close

ప్ర‌త్యేక క‌థ‌నం

సర్‌లేరు మీకెవ్వరూ!

నదులకు ఆనకట్టలు, దేశ ఆర్థిక పరిపుష్టికి మూలస్తంభాలను వేశారాయన. బక్కపలచటి ఈ ఇంజినీరు భారతావని ప్రగతికి బలమైన పునాదులు నిర్మించారు. తన ఇంజినీరింగ్‌ మేధకు అద్భుత దార్శినికతను జోడించి బీడు భూములను బంగారు చేలుగా మార్చారు. ఇంజినీరుగా, దార్శనికుడిగా, నిపుణుడిగా, విద్యాప్రదాతగా, పారిశ్రామిక ప్రగతి చోదకుడిగా భారతావనిపై సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య వేసిన ముద్ర ఎన్నటికీ పదిలం. ఆదివారం ఆ మహనీయుడి జయంతి నేపథ్యంలో ఆయన ప్రతి ఆలోచన జాతి నిర్మాణంపైనే. నిబద్ధత, సమయపాలన, అంకితభావానికి ఆయన మారు పేరు. నేటి ఆధునిక భారతావనికి ఇంజినీరింగ్‌ పునాదులు వేసిన మహా మేధావి. మన ఆర్థిక వ్యవస్థలో రెండు కీలక అంశాలయిన ఆనకట్టలు, పరిశ్రమలకు ఊపిరులూదిన గొప్ప దార్శనికుడు. ఆయనే సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. నేడు ఆయన జయంతి.

ఈ రోజున దేశమంతా ఇంజినీర్స్‌డేను ఘనంగా నిర్వహించుకుంటోంది. నేటి బెంగళూరుకు సమీపంలో కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామం ముద్దనహళ్లిలో 1861 సెప్టెంబర్‌ 15న తెలుగు కుటుంబంలో విశ్వేశ్వరయ్య జన్మించారు. ఆయన పూర్వీకులు ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని మోక్షగుండం గ్రామం నుంచి కర్ణాటకకు వలస వెళ్లారు. ఆయన తండ్రి పేరు శ్రీనివాస శాస్త్రి, తల్లి వెంకటలక్ష్మమ్మ. విశ్వేశ్వరయ్య పుణెలోని కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌లో సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివి అత్యున్నతస్థానంలో నిలిచారు. 1962 ఏప్రిల్‌ 12న కన్నుమూశారు.

ఇంజినీర్‌గా ప్రస్థానం ప్రారంభం
ఇంజినీరింగ్‌ తర్వాత 1884లో విశ్వేశ్వరయ్యకు బొంబాయి ప్రభుత్వంలో ప్రజాపనుల విభాగంలో సహాయ ఇంజినీర్‌గా ఉద్యోగం లభించింది. ఇంజినీర్‌గా అలా మొదలైన విశ్వేశ్వరయ్య ప్రస్థానం ఏడు దశాబ్దాల పాటు కొనసాగింది. నీటి పరిరక్షణపై ఆయనకు అమితాసక్తి. అందుకు అనుగుణంగా ఆయన దేశవ్యాప్తంగా నీటి సరఫరా, మురుగునీటి పారుదల, సాగునీటి వ్యవస్థలకు రూపకల్పన చేశారు.  కొల్హాపుర్‌, ఇండోర్‌, గ్వాలియర్‌, భోపాల్‌, నాగ్‌పుర్‌, గోవా, రాజ్‌కోట్‌, భావ్‌నగర్‌, బరోడా, సాంగ్లీ, బిహార్‌, ఒడిశా, యెమన్‌లోని అనేక నీటిసరఫరా వ్యవస్థలకు డిజైన్‌ చేయడం కానీ సలహాదారుగా వ్యవహరించడం కానీ చేశారు.


 

హైదరాబాద్‌కు రక్షణ కవచం: భారీ వర్షాలతో హైదరాబాద్‌లోని మూసీ నదికి వరదలు వచ్చేవి. ఫలితంగా వేల మంది ప్రాణాలు కోల్పోయేవారు. 1908లో నిజాం నవాబు విజ్ఞప్తి మేరకు విశ్వేశ్వరయ్య ఇక్కడ డ్రైనేజీ, తాగునీటి సరఫరా వ్యవస్థలను డిజైన్‌ చేశారు. దీంతో ప్రమాదకర వరదల నుంచి హైదరాబాద్‌కు దాదాపుగా విముక్తి లభించింది. పుణేకు ప్రధాన నీటి వనరు అయిన ఖడక్‌వాస్లా రిజర్వాయర్‌కు ఆటోమేటిక్‌ గేట్లతో కూడిన ఒక వ్యవస్థను రూపొందించారు. మైసూరు వద్ద ఉన్న కృష్ణరాజ సాగర్‌ డ్యామ్‌లోనూ ఇలాంటి వ్యవస్థనే అమర్చారు. ఎడారిగా ఉన్న మాండ్య జిల్లా.. ఈ డ్యామ్‌ వల్ల  ధాన్యాగారంగా మారింది.

తిరుమల నుంచి తిరుపతి ఘాట్‌ రోడ్డు నిర్మాణానికి ప్లాన్‌ తయారుచేయడంలో విశ్వేశ్వరయ్య కీలక పాత్ర పోషించారు.

విద్యాప్రదాత
1912లో విశ్వేశ్వరయ్య మైసూర్‌ దివాన్‌గా ఎంపికయ్యారు. ఆ హోదాలో ఆయన 1912 నుంచి 1918 మధ్యకాలంలో అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో వాటి సంఖ్య 4,568 నుంచి 11,294కు పెరగడం విశేషం.

పారిశ్రామికీకరణ జరగకుంటే భారతదేశానికి మనుగడ లేదు.

- మోక్షగుండం విశ్వేశ్వరయ్య

వాణిజ్య సంస్థలు
విశ్వేశ్వరయ్యను ఆధునిక మైసూర్‌ రాష్ట్రాని (ప్రస్తుత కర్ణాటక)కి పితామహుడిగా పరిగణిస్తారు.
అనేక పరిశ్రమలు, వాణిజ్య, సాంస్కృతిక సంస్థల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. వాటిలో కొన్ని..
* మైసూర్‌ సోప్‌ ఫ్యాక్టరీ (మైసూర్‌ శాండిల్‌ ఉత్పత్తులు)
* మైసూర్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ వర్క్స్‌ (ప్రస్తుతం విశ్వేశ్వరయ్య ఐరన్‌ అండ్‌ స్టీల్‌ లిమిటెడ్‌)
* స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌, ః ద సెంచరీ క్లబ్‌
* మైసూర్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌
* కర్ణాటక సాహిత్య పరిషత్‌

 

వరించిన గౌరవాలు..
* బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి ‘నైట్‌ కమాండర్‌ ఆఫ్‌ ద ఆర్డర్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ ఎంపైర్‌’. అప్పటి నుంచి సర్‌ హోదా. ః 1955లో భారతరత్న.
* అనేక విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు.

పాత ఓడను ముంచి...  విశాఖ రేవును గట్టెక్కించి..
దేశంలోని అగ్రగామి ఓడరేవుల్లో ఒకటిగా విశాఖపట్నం పోర్ట్‌ నిలవడం వెనక మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆలోచన అత్యంత కీలకం. 1927-33 మధ్య ఈ రేవును నిర్మిస్తున్నప్పుడు అలల పోటు ఎక్కువగా ఉండేది. దీనిని తగ్గించడానికి అవసరమైన కాంక్రీటు అడ్డుకట్ట (బ్రేక్‌వాటర్స్‌) నిర్మాణ సాంకేతికత అప్పటికి ఇంకా అందుబాటులోకి రాలేదు. సమస్య తీవ్రత మోక్షగుండం దృష్టికి వెళ్లడంతో ఆయనొక సులభమైన పరిష్కారం చూపించారు. అదేంటంటే... పాతబడిన రెండు ఓడల నిండా బండరాళ్లు వేసి, సముద్ర తీరానికి చేరువగా వాటిని ముంచేయడమే..! అది ఎంచక్కా పనిచేసి కెరటాల ఉద్ధృతిని తగ్గించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు కాంక్రీటు దిమ్మలతో బ్రేక్‌ వాటర్స్‌ను నిర్మించడంతో సమస్య శాశ్వతంగా పరిష్కారమయింది.

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.