close

ప్ర‌త్యేక క‌థ‌నం

సవాలుగా అన్వేషణ

దేవీపట్నం, కచ్చులూరు నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధులు: అంతులేని ఆవేదనను మిగిల్చిన బోటు ప్రమాద ఘటనలో సహాయక చర్యలు కష్టతరంగా మారాయి. బోటు దాదాపు 315 అడుగుల లోతున ఉంటుందని అంచనా. దాని లోపల కొన్ని మృతదేహాలు ఉండొచ్చని భావిస్తున్నారు. వాటిని వెలికితీయాలంటే బోటు ఆచూకీని కనుక్కోవాలి. సోమవారం ఉదయం 10 గంటలకు నేవీ డైవర్లు ప్రమాద ప్రాంతానికి సరంజామాతో బయలుదేరి వెళ్లారు. ఘటనా స్థలంలో మొబైల్‌ ఫోన్లు పని చేయడం లేదు. బోటు మునిగిన ప్రాంతానికి 200 మీటర్ల దూరంలో చిన్న ఇసుక దిబ్బ ఉంది. పోలీసు కమ్యూనికేషన్స్‌ విభాగం అధికారులు ఇసుక దిబ్బపైన బోటును నిలిపి... దానిలో ఓ చిన్న కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేసేందుకు అవకాశాలు తక్కువ. చీకటి పడేలోపే సహాయక చర్యలు ముగించాల్సి వస్తోంది. సోమవారం సాయంత్రం వరకూ బోటు ఆచూకీ దొరకలేదు. బోటును గుర్తించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, నేవీ, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రాకపోవటానికి పలు అవరోధాలు అడ్డుపడుతున్నాయి.

అవరోధం-1: నది వెడల్పు తక్కువ
కచ్చులూరు సమీపంలో గోదావరి వెడల్పు తక్కువ. ఈ ప్రదేశంలోనే భారీ మలుపు ఉంది. ఎగువ నుంచి వచ్చే ప్రవాహం సుడులు తిరగడం వల్ల ఇక్కడ సుడిగుండం ఏర్పడింది. స్థానికులు ఈ ప్రాంతాన్ని ‘కచ్చులూరు మందం’గా పిలుస్తుంటారు. బోటు ఇక్కడే మునిగిపోయింది. సహాయ చర్యలు చేపట్టేందుకు వెళ్లే బోట్లు సుడిగుండం వల్ల ఎక్కువ సేపు స్థిరంగా ఉండలేక పోతున్నాయి.

అవరోధం-2: బురద నీరు
గోదావరికి వరద వస్తుండటంతో నీరంతా బురదగా, ఎరుపు రంగులో కనిపిస్తోంది. మునిగిన బోటు ఎక్కడ ఉందో గుర్తించేందుకు స్కూబా డైవర్లు నీటి లోపల 60 అడుగుల వరకూ వెళ్లగలిగారు. నీరంతా బురదగా ఉండటంతో ఏమీ కనిపించని పరిస్థితి. సోనార్‌ సాంకేతికతకు సంబంధించిన స్టార్‌ఫిష్‌ పరికరాన్ని నీటి లోపలికి పంపి, చూసినా అస్పష్టంగా కనిపిస్తోంది.

అవరోధం-3: లోతు ఎక్కువ
సహాయక బృందాలు సోనార్‌ వ్యవస్థ ద్వారా గరిష్ఠంగా 75 అడుగుల లోతు వరకే తెలుసుకోగలిగాయి. స్కూబా డైవర్లు 60 అడుగుల లోతుకే వెళ్లగలిగారు. 30-35 టన్నుల బరువున్న బోటును బయటకు లాగటమనేది ప్రధాన సమస్య.

అవరోధం-4: అధిక ప్రవాహ వేగం
కచ్చులూరు ప్రాంతం వద్ద గోదావరి ప్రవాహం వేగంగా ఉంది. పైన ప్రశాంతంగానే ఉన్నా... లోతున ఉద్ధృతంగా మారుతోంది. బోటును గుర్తించేందుకు వెళ్తున్న సిబ్బంది నీటి లోపల ఎక్కువ సమయం స్థిరంగా ఉండలేక పోతున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.