close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఆయగట్టుకు చేరేదెట్టా!

డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాలువల పనుల్లో జాప్యం
కొత్త ప్రాజెక్టుల పనులకే అధిక ప్రాధాన్యం!
ఈనాడు - హైదరాబాద్‌

ఏటా నీటిపారుదల శాఖ బడ్జెట్‌లో కొత్తగా సాగులోకి తెచ్చే ఆయకట్టు లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నా ఆచరణలో దానికి తగ్గట్లుగా పనులు జరగడం లేదు. ప్రధాన పనులు పూర్తయినా ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాలువల పనుల్లో జాప్యం జరుగుతోంది. గత బడ్జెట్‌లో లక్ష్యంగా పెట్టుకున్న ఆయకట్టులో సగం కూడా రాలేదు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నీటిపారుదల శాఖ నివేదిక ప్రకారం లక్ష్యం 6,54,786 ఎకరాలుగా నిర్దేశించుకున్నారు. ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లో శాసనసభలో ప్రవేశపెట్టిన భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నివేదిక ప్రకారం 2018-19లో 1,76,374 ఎకరాలు మాత్రమే కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చినట్లు వెల్లడైంది.

ప్రాజెక్టుల చరిత్రలోనే రికార్డు
2018-19వ ఆర్థిక సంవత్సరంలో సాగునీటి రంగానికి చేసిన ఖర్చు రూ. 31,332.67 కోట్లు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంత ఖర్చు చేయడం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలోనే ఓ చరిత్ర. ఇంత మొత్తం ఒక సంవత్సరంలో ఖర్చు చేయడం గతంలో ఎప్పుడూ, ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. పలు రాష్ట్రాలు చేసిన ఖర్చును కలిపినా ఇంత ఉండదు. కానీ అత్యధిక పనులు పూర్తయి ఓ కొలిక్కి వచ్చిన ప్రాజెక్టుల్లో ఆయకట్టుకు నీటిని సరఫరా చేయడంలో కీలకమైన డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాలువల పనుల్లో తీవ్రమైన జాప్యం జరుగుతుండటంతో కొత్త ఆయకట్టుకు నీరందడం లేదు.

కాళేశ్వరానికే రూ. 17,195 కోట్లు
2018-19లో అత్యధికంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోనే రూ. 17,195 కోట్లు ఖర్చుపెట్టగా, ఆ తర్వాత పాలమూరు-రంగారెడ్డిలో రూ. 2,707 కోట్లు, సీతారామ ఎత్తిపోతలలో రూ. 1,860 కోట్లు, వరద కాలువలో రూ. 1,600 కోట్లు, దేవాదులలో రూ. 1,270 కోట్లు, డిండి ఎత్తిపోతల పథకంలో రూ. 660 కోట్లు ఖర్చు చేశారు. ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ఈ ప్రాజెక్టుల పనులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తోంది. ఒక ప్రాజెక్టుపై (కాళేశ్వరం) ఒక ఏడాదిలో రూ. 17,195 కోట్లు ఖర్చు చేయడం కూడా ఇదే మొదటిసారి. అయితే ఆయకట్టు లక్ష్యంగా ఉన్న ప్రాజెక్టుల్లో మాత్రం దానికి తగ్గట్లుగా ఖర్చు చేయడంలేదు. ఎంఆర్‌పీ-ఎస్‌ఎల్‌బీసీ కింద 76,000 ఎకరాల ఆయకట్టును సాగులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుని రూ. 890 కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తే ఖర్చు చేసింది రూ. 500 కోట్లే. దేవాదులలో అత్యధికంగా 2.86 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా పెట్టుకుంటే నామమాత్రంగానే ఆయకట్టు వచ్చింది. ఈ ప్రాజెక్టు కింద రూ. 1,270 కోట్లు ఖర్చు చేసినా, మొదటి, రెండోదశలోని డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తికాకపోవడంతో లక్ష్యం నెరవేరలేదు. గత రెండు, మూడు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన అనేక ప్రాజెక్టుల్లో ఇదే పరిస్థితి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆయకట్టు లక్ష్యంగా పనులు పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.