close

ప్ర‌త్యేక క‌థ‌నం

నేతిబీర వర్సిటీలు..!

రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో వైచిత్రి
బోధన సిబ్బంది ఖాళీలు 59 శాతానికి పైనే
ఏడేళ్లుగా నియామకాలు కరవు
ఈ అయిదేళ్లలోనే 30 శాతం మంది పదవీ విరమణ
ఉప కులపతుల ఊసే పట్టని తీరు
ఆచార్యుల పోస్టుల భర్తీ గాలికి

వివిధ రకాల కోర్సులతో విలసిల్లాల్సిన రాష్ట్ర విశ్వవిద్యాలయాలు  బోధకులు లేక బోరుమంటున్నాయి. పరిశోధనలకు పెద్దపీట వేస్తూ  పరుగులెత్తాల్సిన వర్సిటీలు ఆచార్యుల జాడలేక ఆగమాగం అవుతున్నాయి.

తెలంగాణలోని సంఖ్యాధిక వర్సిటీల్లో బోధకుల సంఖ్య కంటే ఖాళీలే ఎక్కువ ఉండటం దుస్థితికి అద్దం పడుతోంది. ఏళ్ల తరబడి ఆచార్యుల పోస్టులు భర్తీ కాకపోవటం, ఉన్నవారూ పదవీవిరమణ చేస్తోండటంతో ఖాళీల సంఖ్య చాంతాడులా పెరిగిపోతోంది. విద్యారంగంలో ప్రైవేట్‌ వర్సిటీలు జోరు పెంచుతున్న క్రమంలో, ప్రభుత్వ విశ్వ  విద్యాలయాలను   బలోపేతం చేయకుంటే వాటి మనుగడ కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏళ్ల తరబడి శీతకన్ను!

రాష్ట్ర ఏర్పాటు అనంతరం 11 విశ్వవిద్యాలయాల్లో 2766 పోస్టులు అవసరమని తేల్చారు. 2017 నవంబరులో తొలివిడతలో 1061 ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. జీవో వచ్చినా మార్గదర్శకాలు ఇవ్వడంలో విద్యాశాఖ నాన్చుడు ధోరణి అవలంబించింది. ఉపకులపతులు వేగంగా స్పందించలేదు. సుప్రీంకోర్టులో రోస్టర్‌పాయింట్లపై కేసు రావడంతో మరింత జాప్యమైంది. దానిపై 4నెలల క్రితం స్పష్టత వచ్చినా ఉపకులపతుల పదవీకాలం ముగిసింది. భర్తీకి ఇప్పుడు నోటిఫికేషన్లు ఇద్దామంటే శాశ్వత ఉపకులపతులు లేరు. 2017 జనవరిలో రాష్ట్ర వర్సిటీల్లో బోధన సిబ్బంది సంఖ్య 1249 ఉండగా తాజాగా అది 1026కు పడిపోవడం గమనార్హం.

తెలంగాణ విద్యాశాఖ పరిధిలో 11 విశ్వవిద్యాలయాలున్నాయి. వాటిల్లో బోధన సిబ్బంది వెయ్యిమంది.. ఖాళీలేమో 1600 దాటాయి. వాటి భర్తీకి కనీసం ఉపకులపతులు లేరు. రెగ్యులర్‌ ఉపకులపతి ఉన్నదల్లా  జేఎన్‌ఏఎఫ్‌ఏయూకే. మిగిలిన అన్నింటినీ నడిపిస్తున్నది ఐఏఎస్‌ అధికారులే. గత ఉపకులపతుల పదవీకాలం ముగిసి నెలలు గడుస్తున్నా.. కొత్తవారి కోసం నేటికీ అన్వేషణ కమిటీలను నియమించనేలేదు.

నాణ్యత, పరిశోధనకు దెబ్బ

* అర్హులైన ఆచార్యులు లేనందున విద్యాబోధనలో నాణ్యత దెబ్బతింటోంది. పీహెచ్‌డీ విద్యార్థుల సంఖ్య తగ్గి పరిశోధన కుంటుపడుతోంది.
* వర్సిటీల్లో ఒప్పంద అధ్యాపకులు 1153మంది ఉన్నా.. వారంతా పీహెచ్‌డీ గైడ్లుగా వ్యవహరించడం కుదరదు.
* న్యాక్‌ గ్రేడ్‌ పడిపోతోంది. ఏడాది క్రితం ఓయూకు అతికష్టం మీద న్యాక్‌ ఏ గ్రేడ్‌ దక్కింది. త్వరలో ఆచార్యుల భర్తీని చేపడతామన్న హామీతో అది చిక్కింది.

నియామకాలు నాస్తి.. పదవీ విరమణలే జాస్తి

* నియామకాలు లేక.. మరోవైపు పదవీ విరమణల వల్ల వర్సిటీలు ఖాళీ అవుతున్నాయి. నియామకాలు చేపట్టకుంటే మరో మూడేళ్లలో ఓయూ, కేయూలోనే 150మంది వరకు పదవీ విరమణ పొందుతారు.
* ఓయూలో 816 ఖాళీలుండగా 2014 జూన్‌ తర్వాత ఖాళీ అయినవే 220 వరకు ఉన్నాయి. 2012లో చివరిసారిగా ఖాళీలు భర్తీచేశారు.
* కాకతీయ వర్సిటీలో 263 ఖాళీలుండగా ఈ అయిదేళ్లలో 97మంది పదవీవిరమణ చెందారు.
* జేఎన్‌టీయూహెచ్‌లో ఈ రెండున్నరేళ్లలో 22మంది పదవీ విరమణ పొందారు. ఈ ఏడాదిలో మరో నలుగురు వెళ్లిపోనున్నారు. ఇక్కడ చివరిసారి నియామకాలు జరిపింది 2010లోనే.

న్యాక్‌ దక్కేది ఎన్నడో..?

ఆచార్యులు, మౌలిక వసతులు తగినంతగా లేనందున ఇప్పటికీ శాతవాహన, ఆర్‌జీయూకేటీ, జేఎన్‌ఏఎఫ్‌ఏయూలకు న్యాక్‌ గుర్తింపు రాలేదు. బాసర ఆర్జీకేటీయూలో శాశ్వత బోధన సిబ్బంది ఒక్కరూ లేరు. మరి న్యాక్‌ ఎలా సాధ్యమన్నదే ప్రశ్న.

విశ్వవిద్యాలయాల వారీగా ఖాళీలు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.