close

ప్ర‌త్యేక క‌థ‌నం

ప్రత్యేక రైలు కష్టాలు

అదనపు ఛార్జీలతో టికెట్‌ కొని అవస్థల ప్రయాణం
బండి బయల్దేరడం నుంచి అడుగడుగునా ఆలస్యమే
ఆహారం దొరకదు, గమ్యం ఎప్పుడు చేరేదీ తెలియదు
ఈనాడు, హైదరాబాద్‌:

హోటల్‌కు వెళ్లినప్పుడు రుచికరమైన భోజనం కావాలనుకుంటే ‘స్పెషల్‌’ అంటూ ఆర్డర్‌ ఇస్తాం. అదనంగా మరికొంత తీసుకుని ప్రత్యేక వంటకాన్ని అందిస్తారు. ఆసుపత్రికి చికిత్సకు వెళ్లినప్పుడు జనరల్‌ వార్డు, షేరింగ్‌ గది వద్దనుకుంటే అదనంగా ఛార్జి తీసుకుని ప్రత్యేకగది ఇస్తారు. ‘ప్రత్యేక’ రైళ్ల విషయంలో రైల్వే శాఖ తీరు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటోంది. ముక్కుపిండి అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్న రైల్వేశాఖ ప్రయాణికుల్ని పట్టించుకోవడం లేదు. ఎక్కాల్సిన రైలు ఎప్పుడొస్తుందో..?, ఆ తర్వాత అది కదిలేందుకు ఎంత సమయం పడుతుందో..? చెప్పే వారుండరు. ఒకవేళ ప్రయాణం ప్రారంభమైనా దారి మధ్యలో ఆపితే మళ్లీ ఎప్పుడు కదులుతుందో తెలియదు. రద్దీ రోజులు, పండుగల ప్రత్యేకం పేరుతో నడుపుతున్న రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా వెళ్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రœహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

అవసరం.. మరో దారి లేక
హైదరాబాద్‌లో బీడీఎస్‌ కోర్సు చేస్తున్న యువతీయువకులు దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు రైలు టికెట్లకు ప్రయత్నించారు. దొరక్కపోవడంతో అధిక ఛార్జీలతో మంగళవారం ప్రయాణానికి సికింద్రాబాద్‌-కాకినాడ (నెం.07003) ప్రత్యేకరైలుకు టికెట్లు తీసుకున్నారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని గంట ముందే స్టేషన్‌కు చేరుకున్నారు. చివరి నిమిషం వరకు ఆ బండి ఏ ప్లాట్‌ఫారంపైకి వస్తుందో సమాచారం లేదు. 3 గంటలు ఆలస్యంగా బండి రావడంతో హమ్మయ్య అనుకుంటూ వెళ్లి బండెక్కారు. కానీ ఆ కష్టాలు అక్కడితో ఆగలేదు. మంగళవారం రాత్రి 8.45కు బయలుదేరాల్సిన ఈ రైలు ప్లాట్‌ఫారంపైకి 11.45కి వచ్చింది. బయల్దేరింది మాత్రం మరో రెండు గంటల అనంతరం. బుధవారం ఉదయం 6.05కు రాజమహేంద్రవరం చేరుకోవాల్సి ఉండగా 8 గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంది.

ఎన్నెన్ని ఇబ్బందులో...
అయిదు గంటలు ఆలస్యంగా బయల్దేరిన సికింద్రాబాద్‌-కాకినాడ ప్రత్యేక రైలును దారి మధ్యలో ఎక్కడపడితే అక్కడ ఆపడంతో ప్రయాణికుల కష్టాలు రెట్టింపయ్యాయి. ఉదయం దిగాల్సిన వాళ్లు మధ్యాహ్నం వరకు రైల్లోనే ఉండాల్సి వచ్చింది. రెగ్యులర్‌ రైళ్లలో మాదిరిగా ఈ రైళ్లలో ప్యాంట్రీకార్‌ ఉండకపోవడంతో అల్పాహారం, భోజనం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఛార్జింగ్‌ పాయింట్లు పనిచేయకపోవడంతో ఫోన్లలో ఛార్జింగ్‌ అయిపోయిన వారి బాధలు సరేసరి. బోగీల్లో నీళ్లు అయిపోవడంతో నరకం అనుభవించామంటూ పలువురు ప్రయాణికులు ఈనాడుతో పేర్కొన్నారు. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారి బాధలు వర్ణణాతీతమని వారు తెలిపారు. ఇదొక్కటే కాదు.. దాదాపు అన్ని ప్రత్యేక రైళ్లలో ఇవే కష్టాలుంటున్నాయి.

ఆలస్యానికి కారణాలు
బండి బయల్దేరే ముందు యార్డులో దాన్ని శుభ్రం చేయడంతోపాటు బోగీ లోపలి భాగంలో కరెంటు సరఫరా,  రైలు కిందిభాగంలో చక్రాలు, బ్రేక్‌షూలను తనిఖీ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక రైళ్లకు ఈ నిర్వహణ ఎప్పుడో ఓసారి ఉంటున్నందున యార్డులో వీటికి నిర్ణీత టైంస్లాట్‌ ఉండదు. రెగ్యులర్‌ రైళ్ల నిర్వహణ తర్వాత వీటిని అనుమతించడం, ఈ రైళ్లను గూడ్సు ఇంజిన్లతో నడిపించడం, పైగా ఆ దారిలో ఏ రైలువచ్చినా, గూడ్సు బండి వచ్చినా వీటిని నిలిపి వేస్తుండడం ఆలస్యానికి కారణమవుతున్నాయి.

పరిష్కారం ఏంటి?
చాలా రూట్లలో ప్రత్యేకరైళ్లను ఏళ్ల తరబడి నడిపిస్తున్నారు. దీర్ఘకాలం నడిపిస్తున్నారంటే ప్రయాణికుల నుంచి డిమాండ్‌ ఉందనే లెక్క. రైల్వేశాఖ మాత్రం ఆదాయధోరణితో చూస్తోందన్న విమర్శలున్నాయి. రెగ్యులర్‌ రైళ్లుగా మార్చడం ఉత్తమ పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.