close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఆహ్లాదం వెంటే ఆపద

పాపికొండల యాత్రికుల భద్రత పట్టని ప్రభుత్వం
అక్కడక్కడ రక్షణ కేంద్రాలు ఏర్పాటుచేయాలి
గోవా, మయామీ బీచ్‌ల భద్రతాచర్యలు మార్గదర్శకం

ఈనాడు, అమరావతి- కుక్కునూరు, సీతానగరం, న్యూస్‌టుడే: పాపికొండల ప్రయాణం అత్యంత రమణీయం. ఓ జీవితకాల అనుభవం. అందుకే దేశవ్యాప్త పర్యాటకులు ఇక్కడికి తరలివస్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే పాపికొండల అందాలు చూడలేమన్న ప్రచారం జరగడంతో ఇటీవల ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది. పర్యాటక శాఖతో పాటు ప్రైవేటు బోటు ఆపరేటర్లు పాపికొండల యాత్రను నిర్వహిస్తున్నారు. రోజూ వేల సంఖ్యలో పర్యాటకులు వస్తున్నా భద్రత, రక్షణ చర్యలు చేపట్టడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. ఇది ప్రమాదాలకు దారితీస్తోంది. రెండు నెలలుగా గోదావరిలో వరద ఉద్ధృతంగా ఉన్నా బోట్లు నడపడం ప్రమాదాలకు కారణమవుతోంది.

అక్కడలా... ఇక్కడిలా..
విదేశాల్లోనూ, మన దేశంలోని కొన్ని ప్రఖ్యాత బీచ్‌ల్లో పక్కాగా భద్రతా ఏర్పాట్లున్నాయి. గోవాలో ప్రతి కిలోమీటరుకొక భద్రతా కేంద్రం ఉంటుంది. గజఈతగాళ్లు ఉంటారు. అందమైన బీచ్‌లకు నిలయమైన అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న మయామీ వద్ద ఎవరు ప్రమాదానికి గురైనా వెంటనే స్పందించే వ్యవస్థలున్నాయి. పాపికొండల యాత్రకు రోజూ కొన్ని వేల మంది వెళుతున్నా, ప్రమాదభరిత పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నా కనీస భద్రతా ఏర్పాట్లు లేవు. పాపికొండల యాత్రలో కొన్ని కిలోమీటర్లకు ఒకటో, ప్రమాదకర ప్రదేశాలకు సమీపంలోనే ప్రత్యేక భద్రతా శిబిరాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. వాటిలో ఈతగాళ్లు, బోట్లు, అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచితే ప్రాణ నష్టాలను తగ్గించే వీలుంటుంది.

అనుభూతులు మూటకట్టుకునేందుకు..
గోదావరిలో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు రాజమహేంద్రవరంతో పాటు మరిన్ని రేవులనుంచి బోట్లు బయల్దేరుతాయి. నీళ్లు పెద్దగా లేని రోజుల్లో పశ్చిమగోదావరి జిల్లాలోని సింగనపల్లి, తూర్పుగోదావరి జిల్లాలోని పోశమ్మగండి నుంచి మాత్రమే వెళతాయి. ఇదివరకు పోలవరం, పట్టిసీమ, అంగుళూరు, పురుషోత్తపట్నం వంటి ప్రాంతాలనుంచీ బోట్లు నడిపేవారు. పోలవరం కాఫర్‌డ్యాం నిర్మించాక ఆ రేవుల నుంచి నిలిపేశారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం వైపు నుంచి గుర్తింపు పొందిన బోట్లు 32, లాంచీలు 14 తిరుగుతుంటే అనధికారికంగా మరో ఎనిమిది నడుపుతున్నట్టు సమాచారం. పాపికొండల నుంచి భద్రాచలం వెళ్లేందుకు మరో 18 వరకు తిరుగుతున్నాయి.

ప్రభుత్వానికి ఆ మాత్రం పట్టదా?
* పాపికొండల యాత్రకు ఉభయగోదావరి జిల్లాల పరిధిలో ప్రస్తుతం రెండు మూడు రేవుల నుంచే బోట్లు, లాంచీలు బయల్దేరుతున్నాయి. వాటి ప్రమాణాలు, భద్రతా చర్యల పరిశీలన నామమాత్రమైంది.
* దేవీపట్నం మండలంలోని పోశమ్మగండి నుంచి పాపికొండల వరకు 62 కి.మీ.దూరం ఉంటుంది. ఈ మధ్యలో నది వడి, లోతు ఎక్కడ ఎక్కువ? వంటి అంశాలపై హెచ్చరికలు చేసేలా నదిలో తేలియాడే సూచీలు(బాయ్స్‌) ఏర్పాటు చేయవచ్చు. నదిలో ప్రతి సీజన్‌కు మార్గాలు మారిపోతాయి. కొన్ని చోట్ల కొత్తగా ఇసుక మేట వేస్తుంది. దీని ప్రకారం మార్గాలు నిర్ణయించుకోవాలి. ఎక్కడ ఎక్కువ మేటలున్నాయో తెలియజెప్పే సూచీలను నీటిపారుదల శాఖ ఏర్పాటుచేయాలి.
* పాపికొండల యాత్రకు వెళ్లే బోట్లు, లాంచీలన్నీ ప్రభుత్వమే నడిపేలా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత మర్చిపోయింది.
* ప్రైవేటు బోట్లలో కొన్ని సందర్భాల్లో ప్రయాణికుల వివరాలను సరిగా నమోదు చేయడం లేదు. ప్రమాదం జరిగినప్పుడు వాటిలో ఎవరున్నారో గుర్తించడం కష్టమవుతోంది.
* పాపికొండలకు వెళ్లిన బోట్లు, లాంచీలు చీకటి పడకముందే పోశమ్మగండికి చేరుకోవాలి. రాత్రి పదింటి తర్వాత కూడా బోట్లు తిరుగుతున్నాయి.
* పాపికొండల యాత్రలో కొంత దూరం వెళ్లాక సిగ్నల్స్‌ లేకపోవడం వల్ల చరవాణులు పనిచేయవు. ప్రమాదంలో చిక్కుకున్నవారు ఆ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియజేసే అవకాశం లేక సాయం అందని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆగస్టులో 31 మంది జాలర్లు ధవళేశ్వరం వెళుతూ పోలవరం కాఫర్‌డ్యాం వద్ద బోటు పాడై నదిలో చిక్కుకున్నారు. చరవాణి పనిచేయలేదు. ఒకరు కాఫర్‌డ్యామ్‌ మీదకు వెళితే సిగ్నల్స్‌ అందాక అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.