close

ప్ర‌త్యేక క‌థ‌నం

పాదచారి ప్రాణం.. గాలిలో దీపం

రాజధాని రహదార్లపై రెండున్నరేళ్లలో 900 మంది బలి
నివారణ చర్యలు తీసుకోవడంలో బల్దియా నిర్లక్ష్యం
ఆక్రమణలకు గురవుతున్న పాదబాటలు
చోద్యం చూస్తున్న పోలీసు శాఖ

నడుచుకుంటూ భాగ్యనగర రోడ్లపైకి వెళ్లినవారు క్షేమంగా ఇంటికి చేరుతారనే నమ్మకం పోయింది. పాదచారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయం భయంగా నడవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక రోడ్డు దాటడమంటే సాహసం చేయడమే. పాదబాటలు లేక...రోడ్డు దాటే వంతెనలు లేక నగరవాసి ప్రాణం గాలిలో దీపమైపోయింది. రెండున్నరేళ్లలో 900 మంది అర్ధాంతరంగా తనువు చాలించారు. ప్రకృతి విపత్తులు కాదు, అంటువ్యాధులు, అనారోగ్యాలు అంతకన్నా కాదు. కేవలం మానవ తప్పిదాల వల్ల ఇన్ని వందల కుటుంబాలు రోడ్డున పడాల్సిన దయనీయ పరిస్థితికి బాధ్యులెవరు?

పాదచారికి ప్రాణహాని

ఈ తల్లిని చూడండి. నాలుగేళ్లకే నూరేళ్లు నిండిన బిడ్డను చూసి ఎలా తల్లడిల్లుతుందో.ఈ అమ్మకు ఇంత కష్టం రావడానికి కారకులెవరు? రోడ్డు మీదికి వచ్చిన పాపానికి కారు ఢీకొని కన్నుమూసిన ఈ బాలుని పేరు సాయిచరణ్‌. వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం గొట్టిగ్రామానికి చెందిన రాజు, లక్ష్మి దంపతుల తనయుడు. మారాం చేసి శనివారం  తెలిసిన ఆటో డ్రైవర్‌తో తాండూరుకు వచ్చాడు. బహిర్భూమి కోసం ఆటో దిగిన ఈ బాలుడిని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో స్పృహ కోల్పోయాడు. ఆస్పత్రికి తరలించేసరికే కన్నుమూశాడు. నగర పరిధిలో కాకపోయినా రోడ్డు ప్రమాదాల విషాదాలకిది తాజా ఉదాహరణ.

-న్యూస్‌టుడే, తాండూరు, బషీరాబాద్‌.

ఉండ్రు నరసింహారావు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

రాజధాని హైదరాబాద్‌ రక్తమోడుతోంది. గత రెండున్నరేళ్లలో 900 మంది పాదచారులను వాహనదారులు బలి తీసుకున్నారు. నడవడానికి పాదబాటలు లేకపోవడంతో రోడ్ల మీదే నడుస్తున్న వందలాది మంది వాహనాలు ఢీకొని విగత జీవులుగా మారుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పును తీసుకురావాల్సిన హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తోంది.

ఎందుకీ పరిస్థితి!
* హైదరాబాద్‌ మహానగరంలో 9100 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి రోడ్డును ఆనుకుని ఒకవైపు పాదబాట ఉండాలి. కానీ నగరంలో ప్రస్తుతం 380 కిలో మీటర్ల మేరకే మాత్రమే పాదబాటలు ఉన్నాయి.వీటిలో 148 కిలో మీటర్ల మేరకు ఆక్రమణలో  ఉన్నాయి.
నగరంలో 345 జంక్షన్లు ఉన్నాయి. కనీసం 240 జంక్షన్లలో ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జీలు ఉండాలని అధికారులు చాలా కాలం కిందటే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 12 చోట్ల మాత్రమే ఈ వంతెనలు అందుబాటులో ఉన్నాయి.52 చోట్ల అత్యాధునిక వంతెనలు నిర్మించాలని బల్దియా, హెచ్‌ఎండీఏ రెండేళ్ల కిందట నిర్ణయించాయి. ఇప్పటివరకు రెండు మూడు చోట్ల మాత్రమే నిర్మాణాన్ని పూర్తి చేయగలిగారు. నిధుల కొరత వల్ల మిగిలిన పనులు మొదలు కాలేదు.
కొన్ని ముఖ్యమైన చోట్ల భూగర్భ సబ్‌వేల ఏర్పాటు విషయంలో కూడా అధికారులు విఫలమవుతున్నారు. కోఠిలో సబ్‌వే ఎందుకూ ఉపయోగపడటం లేదు. ఖైరతాబాద్‌ రైల్వే లైను కింద ఉన్న సబ్‌వేను ఇప్పటివరకు పాదచారుల కోసం తిరిగి తెరవలేదు.

రోడ్డు దాటే అవకాశం ఉందా?
మహానగరంలో 345 చోట్ల ట్రాఫిక్‌ సిగ్నళ్లు ఉన్నాయి. వీటిలో 10 శాతం  పనిచేయవు. రోడ్డును దాటేందుకు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జీలు లేని పరిస్థితుల్లో కనీసం విదేశాల్లో మాదిరే పెలికాన్‌ సిగ్నళ్లు (పాదచారుల కోసమే ప్రత్యేకంగా నిర్వహించే సిగ్నళ్లు) ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉండేది. మెహదీపట్నం, కూకట్‌పల్లి, ఉప్పల్‌ తదితర చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. చక్కగా ఉపయోగపడుతున్నాయి. కొత్తగా 48 చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ఇది ముందుకు వెళ్లలేదు. దీనికీ నిధుల కొరతే కారణమని బల్దియా అధికారులు అంటున్నారు.

పాదచారులు ఎలా బలవుతున్నారంటే...
హైదరాబాద్‌ నగరంలో సుమారు పది లక్షలమందికిపైగా కాలినడకన తిరుగుతున్నారు. వేగంగా వచ్చే వాహనదారులు పాదచారులను ఢీకొనడంతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి.
మహానగరంలోని చాలా రోడ్లలో వాహనాలు గంటకు 40 కి.మీ. వేగానికి మించి వెళ్లడానికి వీలులేదు. రద్దీ సమయాల్లో వేగం తక్కువగానే ఉంటున్నా రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు వేగం గంటకు 60కి.మీ నుంచి 80 కి.మీల పైనే ఉంటుంది. ఈ వేగమే అనేకమంది పాదచారులను బలితీసుకుంటోంది. రోడ్లను దాటే సమయంలో కూడా అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.

ప్రమాదాల నివారణకు ఏం చేయాలంటే...
కీలకమైన రెండువేల కిలో మీటర్ల రద్దీ రోడ్లలో పాదబాటలను నిర్మించడానికి బల్దియా తక్షణం కార్యాచరణను రూపొందించాలి. ప్రధానంగా ఖైరతాబాద్‌, నాగోలు లాంటి ప్రధాన జంక్షన్లలో పెలికాన్‌ సిగ్నళ్లను ఏర్పాటు చేయాలి.

ఇంగ్లండ్‌లో ఇలా...
ఇంగ్లండ్‌లో అగ్రాసనం పాదచారులకే. దాదాపు అన్ని జంక్షన్లలోనూ పెలికాన్‌ సిగ్నళ్లను ఏర్పాటు చేశారు. పాదచారి రోడ్డును దాటాలంటే తానే ఈ సిగ్నళ్ల దగ్గరకు వెళ్లి  ఎర్రబటన్‌ నొక్కితే చాలు ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోతాయి. ప్రధాన నగరంలో వాహనాలు ప్రయాణించాలంటే రద్దీ సమయాలను బట్టి కొంత ఛార్జీని పోలీసులకు చెల్లించాల్సి ఉంటుంది. ఛార్జీ అధికంగా ఉండడంతో  వాహనదారుల్లో తక్కువ మందే ప్రధాన నగరంలోకి ప్రవేశిస్తారు.

పాదబాటలపై దృష్టి పెట్టాం
హైదరాబాద్‌ నగరంలో గత ఏడాది కాలంలో 167 కిలో మీటర్ల పొడవున ఆక్రమణలు తొలగించాం. ఆక్రమణలు తొలగించిన స్థానంలో పాదబాటల నిర్మాణం వేగం పుంజుకోవలసి ఉంది. ఇప్పటివరకు 21 కిలో మీటర్ల మేర కొత్తగా పాదబాటలను నిర్మించాం. మిగిలిన రోడ్లపై కూడా ప్రధానంగా దృష్టిపెట్టాం.

-విశ్వజిత్‌ కంపాటి, డైరెక్టర్‌ విజిలెన్సు, ఎన్‌ఫోర్సుమెంట్‌ విభాగం, జీహెచ్‌ఎంసీ

చర్యలు తీసుకుంటున్నాం
పాదచారులు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా అవసరం ఉన్న చోట్ల పెలికాన్‌ సిగ్నళ్లను ఏర్పాటు చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ముఖ్యమైన ప్రాంతాల్లో బల్దియా అధికారులు ఫుట్‌ఓవర్‌ వంతెనలు కూడా నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. పాదబాటల ఆక్రమణల మీద కూడా దృష్టిపెడుతున్నాం.

- అనిల్‌ కుమార్‌, ట్రాఫిక్‌ విభాగం అదనపు సీపీ, హైదరాబాద్‌

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.