close

ప్ర‌త్యేక క‌థ‌నం

వారసత్వం.. వారితత్వం!

హరియాణాలో కుటుంబ రాజకీయాలు
నాటి ప్రభ నేడు సాధ్యమేనా!

ఎన్నికల వేడి రాజుకుంటున్న హరియాణాలో వారసత్వ రాజకీయాలది ఓ చరిత్ర. ముఖ్యమంత్రులుగాను, ఇతర ముఖ్య పదవుల్లోనూ పనిచేసిన ఎంతోమంది నేతల కుటుంబాలు దశాబ్దాల తరబడి ప్రధాన రాజకీయాల్లో కీలకంగా నిలిచాయి. వీటిలో ముగ్గురు ‘లాల్‌’ల కుటుంబాలదే పెద్దపీట. 1966లో హరియాణా రాష్ట్రం ఏర్పడగా బన్సీలాల్‌, దేవీలాల్‌, భజన్‌లాల్‌లు ఎక్కువ కాలం ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఒకప్పుడు రాజకీయాల్లో వెలుగు వెలిగిన ఈ కుటుంబాలు.. భాజపా హవా పెరగడం తదితర పరిణామాల క్రమంలో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఉనికి కోసం పోరాడుతున్నాయి. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భజన్‌లాల్‌ మనవడు భవ్య బిష్ణోయి, బన్సీలాల్‌ మనవరాలు శృతి చౌధరీ సహా పలువురు భాజపాతో తలపడి ఓటమి పాలయ్యారు. మోదీ ప్రభంజనం ఉన్నప్పటికీ 2014లో 2 లోక్‌సభ స్థానాలను సాధించిన దేవీలాల్‌ స్థాపించిన ఐఎన్‌ఎల్‌డీ ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానాన్ని కూడా సాధించలేక పోయింది.

బన్సీలాల్‌
హరియాణాకు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన బన్సీలాల్‌ ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితులు. ఆయన ఇద్దరు కుమారులు సురేంద్రసింగ్‌, రణ్‌బీర్‌ సింగ్‌లు కూడా రాజకీయాల్లో ఉన్నారు. సురేంద్రసింగ్‌ మరణానంతరం ఆయన భార్య, ఎమ్మెల్యే కిరణ్‌ చౌధరీ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆమె కుమార్తె శృతి చౌధరీ ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో భాజపా చేతిలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ నుంచి 1991లో విడిపోయిన బన్సీలాల్‌ హరియాణా వికాస్‌ పార్టీ పేరిట సొంత పార్టీ పెట్టారు. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో 33 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించగా.. భాజపా మద్దతుతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. తిరిగి 2004లో బన్సీలాల్‌ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అనంతరం రెండేళ్లకు ఆయన కన్నుమూశారు.

దేవీలాల్‌
హరియాణా రాజకీయాల్లో దేవీలాల్‌ (చౌతాలా వంశం)ది ప్రత్యేక ముద్ర. రాష్ట్రంలో ఆయనదే అతిపెద్ద రాజకీయ కుటుంబంగా చెబుతారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన దేవీలాల్‌ అనంతరం దేశ ఉప ప్రధానిగా కూడా చేశారు. గతంలో ఆయన లోక్‌దళ్‌ పార్టీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. అప్పట్లో ఆ పార్టీ ఏకంగా 85 స్థానాల్లో (90కి గాను) విజయం సాధించింది. అనంతరం ఆ పార్టీ నుంచి ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్‌డీ) ఉద్భవించింది. 1999లో ఐఎన్‌ఎల్‌డీ విజయం సాధించగా దేవీలాల్‌ కుమారుడు ఓపీ చౌతాలా ముఖ్యమంత్రి అయ్యారు. 2001లో దేవీలాల్‌ కన్నుమూశారు. 2014 ఎన్నికల్లో ఐఎన్‌ఎల్‌డీకి 19 స్థానాలు దక్కగా అనంతరం కుటుంబ కలహాల నేపథ్యంలో ఓపీ చౌతాలా పెద్ద కుమారుడు అజయ్‌ చౌతాలా విడిపోయి తన కుమారులతో కలిసి వేరుగా జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) పెట్టారు. ఇలా ఐఎన్‌ఎల్‌డీ సంక్షోభంలో కూరుకుపోయింది. 19 మంది ఎమ్మెల్యేలకు గాను.. నలుగురు జేజేపీలోకి వెళ్లిపోగా, మరో 10 మంది భాజపాలో చేరారు. తాజా ఎన్నికల్లో ఆ కుటుంబం పట్టు నిలబెట్టుకోవడం అంత సులభమేమీ కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఐఎన్‌ఎల్‌డీ అభ్యర్థులంతా డిపాజిట్లు కోల్పోయారు.

భజన్‌ లాల్‌
హరియాణాకు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన భజన్‌ లాల్‌ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయన కుమారుడు కుల్‌దీప్‌ బిష్ణోయి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. 2001లో భజన్‌లాల్‌ కన్నుమూసిన తర్వాత ఆ కుటుంబం రాజకీయాల్లో బలహీనపడుతూ వచ్చింది. కుల్‌దీప్‌ హరియాణా జన్‌హిత్‌ కాంగ్రెస్‌ను స్థాపించి రాజకీయాలు నడిపారు. అనంతరం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కుల్‌దీప్‌ కుమారుడు భవ్య బిష్ణోయి 2019లో కాంగ్రెస్‌ తరఫున లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగి భాజపా అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.

వారసులు.. నేతలు

భూపీందర్‌ సింగ్‌ హుడా
రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన కీలక కాంగ్రెస్‌ నేత భూపీందర్‌ సింగ్‌ హుడా స్వాతంత్య్ర సమరయోధుడు రణ్‌బీర్‌ సింగ్‌ హుడా కుమారుడు. నాటి ఉమ్మడి పంజాబ్‌ రాష్ట్రంలో రణ్‌బీర్‌ మంత్రిగా పనిచేశారు. ఆ కుటుంబ రాజకీయ వారసత్వాన్ని భూపీందర్‌తో పాటు, ఆయన కుమారుడు దీపేందర్‌ హుడా కొనసాగిస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తండ్రీ కుమారులిద్దరూ ఓటమి పాలవడమే కాకుండా తమకు గట్టి పట్టున్న రోహ్‌తక్‌ స్థానాన్ని కూడా కోల్పోయారు.
రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌
స్వాతంత్య్రానికి ముందు యునైటెడ్‌ పంజాబ్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా చాలాసార్లు పనిచేసిన రావ్‌ దల్బీర్‌ సంగ్‌ మనుమడు ప్రస్తుత కేంద్ర మంత్రి, ఎంపీ రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌. ఆయన తండ్రి రావ్‌ వీరేంద్ర సింగ్‌ హరియాణా రెండో ముఖ్యమంత్రిగా చేశారు. అనంతరం రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలని ఇంద్రజిత్‌ విఫలయత్నాలు చేశారు. తన వారసత్వాన్ని కుమార్తె ఆర్తీ రావ్‌కు అప్పగించే యోచనలో ఆమె కోసం భాజపా టికెట్‌ ఆశిస్తున్నారు. అయితే ఎంపీలు, మంత్రుల కుటుంబీకులకు టికెట్లు ఇవ్వడానికి భాజపా సుముఖంగా లేకపోవడంతో అది ఎంతమేర సాధ్యమో చూడాలి.
రణ్‌దీప్‌ సుర్జేవాలా
హరియాణాలో 5 సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా చేసిన షంషేర్‌ సింగ్‌ సుర్జేవాలా కుమారుడు రణ్‌దీప్‌ సుర్జేవాలా. కాంగ్రెస్‌ పార్టీలో కీలకంగా ఉన్న ఆయన జాతీయ రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కావాలని భావిస్తున్నారు. అయితే ఇటీవల జింద్‌ ఉప ఎన్నికలో ఓడిపోయిన ఆయన రాష్ట్రంలో పట్టు సాధించగలగడం ఎంతమేర సాధ్యమో చూడాలి. కాంగ్రెస్‌ రాష్ట్ర విభాగం అధ్యక్షురాలు కుమారి సెల్జా తండ్రి దల్బీర్‌ సింగ్‌ నాలుగు సార్లు ఎంపీగా చేశారు.

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.