close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఆయుధం పట్టని యోధుడు

  

ఆయుధ కావరాన్ని ఆత్మ బలంతో ఎదిరించటం...
మందబలాన్ని మౌన వ్రతంతో ఎదుర్కొనటం.. సాధ్యమేనా?

ఒకప్పుడైతే..
గాంధీ అనే అతి సాధారణంగా కనిపించే ఓ అసాధారణ వ్యక్తి ఈ భూమ్మీదకు రాకపోయి ఉంటే.. బహుశా, ఈ ప్రశ్నకు మనం సమాధానం చెప్పగలిగే వాళ్లం కాదేమో! కానీ ఒకే ఒక వ్యక్తి.. కొల్లాయితో నడుం బిగించి.. కడు సామాన్యుల నుంచే అసామాన్య శక్తిని రగిలించి.. అది సాధ్యమేనని నిరూపించి చూపారు! భారత స్వతంత్ర సంగ్రామాన్ని సరికొత్త బాట పట్టించారు.

సహాయం, సత్యం, అహింస.. వంటి సాధారణ మానవ భావాలకే సరికొత్త తాత్విక చింతనను, రాజకీయ విలువలను జోడించి.. వాటిని పదునైన సైద్ధాంతిక అస్త్రాలుగా మలిచారు. ప్రేమ, క్షమ వంటి మహోన్నత మానవ విలువల ప్రాశస్త్యాన్ని చాటిచెప్పారు. అందుకే బుద్ధుడు, మహావీరుడు, జీసస్‌ వంటి మహితాత్ముల తర్వాత మానవాళి మహాత్ముడి పేరునూ గుర్తు చేసుకుంటోంది.


మనందరిలాగే అతి సాధారణంగా పుట్టిన మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ.. మహాత్ముడిగా మారిన వైనం అపూర్వం. అదెలా సాధ్యమైంది? ఇన్నేళ్ల తర్వాతా నేటికీ.. మన సమాజాన్ని గాంధీజీ ఎలా ప్రభావితం చేస్తున్నారు?
ఈ ప్రశ్నలకు సమాధానాలను అన్వేషిస్తూ.. వివిధ రంగాల నిపుణులు, విశ్లేషకులు అందిస్తున్న సమగ్ర కథనం.

దారి చూపిన దీపధారి.

దక్షిణాఫ్రికాలో తన అంతశ్చేతనను తట్టి లేపిన ఓ అవమాన భారాన్నే ఆయుధంగా మలచుకుని.. వినూత్న పంథాలో ప్రయాణిస్తూ.. ఈ ప్రపంచానికి సరికొత్త సంగ్రామ రీతులను నేర్పిన ఆధునిక రుషి గాంధీజీ. అందుకు సహాయ నిరాకరణ, సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా.. వంటి కీలక ఘట్టాలే తార్కాణం. అవి కేవలం భారత చరిత్రలో కనిపించే సంగ్రామ ఘట్టాలే కాదు.. ఆధునిక మానవుడికి మహాత్ముడు అందించిన అపురూప అస్త్రాలు కూడా!!

రైలు తిప్పిన మలుపు


మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీని వాళ్ల అన్నయ్య లక్ష్మీదాస్‌ పట్టుబట్టి బారిస్టర్‌ చదువు కోసం ఇంగ్లండ్‌ పంపారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన గాంధీ భారత దేశంలో న్యాయవాదిగా అంతగా రాణించలేకపోతున్న సమయంలో దాదా అబ్దుల్లా అండ్‌ కంపెనీ భాగస్వామి అబ్దుల్‌ కరమ్‌చంద్‌ జవేరీ ఆయనను దక్షిణాఫ్రికాలో పనిచెయ్యడానికి తీసుకువెళ్లారు. 1893 జూన్‌ నెలలో కంపెనీ పని మీద ప్రిటోరియా వెళ్లేందుకు మొదటి తరగతి రైలు టికెట్‌ కొనుక్కుని స్టేషన్‌కు వెళ్లారు. అప్పటి తెల్లవారిలాగే తనూ సూటు, బూటు, ప్యాంటూ వేసుకున్నారు. కానీ నల్లవాడన్న ఏకైక కారణంతో ఒక టికెట్‌ కలెక్టర్‌.. పీటర్‌ మారిట్జ్‌బర్గ్‌ అనే స్టేషన్‌లో ఆయనను రైల్లోంచి కిందకు దింపేశారు. తాను మొదటి తరగతి టికెట్‌ కొన్నాననీ, తననెందుకు దింపుతున్నారని ఎంతగా వాదిస్తున్నా.. కిందకు తోసేసి సామాన్లు కూడా ప్లాట్‌ఫాం మీదకు విసిరేశారు. దక్షిణాఫ్రికాలో ఉండేవారికి ఇలాంటి అవమానాలు నిత్యకృత్యమే. కానీ ‘‘అది చలికాలం. పీటర్‌ మారిట్జ్‌బర్గ్‌ స్టేషన్‌ ఎత్తు మీదుండటంతో చలి మరీ ఎక్కువగా ఉంది. స్టేషన్‌లో దీపం కూడా లేదు. అర్ధరాత్రి ఏం చేయాలా అని ఆలోచించాను. నా హక్కుల కోసం పోరాడాలా? లేదా నోరు మూసుకుని భారతదేశం దారి పట్టాలా? ఇచ్చిన పని పూర్తిచెయ్యకుండా వెళ్తే అవమానమే కాదు.. పిరికితనం కూడా. ఇది మహారోగానికి బయటకు కనిపించే లక్షణం మాత్రమే. ఈ రోగం శరీర వర్ణానికి సంబంధించినది. సామర్థ్యం ఉంటే ఈ మహారోగాన్ని పెరికిపారేస్తాను. ఎన్ని కష్టాలు ఎదురైనా సహిస్తాను. వర్ణ విద్వేషానికి సంబంధించిన ఈ జాడ్యాన్ని తొలగించేందుకు నా చేతనైనంత కృషి చేస్తాను’’ అని ఆ చీకటి రాత్రే గాంధీజీ సంకల్పం చెప్పుకున్నారు. అదే ఈ ప్రపంచానికి కొత్త వెలుగుని తెచ్చింది. అలా వర్ణ వివక్షపై.. జాత్యహంకారంపై.. పరాయి పాలనపై పోరాటానికి బీజం పడింది. ప్రపంచ చరిత్రలో కొత్త పుటలు తెరుచుకున్నాయి!

సహాయ నిరాకరణోద్యమం


రౌలట్‌ చట్టంపై అసంతృప్తి మొదలైంది. జలియన్‌ వాలాబాగ్‌ ఉదంతం ఉద్వేగం కట్టలు తెంచుకునేలా చేసింది. స్వదేశీ నినాదంతో గాంధీజీ ప్రజా పోరాటానికి పదును పెడుతున్నారు. 1919లో ‘సహాయ నిరాకరణోద్యమాన్ని’ ఆరంభించారు. హింసకు తావు లేకుండా ప్రతిఘటించాలని పిలుపిచ్చారు. దేశమంతా పర్యటించారు. ఆయన పిలుపునకు ప్రభుత్వోద్యోగులు ఉద్యోగాల్ని, విద్యారులు పాఠశాలల్ని, న్యాయవాదులు కోర్టుల్ని, రాజకీయ నాయకులు కౌన్సిళ్లను బహిష్కరించారు. విదేశీ వస్త్రాలు వాడవాడలా దగ్ధమయ్యాయి. స్వదేశీ.. ఓ మహోద్యమంగా రూపుదిద్దుకుంది. దాదాపు 30 వేల మంది అరెస్టయ్యారు. ఈ ఉద్యమం బ్రిటీష్‌ పాలకులకు ల్ని మొట్టమొదటిసారిగా గడగడలాండించింది. అయితే ఈ ఉద్యమంలో ఓ అపశృతి దొర్లింది. 1922 ఫిబ్రవరి 5వ తేదీన గోరఖ్‌పూర్‌ జిల్లాలోని చౌరీ చౌరా ప్రాంతంలో ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఆగ్రహించిన ఉద్యమకారులు 22 మంది పోలీసుల్ని చంపేశారు. ఆందోళన హింసాత్మక రూపం దాలుస్తోందని గ్రహించిన గాంధీజీ 1922 ఫిబ్రవరి 11వ తేదీన ఉద్యమాన్ని ఆపేశారు. తద్వారా తాను అహింసను వీడేది లేదని మరోసారి చాటిచెప్పారు.

దండి సత్యాగ్రహం

ఉప్పుతో మహోద్యమాన్ని నిర్మించొచ్చని బ్రిటీష్‌ పాలకులే కాదు, ప్రపంచంలో ఎవరూ కల్లో కూడా ఊహించలేరు. దేశానికి మూడువైపులా ఉప్పు ఉన్నా.. ఏళ్లుగా ఉప్పు తయారు చేసుకుంటున్నా.. భారతీయులు ఆ పని చేయకూడదంటూ బ్రిటీష్‌ ప్రభుత్వం హుకుం జారీ చేయటం పెను ఉప్పెనకు కారణమైంది. ‘మా ఉప్పు మాకు ఇచ్చేయండి’ అనే నినాదంతో గాంధీజీ నాయకత్వంలో 1930 మార్చి 12వ తేదీన ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారు. అహ్మదాబాద్‌ సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర దాదాపు 354 కిలోమీటర్లు కొనసాగి గుజరాత్‌ తీరంలోని దండి వద్ద ఏప్రిల్‌ 6వ తేదీ ఉదయం ముగిసింది. అక్కడ గాంధీజీ పిడికెడు ఉప్పును చేతికి తీసుకుని.. ఉప్పు చట్టాల్ని ఉల్లంఘించారు. ఈ యాత్ర సాగినన్ని రోజులూ దేశమంతా ఊగిపోయింది. నలుచెరగులా వేలమంది ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. బ్రిటీష్‌ ప్రభుత్వం మొదట్లో దీనిని బలప్రయోగం ద్వారా ఆపాలని చూసింది. ఎన్ని అరెస్టులు జరిగినా ఉద్యమకారులు వెనుకంజ వేయలేదు. దాదాపు ఏడాది తర్వాత 1931 మార్చి 5న గాంధీ-ఇర్విన్‌ ఒడంబడిక కుదిరింది. బ్రిటీష్‌ ప్రభుత్వం ఉప్పుపై పన్ను తొలగించింది. తుపాకులు, సైనికులు చేయలేని పనిని గాంధీజీ నిశ్శబ్దంగా, నిరాడంబరంగా సాధించారు.

క్విట్‌ ఇండియా ఉద్యమం

బ్రిటీషు వాళ్లు దేశం విడిచి పోతారా? పోరా? అని గద్దిస్తూ.. గాంధీజీ ఆరంభించిన అతిపెద్ద ఉద్యమం ‘క్విట్‌ ఇండియా’. రెండో ప్రపంచ యుద్ధంలో సహకరిస్తాం, అందుకు ప్రతిగా బ్రిటీష్‌ ప్రభుత్వం స్వాతంత్య్రం ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు అడగాలనుకున్నారు. కానీ కాంగ్రెస్‌ నేతల్ని మాటమాత్రంగా సంప్రదించకుండా బ్రిటీష్‌ అధికారులు భారత్‌ను యుద్ధ రంగంలోకి దించారు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్‌, గాంధీజీ.. దీంతో 1942 ఆగస్టు 8న ‘క్విట్‌ ఇండియా’ అన్నారు. ‘కరేంగే యా మరేంగే’ అంటూ గాంధీజీ ఉద్యమానికి కొత్త ఊపిరులూదారు. దేశవ్యాప్తంగా ఉద్యమం ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచింది. క్విట్‌ ఇండియా అన్న రెండే రెండు పదాలు జాతి రక్తంలో కొత్త చలనం తెచ్చాయి. అలా లేచిన జన కెరటం.. 1947లో భరత మాత దాస్య శృంఖలాలను సంపూర్ణంగా ఛేదించి.. అర్థరాత్రి అద్భుత స్వతంత్ర ఫలాన్ని సాధించేంత వరకూ కూడా మళ్లీ వెనుదిరగలేదు!

 

 

 

 

దేశం ఓ వైపు స్వాతంత్య్ర సంబరాల్లో మునిగి తేలుతుంటే జాతిపిత మహాత్మాగాంధీ మాత్రం ఆ సమయంలో కలకత్తాలోని ఓ చిన్న బస్తీలో శిథిలావస్థలో ఉన్న ముస్లింల ఇంట్లో ఉన్నారు. దేశ విభజనను, ఆ సందర్భంగా చెలరేగిన మతఘర్షణలను ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఆ రోజు ఆయన ఉపవాసదీక్షలో ఉన్నారు. మౌనంగా ప్రార్ధన చేస్తూ.. దేశానికి సరికొత్త దిశానిర్దేశం చేశారు. మరి దాన్ని అందుకోవటంలో మనం ముందున్నామా? లేదా? అన్నదే మన దేశ భవితవ్యానికి కీలక విజయ పతాకమవుతుంది!!

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.