close

ప్ర‌త్యేక క‌థ‌నం

సామాన్యులే సాయుధులై

భారతదేశ చరిత్రలో మహోజ్వల ఘట్టం.. తెలంగాణ సాయుధ పోరాటం.
రాచరికం, భూస్వామ్య వ్యవస్థ, మతోన్మాదంపై ఏకకాలంలో సాగిన ఉమ్మడి సమరమది.
నిజాం నిరంకుశానికి.. భూస్వాముల అరాచకానికి, రజాకార్ల రాక్షసకాండకు వ్యతిరేకంగా జరిగిన ఉద్ధృత సాయుధ పోరాటమిది..
సామాన్యులే సాయుధులై చేసిన ప్రతిఘటన ఇది.
రైతులు ఎదిరించి.. విద్యార్థులు ఉద్యమించి.. మాతృమూర్తులు నడుం బిగించి.. అణచివేతపై పేదవాడు తన కోపాగ్నినే అంకుశంగా ఎక్కుపెట్టిన చిరస్మరణీయ యుద్ధమిది..
విమోచనా.. విలీనమా.. అనే మీమాంసలు, శషభిషలు ఎన్ని ఉన్నా మొత్తంగా చరిత్రలో ఇదో విలక్షణ పోరాటం.
సామాన్యులే ఇంతగా త్యాగాలు చేసిన అరుదైన ఉద్యమమని చరిత్రకారులు చెబుతారు.
అందుకే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భారతదేశ చరిత్రలో అపురూపమైన స్థానం దక్కించుకుంది.

భూమి కోసం.. భుక్తి కోసం.. విముక్తి కోసం.. సాగిన తెలంగాణ సాయుధ పోరాటం అత్యంత విలక్షణమైంది. ఇది నిజాం నిరంకుశ పాలనకు, వెట్టి చాకిరీకి, దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన సమరమే కాదు.. అణచివేతను సహించలేని ప్రజల సామూహిక తిరుగుబాటు. పీడితుల పట్ల సానుభూతితో పిడికిలి బిగించి పోరాడిన ఒక తరం చరిత్ర. బాల్యం నుంచే వేలమందిని ఉద్యమం వైపు  ఆకర్షితులను చేసిన మహత్తర పోరాటం. మహిళలు సైతం కొంగు బిగించి బందూకులు పట్టిన మహోజ్వల ఘట్టం. అనేక నిర్బంధాలు, దాడులు, దౌర్జన్యాలు, చిత్రహింసలను ఎదుర్కొని.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిజాం రాచరికానికి, భూస్వాముల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడి  ప్రపంచంలో ఎందరికో స్ఫూర్తినిచ్చిన ఉద్యమం.

ఈనాడు, హైదరాబాద్‌


సెప్టెంబరు 17..
కొన్నేళ్లుగా ఈ తేదీ చుట్టూ ఎంతో ఉద్వేగం.. ఎంతో వివాదం
1948 సెప్టెంబరు 17న నిజాం నవాబుకు చెందిన సైన్యం భారత సైన్యానికి లొంగిపోయింది. దీంతో భారత్‌ నడిబొడ్డున ఉన్న ఒక పెద్ద సంస్థానం చరిత్ర ముగిసింది. దేశంలో జమ్మూ-కశ్మీర్‌, నైజాం సంస్థానాలది ప్రత్యేక చరిత్ర. ఆ రెండింటికి సరితూగే సంస్థానాలు ఆనాడు లేవు. 550 పైచిలుకు ఉన్న సంస్థానాల్లో ఆ రెండే భారత్‌ నాయకత్వ పటిమను పరీక్షించాయి. 1947 ఆగస్టు 15 నాటికి భారత యూనియన్‌లో చేరకుండా విపరీత తాత్సారం చేసి తీవ్ర ఉత్కంఠను, ఉద్రిక్తతను సృష్టించినవి ఈ రెండే. పాకిస్థాన్‌ అనుకూల శక్తులు ఒకవైపు నుంచి జమ్మూ-కశ్మీర్‌ను ముట్టడిస్తూ రావటంతో ఆ సంస్థానం మహారాజు హరిసింగ్‌ 1947 అక్టోబర్‌ 27న భారత యూనియన్‌లో విలీనం చేయడానికి అంగీకరించారు. కశ్మీర్‌ మహారాజు లాగానే నిజాం కూడా చివరివరకూ స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నించాడు. అనివార్య పరిస్థితుల్లోనే ఇద్దరూ విలీనానికి అంగీకరించారు. 1948 సెప్టెంబరు 17కు ముందూ, వెనుక జరిగిన సంఘటనలను పరిశీలిస్తే ఇలాంటి ఎన్నో సంగతులు వెలుగులోకి వస్తాయి. ముఖ్యంగా ఈ రెండు సంస్థానాల విలీన ప్రక్రియలనూ, ఆ తర్వాతి పరిణామాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రముఖుల్లో వి.పి.మేనన్‌ ఒకరు. ఆనాటి దేశీయ వ్యవహారాల మంత్రిత్వశాఖలో సంస్థానాల వ్యవహారాలు ఆయన చేతి మీదుగానే జరిగాయి. సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ నేత్వత్వంలో ఆయన పనిచేశారు. పదవీ విరమణ అనంతరం పటేల్‌ కోరిక మేరకు సంస్థానాల విలీనంపై సమగ్ర సమాచారంతో ఒక పుస్తకం రాశారు. అందులో హైదరాబాద్‌ సంస్థానానికి కేటాయించినన్ని పేజీలు మరే సంస్థానానికి కేటాయించలేదు. నెహ్రూ, పటేల్‌లు హైదరాబాద్‌ సంస్థానానికి ఇచ్చిన ప్రాధాన్యం మరే సంస్థానికి ఇవ్వలేదని చెప్పుకోవచ్చు.

స్వతంత్రంగా ఉండటానికి చివరివరకూ ప్రయత్నించిన నిజాం నవాబు కారణంగా భారత సైన్యాలు చిన్నపాటి యుద్ధం చేయాల్సి వచ్చినా పటేల్‌ కానీ, నెహ్రూ కానీ నవాబుపై ఏ మాత్రం శత్రుత్వాన్ని ప్రదర్శించలేదు. తన సైన్యాలు లొంగిపోయాయని ప్రకటించిన తర్వాతా ఆయనతో చాలా గౌరవప్రదంగా వ్వవహరించారు. ఆయన్ను రాజప్రముఖుడిగా ప్రకటించారు. తన సొంత భూములను ప్రభుత్వపరం చేసినందుకు నష్టపరిహారంగా భారీ మొత్తాన్ని ఇచ్చారు. ఉదారంగా పెన్షన్‌ సైతం ఇచ్చారు. సొంత ఆస్తులను భారీగా కలిగి ఉండటానికి అనుమతిచ్చారు. నవాబుకే కాకుండా జాగీరుదార్లకు కూడా వారి వార్షికాదాయాన్ని లెక్కగట్టి సముచిత రీతిలో నష్టపరిహారం చెల్లించడం గమనార్హం. భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ ఫర్మానాను సైతం నవాబు విడుదల చేశారు. భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు అంటే 1950 జనవరి 26 వరకూ నిజాం విడుదల చేసిన ఫర్మానా ఆధారంగానే హైదరాబాద్‌ రాష్ట్రంలో పరిపాలన సాగింది. అంతెందుకు 1949 డిసెంబరు వరకూ మేజర్‌ జనరల్‌ చౌధురి ఆధ్వర్యంలో కొనసాగిన మిలిటరీ గవర్నర్‌కు విశేష అధికారాలిచ్చే ఫర్మానాను సైతం నవాబే విడుదల చేశారు. ఆ తర్వాత ఎం.కె.వెల్లోడిని ముఖ్యమంత్రిగా నియమించటం నైజాం చేతుల మీదుగానే సాగింది. నిజానికి వీరిద్దరి హయాంలోనే హైదరాబాద్‌ సంస్థానం పరిపాలనా రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. పరిపాలనా యంత్రాంగాన్ని గాడిలో పెట్టారు. పోలీసు, సైన్యం, పౌర ఉద్యోగాల్లో ముస్లింలకు ఆనాడు మితిమీరిన ప్రాధాన్యం ఉండేది. కొన్ని కీలక ఉద్యోగాల్లో 75 శాతం వరకూ వారే ఉండే వారు. ఖాసింరజ్వీ నాయకత్వాన రజాకార్లు పేట్రేగడం, దీనికి సమాంతరంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన రైతాంగ సాయుధ పోరాటంతో చాలా గ్రామాల్లో పరిపాలన స్తంభించిపోయింది. ఆ అస్తవ్యస్త స్థితిని సరిదిద్దటానికి.. ముస్లింల ఆధిపత్వాన్ని పాలనా యంత్రాంగలో తగ్గించటానికి మద్రాసు, బొంబాయి రాష్ట్రాల నుంచి ఉద్యోగులను తీసుకొచ్చారు. వారి ప్రవర్తన, ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగానే ‘ఇడ్లీ సాంబార్‌ గోబ్యాక్‌’ అనే నినాదం ఆనాడు మారుమోగింది.

అసలు వివాదం ఎందుకు మొదలైంది?
భారత రాజ్యాంగ పరిషత్తులో చేరేది లేదని నవాబు 1947 జూన్‌ 3న ఫర్మానా విడుదలచేయటంతో హైదరాబాద్‌ స్టేట్‌ భవిష్యత్తుపై సందిగ్ధతకు బీజాలు పడ్డాయి. ఆ తర్వాత  భారత్‌-పాక్‌ల్లో దేంట్లోనూ చేరబోరని ఆగస్టు 8న నిజాం చేసిన ప్రకటనతో తేటతెల్లమైంది. గవర్నర్‌ జనరల్‌గా ఉన్న మౌంట్‌బాటెన్‌ చాలా చెప్పిచూశారు. స్వతంత్రంగా ఉండటం అసాధ్యమని, చివరకు అన్ని అధికారాలు పోవటం ఖాయమని కూడా హెచ్చరించారు. ఫలితం కనపడలేదు. బ్రిటిష్‌ అధికారుల నేతృత్వంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపిద్దామని కూడా మౌంట్‌బాటెన్‌ ప్రతిపాదించారు. నైజాం ససేమిరా అన్నారు. సంస్థానాల్లో  ప్రజాభిప్రాయ సేకరణ అన్నది ఆనాటి కాంగ్రెస్‌ విధానంలో ఒక భాగం. సంస్థానాల్లో భిన్న మతాలకు చెందిన ప్రజలున్న చోట దీన్ని ఇంకా బలంగా నొక్కిచెప్పారు. కశ్మీర్‌లో కూడా ప్రజాభిప్రాయ సేకరణకు అందుకే అంగీకరించారు. హైదరాబాద్‌లో ప్రతిపాదన కూడా అందులో భాగమే. సర్దార్‌ పటేల్‌ వీటన్నిటికీ అంగీకరించారు. ఏ సంస్థానానికి ఇవ్వని కొన్ని కీలక మినహాయింపులు హైదరాబాద్‌కు ఇచ్చారు. నైజాం-భారత ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ఇందుకో ఉదాహరణ. విలీనానికి అంగీకరిస్తే బెరార్‌ ప్రాంతాన్ని హైదరాబాద్‌ సంస్థానంలో చేర్చే ప్రతిపాదనకు కూడా ఒక దశలో అంగీకరించారు. రజాకార్ల చేతుల్లో కీలుబొమ్మగా మారి యథాతథ ఒప్పందానికి తూట్లు పొడవటంతో భారత సైన్యం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా భారత్‌ కరెన్సీని సంస్థానంలో నిషేధించటం, ఖనిజాల ఎగుమతిపై ఆంక్షలు విధించటం, రైళ్లపై దాడులు, గ్రామాల్లో రజాకారుల దారుణాలతో పరిస్థితి విషమించింది. సెప్టెంబరు 9న సైన్యాన్ని పంపాలని నిర్ణయం తీసుకున్నారు. మూడువారాలపాటు నిజాం సైన్యాల నుంచి ప్రతిఘటన ఉంటుందని భావించారు. కానీ మూడోరోజు నుంచి ప్రతిఘటన కుప్పకూలింది. మేనన్‌ అంచనా ప్రకారం 800 మందికి పైగా చనిపోయారు. 108 గంటల్లోనే భారత సైన్యం అదుపులోకి పరిస్థితి వచ్చింది. మేనన్‌ హైదరాబాద్‌ వచ్చి స్వయంగా పరిస్థితిని అంచనా వేశారు.

నిజాంకు ముస్లింలలో ఉన్న పలుకుబడిని, ఒక సంస్థానంగా హైదరాబాదుకున్న ప్రతిష్ఠను దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగ అధిపతిగా నవాబుని కొనసాగిస్తే బాగుంటుదని పటేల్‌కు మేనన్‌ సూచించారు. నెహ్రూను సంప్రదించిన తర్వాతే ఏ సంగతి చెబుతానని పటేల్‌ అన్నారు. ఆ మరుసటి రోజే నెహ్రూ అంగీకారం తెలిపినట్లు పటేల్‌ మేనన్‌కు చెప్పారు. కక్ష సాధింపు దృష్టితో కానీ, మతపరమైన దృష్టితో కానీ నైజాం నవాబు పట్ల నెహ్రూ-పటేల్‌ ద్వయం వ్యవహరించలేదు. అందుకే నైజాం ఓటమిని ఒక వీరోచిత దినంగా జరుపుకుందామని ఆనాడు భావించలేదు. రజాకార్ల దౌర్జన్యాలకు ప్రతిగా కొన్నిచోట్ల అమాయక ముస్లింలపై కూడా దాడులు జరిగాయి. దేశ విభజన సృష్టించిన రక్తచరిత్ర ఇంకా ఆరిపోని ఆనాటి నేపథ్యంలో పెద్ద పార్టీలన్నీ సామరస్యాన్నే కోరుకున్నాయి. విలీనం తర్వాత గతం తాలూకూ పాతపగలు, ఆధిపత్యాలు, వీలైనంత మేరకు స్మృతిపథం నుంచి తొలగిపోవాలన్న ఆకాంక్ష సెప్టెంబరు 17కు అధికారికంగా పెద్ద ప్రాధాన్యం ఇవ్వకుండా చేశాయి.

చరిత్రలో జరిగిన ఒక సంఘటనను తర్వాతి తరాలు మునుపటి తరాల్లాగా చూడవు. సమకాలీన అవసరాలు, అంచనాలు చరిత్ర ఘటనలను చూసే తీరుని ప్రభావితం చేస్తాయి. సెప్టెంబరు 17ను విమోచనదినంగా అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్‌ ఈరకంగా వచ్చిందే. అలాగే ప్రత్యేక తెలంగాణ కోరిక బలపడి, రాష్ట్రం ఏర్పాటైన తర్వాత చరిత్రలో నైజాం పాత్రపై బలమైన కొత్త వ్యాఖ్యానాలు మొదలయ్యాయి. నూతన తెలంగాణంలో నైజాం పాత్రను కూడా నూతనంగానే చూడటం మొదలుపెట్టారు. ‘తరతరాల బూజు నిజాం రాజు’ అన్న వ్యాఖ్యలు క్రమేపీ కనుమరుగవుతున్నాయి.

-ఎన్‌.రాహుల్‌కుమార్‌

కీలక ఘట్టాలు ఇవి
1947 ఆగస్టు 15:   భారత్‌కు సంపూర్ణ స్వాతంత్య్రం
1947 నవంబరు 14:  నిజాం రాజుతో భారత ప్రభుత్వం యథాతథ స్థితి ఒడంబడిక
1948 సెప్టెంబరు 12:  హైదరాబాద్‌ సంస్థానాన్ని సైనిక చర్యతో భారతదేశంలో విలీనం చేయాలని కేంద్ర మంత్రిమండలి తీర్మానం
1948 సెప్టెంబరు 13:  నిజాం రాజ్యంపై పోలీసు చర్య పేరిట ముట్టడి
1948 సెప్టెంబరు 17:  భారతదేశంలో హైదరాబాద్‌ సంస్థానం విలీనం, 
సైనిక పాలన ప్రారంభం
1949 డిసెంబరు 1:    సైనికపాలన ముగింపు, హైదరాబాద్‌ రాష్ట్రం ఏర్పాటు
1950 జనవరి 26:    హైదరాబాద్‌ స్టేట్‌ తొలి సీఎంగా సీనియర్‌ సివిల్‌ సర్వెంట్‌ ఎం.కె.వెల్లోడి నియామకం

 

 

ఇలాంటి ఉద్యమం మరోటి లేదు
- ప్రముఖ ఆర్థికవేత్త, పద్మభూషణ్‌ సీహెచ్‌ హనుమంతరావు

ప్రపంచంలో ఎన్నో రైతాంగ పోరాటాలు జరిగినా తెలంగాణ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉందని.. రాజరికం నుంచి విముక్తి కోసం, రజాకార్ల హింస, రాజ్యం దౌర్జన్యాలకు వ్యతిరేకంగా భారతదేశంలో విలీనం కోసం.. రైతాంగం కోసం సాగిన పోరాటమదని ప్రముఖ ఆర్థికవేత్త, పద్మభూషణ్‌ సిహెచ్‌.హనుమంతరావు అన్నారు. ‘‘దేశ చరిత్రలో ఇంతగా త్యాగాలు చేసిన ఉద్యమం మరొకటి లేదు. రైతులు రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడటం అనేది అరుదైన ఘటన. వేలమంది చనిపోయారు. మొదటిగా నిజాం ప్రభుత్వం నుంచే హింస ప్రేరేపితమైంది. ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా రైతాంగం సాయుధ పోరాటానికి దిగింది. ఈ పోరాటానికి లౌకిక స్వభావం ఉంది. మతాలకు అతీతంగా నేతలు నిజాంపై పోరాడారు. ఇలాంటి చరిత్ర కలిగిన ఉద్యమానికి ఇప్పుడు మతం రంగు పులిమే ప్రయత్నం చేయడం, రాజకీయం చేయడం తగదు. విలీనమా? విమోచనా? అనే వివాదాలు ఈమధ్యనే వచ్చాయి. ఈ పోరాటం క్రెడిట్ అంతా ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్‌లదే. 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ విలీనం జరిగిన రోజు నాకు గుర్తుంది. ఆ రోజు భారతసైన్యం హైదరాబాద్‌లో సుల్తాన్‌ బజార్‌ వద్ద కవాతు చేయడాన్ని నేను చూశాను.

సామాన్యుల ఉమ్మడి పోరాటమది
- బూర్గుల నరసింగరావు

ఒకవైపు నిజాం రాచరిక వ్యవస్థ, ఇంకోవైపు భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పేద రైతాంగం, బీద జనం జరిపిన చరిత్రాత్మక సమరం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమని బూర్గుల నరసింగరావు అభిప్రాయపడ్డారు. ఆయన విద్యార్థిగా ఈ పోరాటంలో పాలుపంచుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ అమరవీరుల స్మారక కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నారు. ‘1942లో క్విట్‌ ఇండియా ఉద్యమం వచ్చింది. అప్పుడు నాకు పదేళ్లు. స్కూల్లో ఉన్నాను. వేరే విద్యార్థులు వచ్చి బాయ్‌కాట్‌ చేయించారు. అది నా మొదటి అనుభవం. పోలీసు లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం ఇవ్వన్నీ చూడడం అదే తొలిసారి. 1944 తర్వాత రైతాంగాన్ని చైతన్యవంతులను చేసే పోరాటం మొదలైంది. నిజాం రజాకార్లతో ఒక సైనాన్ని తయారు చేసి ఆయుధాలు భారీగా సమకూర్చుకుంటున్నా కేంద్రం చూస్తూ ఊరుకుంది. గ్రామాలను తగలబెట్టడం, మహిళలపై అత్యాచారాలు.. ఇలా అనేక అరాచకాలకు పాల్పడ్డారు. పరిస్థితులు తీవ్ర రూపం దాల్చడంతో 1947 సెప్టెంబరులో కమ్యూనిస్టులు సాయుధపోరాటానికి పిలుపునిచ్చారు. అటు సైన్యం, ఇటు రజాకార్లు రెండు వైపులా దాడి చేశారు. ఆత్మరక్షణకు పోరాడాల్సి వచ్చింది. దళాలకు ఆయుధాలు సరఫరా చేయడం నా జీవితంలో ముఖ్యమైనవి. తెలంగాణ సాయుధ పోరాట సమయానికి భాజపా లేదు, జన్‌సంఘ్‌ కూడా పుట్టలేదు. పటేల్‌ బదులు నెహ్రూనే చేసి ఉంటే తెలంగాణకు కూడా ఆర్టికల్‌ 370 ఉండేదని ఇటీవల రాంమాధవ్‌ అన్నారు. నిర్ణయం కేంద్ర కేబినెట్‌ది తప్ప పటేల్‌ది కాదు. ఇవన్నీ అబద్ధాలు ప్రచారం చేయడమే. తెలంగాణ సాయుధ పోరాటం ప్రత్యేక పరిస్థితుల నుంచి వచ్చింది. మొదట హైదరాబాద్‌ పోలీసులు, రజాకార్లతోనూ, ఆ తర్వాత భారత సైన్యంతోనూ పోరాడాల్సి వచ్చింది.

14 గంటల ముందు ఉరి ఆగింది
- గార్లపాటి రఘుపతిరెడ్డి


తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని ఉరికంబం వరకు వెళ్లిన పోరాట యోధుడు గార్లపాటి రఘుపతిరెడ్డి. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం రామానుజపురానికి చెందిన 92 ఏళ్ల రఘుపతిరెడ్డి నాటి అనుభవాలను ‘ఈనాడు’తో పంచుకున్నారు.
సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు నాయకులు కె.రామచంద్రారెడ్డి, కె.కృష్ణమూర్తి దళంలో చేరా. ఎన్నోసార్లు మృత్యువు నుంచి బయటపడ్డా. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించింది. భువనగిరిలో నన్ను అరెస్టు చేశారు. నాపై అకినేపల్లి హత్య కేసు ఉండటంతో ట్రైబ్యునల్‌ కోర్టులో నాతో పాటు 12 మందికి ఉరిశిక్ష పడింది. 1951 జనవరి 21 లేదా 22న ఉరి తీయాలని హైకోర్టు తీర్పుచెప్పింది. ముషీరాబాద్‌ జైల్లో గుండు గీయించి, కాళ్లకు అరదండాలు పెట్టారు. అప్పుడు ఇంగ్లాండుకు చెందిన న్యాయవాది డి.ఎన్‌.ప్రిట్ మా తరఫున వాదించడానికి వచ్చి భారత రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌ను కలిసి వివరించారు. రాష్ట్రపతి ఆయన వాదనలో వాస్తవాలు గమనించి ఉరిశిక్షలను యావజ్జీవశిక్షలుగా మార్చారు. ఓరోజున మేం భోజనాలు చేస్తున్నాం. అదే చివరి భోజనం అనుకున్నాం. ఇంతలో అధికారులు వచ్చి ఉరిశిక్షలు రద్దయ్యాయని చెప్పారు. ఉరి అమలుకు సరిగ్గా 14 గంటల ముందు అది రద్దయింది. తర్వాత 1956 వరకు యావజ్జీవ శిక్ష అనుభవించాం.

పాండవులగుట్టలో 50 తుపాకులు దాచి వచ్చా
- మల్లు స్వరాజ్యం

తెలంగాణ సాయుధ పోరాటంలో మేం పెత్తందారుల నుంచి 10,000 గ్రామాలకు విముక్తి కలిగించాం. భూస్వాముల నుంచి లక్షల ఎకరాల భూముల్ని పేదలకు పంచాం. అని నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు 88 సంవత్సరాల వీరనారి మల్లు స్వరాజ్యం. సూర్యాపేట జిల్లా కరివిరాళ్ల కొత్తగూడెంకు చెందిన మల్లు స్వరాజ్యం 1931లో జన్మించారు. 1947 నుంచి గెరిల్లా పోరాటాలతో నిజాం పోలీసులను, రజాకార్లను హడలెత్తించిన చరిత్ర ఆమెది. ‘‘వట్టి చేతులతో.. వడిసెలతో మేం మొదలుపెట్టిన పోరాటం రజాకార్లు, నిజాం పోలీసుల తుపాకుల ముందు నిలవలేదు. ఇలాగైతే గెలవలేమని 1947లో తుపాకి చేతపట్టా. ఆకునూరులో పెద్ద సమరమే జరిగింది. రజాకార్లు ఆడవాళ్లను ఎత్తుకెళ్లారు. గ్రామస్థుల్ని కాల్చిచంపారు. మా దళాలతో గ్రామగ్రామానా భూస్వాముల ఇళ్లు, క్యాంపులపై దాడులు చేశాం. మా తాత బంగళాలో పోలీసు క్యాంపు పెడితే.. ఆ ఇంటినే కూల్చేశాం. నా తలపై 10,000 బంగారు నాణేలు బహుమతిగా ప్రకటించారు. సైనిక చర్య జరగకపోయి ఉంటే మేమే నిజాంను తరిమికొట్టేవాళ్లం. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తుపాకులు వదిలేయమని నెహ్రూ ప్రభుత్వం కోరింది. అయినా భూస్వాములపై మా పోరాటం కొనసాగించాం. 1950లో నా సహచరులు 40 మందిని కాల్చి చంపారు. 1952లో దళం నుంచి జనంలోకి వచ్చా. మళ్లీ ఏదో ఒకరోజు తుపాకీ పట్టాల్సి వస్తుంది అనుకుని వరంగల్‌ జిల్లా పాండవులగుట్ట ప్రాంతంలో 50 తుపాకుల్ని దాచిపెట్టి వచ్చా. నేటి పరిస్థితులు చూస్తుంటే ఆనాడు మేం ప్రారంభించిన యుద్ధం ముగియలేదనిపిస్తోంది.’’

ఎన్నో అవమానాలు పడ్డాం
- బైరాన్‌పల్లి లచ్చమ్మ

రజాకార్ల రాక్షసత్వానికి సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని బైరాన్‌పల్లి బలిపీఠంగా మారింది. ఆనాటి అరాచకాలు, అకృత్యాల గురించి నాటి సమరయోధురాలు బైరాన్‌పల్లి లచ్చమ్మ వివరించారు. ‘‘రజాకార్ల దుర్మార్గాలు యథేచ్ఛగా సాగే సమయంలో నా వయసు 16 ఏళ్లు. వారు మహిళలను శారీరకంగా, మానసికంగా హింసించారు. వారిని ఎదిరించడానికి గ్రామ యువకులంతా రక్షణ దళంగా ఏర్పడ్డారు. అనేకసార్లు గ్రామంపై రజాకార్ల దండయాత్రలు విఫలం కావడంతో మూడోసారి 1948 ఆగస్టు 27 తెల్లవారుజామున పెద్దఎత్తున సైనిక దళంతో గ్రామంపై పడ్డారు. బురుజుపై ఉన్నవారిని, పొలాల్లో కనిపించిన వారిని చిన్నా, పెద్దా, మహిళలు అని చూడకుండా 96 మందిని పొట్టన పెట్టుకున్నారు. మహిళలను వివస్త్రలను చేయడంతో కొంతమంది అవమాన భారంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వ్యతిరేకంగా పోరాడిన, వీరమరణం పొందిన సమరయోధులను, వారి కుటుంబాలను ఏ ప్రభుత్వమూ గుర్తించడం లేదు. ఆదుకోవడంలేదు. నేను చనిపోయేలోగా అయినా పింఛను అందుతుందేమోనన్న చిన్న ఆశతో ఎదురుచూస్తున్నాను.’’

నిజాంతో ఒప్పందం చేసుకుంది  నాటి కేంద్ర ప్రభుత్వమే
- జైని మల్లయ్యగుప్త

భువనగిరి పట్టణంలోని వ్యాపారస్తుల కుటుంబానికి చెందిన వారు 93 ఏళ్ల మల్లయ్య గుప్త. యువకుడిగా ఉన్నప్పుడే నిజాంకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో పాల్గొని ఏడాది జైలు జీవితం.. ఆ తర్వాత కొన్నాళ్లు రహస్య జీవితం గడిపారు. ‘హైదరాబాద్‌ సంస్థానానికి సర్దార్‌ పటేల్‌ విముక్తి కల్పించారంటూ కొన్నాళ్లుగా కొందరు కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు. ఇది పెద్ద తప్పు. అదే నిజమైతే దేశానికి స్వాతంత్య్రం రాగానే హైదరాబాద్‌ సంస్థానంపై సైనికచర్య ఎందుకు జరపలేదు? ఆ సంస్థానంతో ‘యథాతథ స్ద్థితి’ ఒప్పందం చేసుకున్నది నాటి కేంద్ర ప్రభుత్వమే. ఆయుధం పట్టినవాళ్ల, ప్రాణాలు కోల్పోయిన వాళ్ల త్యాగాలను కొందరు తక్కువ చేసి చూపుతూ పటేల్‌ ఒక్కరికే ఖ్యాతి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.’’

 

 

 

 

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.