. ఒక్కో బండిలో ఇన్నేసి వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లు ఇవ్వడంపై విస్మయం వ్యక్తమవుతోంది. నిపుణులైతే కనీస అవకాశం లేకున్నా ఇన్నేసి అదనపు టికెట్లు ఇవ్వడంపై ‘ప్రయాణం పేరుతో.. పట్టపగలు దోపిడీ’గా మండిపడుతున్నారు.

వెయిటింగ్‌ టికెట్ల మాటేంటి?

రిజర్వేషన్‌ ప్రయాణికుల్లో ఎవరైనా టికెట్లు రద్దు చేసుకుంటే గానీ వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లు ఉన్న వారికి రిజర్వేషన్‌ ఖరారు కాదు. సాధారణ రోజుల్లో అయితే ఓ అరవై, డెబ్బై మందికి ఇలా అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ‘‘ఒక్కో బండిలో ఆరేడొందలు.. వెయ్యి వరకు వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లు ఇచ్చారు. అసాధ్యం అని తెలిసినా టికెట్లు ఇస్తూ రైల్వేశాఖ జనాల్లో ఆశలు రెకెత్తిస్తోంది. ఆఖరిరోజు వరకు ఎదురుచూసినా రిజర్వేషన్‌ దొరకదు. రద్దు చేసుకుంటే సొమ్ములో కోత పడుతుంది. నిజంగా ఇదిదోపిడీయే’ అని ఓ నిపుణుడు పేర్కొన్నారు.

జవవరి 10, 11 తేదీల్లో రద్దీ

సరా, దీపావళికి టికెట్లు దొరకని వారు కనీసం సంక్రాంతికి వెళ్లాలని భావిస్తుంటారు. నాలుగు నెలల ముందుగా రైలు టికెట్లు తీసుకుందామనుకున్నా వారికి నిరాశే ఎదురవుతోంది. రైలు ప్రయాణంలో గరిష్ఠంగా 120 రోజుల ముందు రిజర్వేషన్‌ చేయించుకోవచ్చు. హైదరాబాద్‌ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో జనవరి 10, 11 తేదీల్లో రద్దీ భారీగా ఉంది. ఆ రెండురోజుల్లో దాదాపు ప్రధాన రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయిపోగా.. మెజార్టీ రైళ్లలో నిరీక్షణ జాబితా పరిమితి దాటిపోవడంతో ‘రిగ్రేట్‌’కు చేరింది. సెకెండ్‌ క్లాస్‌, థర్డ్‌ ఏసీ, సెకండ్‌ ఏసీలోనూ ‘రిగ్రేట్‌’ వస్తోంది. దక్షిణ మధ్య రైల్వే ‘రిగ్రేట్‌’ పరిమితిని భారీగా పెంచేసి దొడ్డిదారిన ఆదాయం దండుకుంటోందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ వైపు కష్టమే

హైదరాబాద్‌ నుంచి ఉభయ గోదావరి జిల్లాలకు, విశాఖపట్నం సహా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంక్రాంతికి కొన్ని లక్షలమంది తరలి వెళ్తుంటారు. దేశంలో అత్యంత రద్దీ మార్గం సికింద్రాబాద్‌-విశాఖపట్నం. అయినా అరకొర రైళ్లే. దసరా దగ్గరకొస్తున్న సమయంలో అరకొరగా ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వే సంక్రాంతిపై ఇంకా దృష్టి సారించనేలేదు. ఆ సమయంలో సాధారణంగా నడిపేవి కాక ప్రత్యేక రైళ్లు కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్‌-భువనేశ్వర్‌, కాచిగూడ-టాటానగర్‌ పరిమితంగా ప్రత్యేక రైళ్లున్నా విశాఖపట్నం రాకుండా దువ్వాడ మీదుగా నడిపిస్తుండటంతో ఉపయోగం లేదని ప్రయాణికులు అంటున్నారు.

స్లీపర్‌, ఏసీల్లోనూ రద్దీ రద్దీ..

ర్డ్‌ ఏసీ బోగీలతో నడిచే కోకనాడ ఎక్స్‌ప్రెస్‌లో జనవరి 10న 239 మంది నిరీక్షణ జాబితాలో ఉన్నారు.
10, 11 తేదీల్లో వివిధ రైళ్లలో వెయిటింగ్‌లిస్ట్‌ తీరు ఇది..
* గౌతమిలో స్లీపర్‌..  952, 953.. థర్డ్‌ ఏసీ 239..
* గోదావరి స్లీపర్‌.. 401, 623
* నాగావళి స్లీపర్‌ (11న) 661..థర్డ్‌ ఏసీ 177
* విశాఖ దురంతో (థర్డ్‌ ఏసీ) 250
* విశాఖ గరీబ్‌రథ్‌ (థర్డ్‌ ఏసీ) 1,054, 1,011

ఆర్టీసీలో సంగతేమిటి?

ర్టీసీ బస్సుల్లో గరిష్ఠంగా 5కి మించి వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లు ఇవ్వరు. అంటే మొత్తం రిజర్వేషన్‌ సీట్లలో వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లు 10 శాతం మాత్రమే. రైల్వేలో అయితే కొన్ని రైళ్లలో వెయిటింగ్‌ లిస్ట్‌ 100 శాతానికి చేరింది.

పరిష్కారం ఏమిటి?

రైళ్లలో నిరీక్షణ టికెట్లు కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యేక రైళ్లను ఇప్పుడే ప్రకటించాలని.. సాధారణ ప్రయాణికుల కోసం జన సాధారణ్‌ రైళ్లను పెద్దసంఖ్యలో నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

రిగ్రేట్‌కు చేరిన కొన్ని రైళ్లు

* ఫలక్‌నుమా
* విశాఖ
* గోదావరి
* గరీబ్‌రథ్‌
* గౌతమి
* నర్సాపూర్‌
* ఎల్‌టీటీ విశాఖ

రిజర్వేషన్ల లెక్క ఇది

రిష్ఠంగా 24 బోగీలు ఉండే రైల్లో 2 గార్డు బోగీలు తీసేస్తే ప్రయాణానికి మిగిలేది 22.
* స్లీపర్‌ 12-14
* థర్డ్‌ ఏసీ 3, సెకండ్‌ ఏసీ 3, జనరల్‌ 4
* రిజర్వేషన్‌ బోగీలు అన్నింట్లో ఉండే సీట్లు 1,100-1,200

టికెట్ల రద్దు భారమిలా..

రిజర్వేషన్‌ ఖరారుకాని వెయిటింగ్‌ లిస్ట్‌ ప్రయాణికులు టికెట్లు రద్దు చేసుకోవాల్సి వస్తుంది. క్యాన్సిలేషన్‌ ఛార్జీలు స్లీపర్‌ టికెట్లకు ఒక్కో ప్రయాణికుడికి రూ.60 వసూలు చేస్తారు. నలుగురు సభ్యుల కుటుంబం అయితే.. రూ. 240 నష్టపోయే పరిస్థితి.

ఏసీ టికెట్లు అయితే రూ.65

దే ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకుంటే ఈ నష్టం సర్వీస్‌ ఛార్జీల రూపంలో మరింత అధికం. ఒక్కో టికెట్‌పై ఏసీకి రూ. 40, నాన్‌ ఏసీ టికెట్లకు రూ. 20 సర్వీస్‌ ఛార్జీని నష్టపోవాల్సి ఉంటుంది.
* ఒక రైల్లో రిజర్వేషన్‌తో ప్రయాణ అవకాశం 1000-1200
* వెయిటింగ్‌ లిస్ట్‌ పేరుతో మరో వెయ్యికి పైగా టికెట్ల జారీ

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.