close

ప్ర‌త్యేక క‌థ‌నం

బాపూజీకి మోదీ అక్షరనీరాజనం!

చిటికెడు ఉప్పుతో మహోద్యమానికి శ్రీకారం మరెవరికి సాధ్యం?
రాట్నాన్ని ఆర్థిక స్వావలంబన చిహ్నంగా మలచడం ఇంకెవరి తరం?
‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ఆప్‌-ఎడ్‌లో గాంధీజీకి ప్రధాని ఘన నివాళి

‘‘అమెరికాలో పౌరహక్కుల ఉద్యమ సారథి మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ను భారత్‌ వచ్చేలా చేసిన స్ఫూర్తిప్రదాత మన మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ...మహాత్ముడు, ఉదాత్త చరితుడు. మానవసమాజంలో ఉన్న కొన్ని అంతరాలకు మధ్య వారధిగా మారడం ఆయనకే చెల్లు. ‘జాతీయతావాది కాకుండానే అంతర్జాతీయతావాది అవడం ఎవరికైనా  అసంభవం. ఆయా దేశాల ప్రజలు ఎక్కడికక్కడ ఒక్కతాటిపైకి వచ్చి ఒకేవ్యక్తి రూపం ధరించి స్పందించగలిగి జాతీయతావాదం సాక్షాత్కరించినపుడే స్థూలంగా అంతర్జాతీయతా వాదం సుసాధ్యం’ అని గాంధీ చేసిన ఉద్ఘాటన ప్రస్తావనార్హం.

న్యూయార్క్‌: ‘‘ప్రపంచం మీకు శిరస్సు వంచి నమస్కరిస్తోంది ప్రియతమ బాపూ!’’....అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత జాతిపితకు అక్షర నీరాజనం సమర్పించారు. ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ‘ఆప్‌-ఎడ్‌’ (సంపాదకీయం పేజీకి ఎదురుగా ఉండే పుట. అభిప్రాయ వ్యక్తీకరణ వేదిక)లో రాసిన వ్యాసంలో మహాత్ముడిపై మోదీ తన గౌరవాన్ని మనసారా ఆవిష్కరించారు. ‘భారతావనికి, ప్రపంచానికీ గాంధీజీ ఎందుకు అవసరమో’ అనే శీర్షికతో ఈ వ్యాసం ప్రచురితమయ్యింది. మహాత్ముడు ఆచరించి చూపిన ఆదర్శాలను ఇందులో మోదీ ప్రస్తావించారు. ‘ఇతర దేశాలకైతే నేను ఓ పర్యాటకుడిలా వెళ్లవచ్చునేమో. అదే భారతదేశానికైతే మాత్రం ఓ తీర్థయాత్రికుడిలా వచ్చాను’ అంటూ 1959లో భారత్‌కు చేరుకున్న మార్టిన్‌ లూథర్‌కింగ్‌ జూనియర్‌  చేసిన వ్యాఖ్యలతో మోదీ తన వ్యాసాన్ని ప్రారంభించారు.

‘‘అహింసా మార్గంలో గాంధీ చేసిన ప్రతిఘటన పలు ఆఫ్రికాదేశాల్లో ఆశాజ్యోతిని జ్వలింప చేసింది. గాంధీజీని పవిత్ర యోధుడిగా నెల్సన్‌మండేలా అభివర్ణించేవారు. మండేలా విషయానికి వస్తే గాంధీజీ అంటే భారతీయుడే కాదు. దక్షిణాఫ్రికన్‌ కూడా. మహాశాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ నాడు గాంధీజీ గురించి చేసిన ఉద్ఘాటనలను నేడు నేను మహాత్ముడికి నివాళిగా ప్రస్తావిస్తున్నాను. ‘ఈ ధరిత్రిపై రక్తమాంసాలతో ఇలాంటి ఓ వ్యక్తి నడయాడాడా? అని రాబోయే తరాలు అబ్బురపడతాయన్న’ ఐన్‌స్టీన్‌ మాటలు అక్షరసత్యాలు.

1917లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో భారీ ఎత్తున వస్త్రరంగంలో సమ్మె జరిగింది. మిల్లుకార్మికులు, యజమానుల మధ్య వివాదం తలెత్తినపుడు గాంధీజీ మధ్యవర్తిత్వంతోనే అది సమసిపోయింది. ‘మహాజన్‌’ అనే మాట కేవలం కులీనులు, ప్రముఖులను సగౌరవంగా పేర్కొనడానికి ఉపయోగించేరోజుల్లో సాధారణ కూలీలు, పనివారిని కూడా ‘మహాజన్‌’ అని సంబోధించడానికి కారణం గాంధీజీయే. కార్మికుల హక్కుల పరిరక్షణకోసం ‘మజూర్‌ మహాజన్‌ సంఘ్‌’ను ప్రారంభించడమే ఈ పరిణామానికి దారితీసింది. నూలువడికే రాట్నం, ఖద్దరునేతల వంటి అతిసామాన్య వస్తువులను ఆర్థికస్వావలంబన సాధనకు చిహ్నాలుగా మలచడం గాంధీ మహాత్ముడికే సాధ్యం. చిటికెడు ఉప్పుతో మహాఉద్యమానికి మరెవరైనా ఊపిరి పోయగలరా? ప్రపంచంలోనే ఎన్నో ప్రజాఉద్యమాలు జరిగాయి. భారత్‌లోనూ స్వాతంత్య్రం కోసం కొన్ని పోరాటాలూ చోటు చేసుకున్నాయి. అయితే, గాంధీజీ స్ఫూర్తితో భారీ ప్రజాభాగస్వామ్యంతో చెలరేగిన ఉద్యమం మాత్రం ప్రత్యేకం. ఆయనేనాడూ అధికారం కోసం పాకులాడలేదు. రాజకీయ స్వాతంత్య్రానికీ, వ్యక్తిగత సాధికారతకు ఉన్న సంబంధాన్ని ఆయన మాత్రమే చూడగలిగారు. విధిని చిత్తశుద్ధితో నిర్వహించిన వారికి హక్కులు వాటంతట అవే సమకూరుతాయి అంటూ గాంధీజీ ‘హరిజన్‌’లో రాసిన విషయం గమనార్హం.

జాతిపిత కలల సాకారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. భారత్‌లోని మేమంతా మా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాం. త్వరితగతిన పేదరిక నిర్మూలన సాధించిన దేశాల్లో భారత్‌ ఒకటి. పారిశుధ్య కార్యక్రమాల కృషిని చూస్తే ప్రపంచం దృష్టి అంతా భారత్‌ వైపే ఉంది. పునరుత్పాదక వనరుల అంశాన్ని తీసుకున్నా భారత్‌ ముందడుగులో ఉంది. సౌరవిద్యుత్‌ రంగంలోనూ అంతే. మరింతగా ముందుకు సాగాలన్నదే మా ఆకాంక్ష. హింస, విద్వేషం, వేదనలను అంతమొందించేందుకు అందరం చేయిచేయి కలిపిముందడుగేద్దాం. ఇతరుల బాధను తన బాధగా అనుభవించేవాడే అసలైన మనిషి అన్న గాంధీజీ మాటలను మననం చేసుకుందాం.’’

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.