close

ప్ర‌త్యేక క‌థ‌నం

పులితో చెలిమి!

మహారాష్ట్రలో తిరుగులేని ఆధిక్యమే భాజపా లక్ష్యం
విస్తృత ప్రయోజనాలకే శివసేనతో పొత్తు

పొత్తులు ఖరారైన వేళ.. మహారాష్ట్రలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. భాజపా-శివసేన.. కాంగ్రెస్‌-నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) కూటముల మధ్యే ప్రధాన పోరు అన్నది స్పష్టమైంది.

భాజపా-శివసేనల పొత్తుపై చివరిదాకా ఉత్కంఠ, ఊహాగానాలు సాగాయి. కొద్ది నెలలుగా భాజపా నేతలంతా ‘చర్చలు జరుగుతున్నాయి..’ అని మాత్రమే చెబుతూ వచ్చారు. నాసిక్‌లో సెప్టెంబరు 19న ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ కూడా శివసేన గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఇటీవల తన ముంబయి పర్యటనలో భాజపా అధినేత అమిత్‌ షా కూడా శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేతో భేటీ కాలేదు. లోక్‌సభ ఎన్నికల ముందు మాత్రం ఆయన బాంద్రాలోని ఠాక్రేల నివాసానికి వెళ్లడం గమనార్హం. ఈ నేపథ్యంలో చివరకు భాజపా-శివసేనలు పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించాయి. విస్తృత, దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా భాజపా శివసేనతో కలిసి బరిలోకి దిగుతున్నట్లు రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. మహారాష్ట్రలో సహకారం రంగంలోను.. వివిధ వర్గాల్లోనూ.. పట్టున్న ఎన్‌సీపీ-కాంగ్రెస్‌లపై బలం పెంచుకోవాలన్నది భాజపా వ్యూహంగా కనిపిస్తోంది.

‘పెద్దన్న’ పాత్రలో..
1989 నాటికి రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ఉన్న అభిప్రాయం ఏమంటే -  ‘మహారాష్ట్రలో భాజపాకు శివసేన పెద్దన్నగా ఉంటే.. జాతీయస్థాయిలో భాజపా శివసేనకు పెద్దన్నగా ఉండటం.’ అప్పట్లో భాజపా 117 స్థానాల్లో పోటీచేస్తే, శివసేన 171 చోట్ల బరిలోకి దిగింది. కాలక్రమేణా భాజపా బలాన్ని పెంచుకుంటూ వచ్చింది. ఇప్పుడు పరిస్థితి మారిందని.. భాజపా అటు కేంద్రంలోను, ఇటు మహారాష్ట్రలోనూ ‘పెద్దన్న’గా మారిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో కమలదళ బలం పెరుగుతున్న క్రమాన్ని ఇందుకు ఉదహరిస్తున్నారు. గత ఐదేళ్లలో శివసేనతో పాటు, కాంగ్రెస్‌-ఎన్‌సీపీలకు పట్టున్న ప్రాంతాల్లోనూ భాజపా బలోపేతమవుతూ వస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలూ వేర్వేరుగా తలపడగా శివసేనకు 63, భాజపాకు దాదాపు రెట్టింపుగా 123 స్థానాలు దక్కాయి. శివసేనకు అన్నివిధాలుగా గట్టి బలమున్న ముంబయి కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ (2017) నువ్వా-నేనా అన్నరీతిలో భాజపా పోటీ ఇచ్చింది. మొత్తం 227 స్థానాలకు గాను శివసేనకు 84 దక్కితే, భాజపాకు 82 దక్కడం విశేషం. తర్వాత ఠాణే మినహా పుణె, ఔరంగాబాద్‌, నాసిక్‌, జల్‌గాన్‌, ధూలే, నాగ్‌పుర్‌ వంటి నగరాల్లోనూ భాజపా సత్తా చాటింది. మున్సిపల్‌ కౌన్సిళ్లు, నగర పంచాయతీల్లో దాదాపు 40 శాతం సీట్లు సాధించింది. 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి కమలదళబలం మరింత పెరిగింది. శివసేనతో పొత్తుతో బరిలోకి దిగిన భాజపా 48 లోక్‌సభ స్థానాలకు గాను 23 గెలుచుకుంది. శివసేనకు 18 సీట్లు రాగా అందులో చాలామేర మోదీకి ఉన్న ప్రజాదరణ వల్లేనన్నది విశ్లేషకుల అంచనా. ఈ క్రమంలో తాజా ఎన్నికల్లో భాజపా నేతలు, కార్యకర్తల్లో చాలామంది ఒంటరిపోరుకే మొగ్గు చూపారు. పార్టీ అధినాయకత్వం మాత్రం పొత్తుకే ప్రాధాన్యం ఇచ్చింది. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని శివసేనతో కలిసే ముందుకెళ్లాలన్నది ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ వ్యూహం.

ఈనాటి బంధం ఆనాటిదే..
మహారాష్ట్ర చరిత్రలో భాజపా చాలాకాలం బలహీన పార్టీగా ఉండేది. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)ను మహరాష్ట్రియన్లే నాగ్‌పుర్‌లో స్థాపించినప్పటికీ భాజపాకు మాత్రం ఇక్కడ అంత పట్టు ఉండేది కాదు. శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే మొదట్లో ఆర్‌ఎస్‌ఎస్‌-భాజపాల పట్ల అంత శ్రద్ధ చూపేవారు కాదు. 1985 తర్వాత హిందుత్వ అజెండాతో భాజపా దూసుకెళ్లడంతో ఇది చాలామందికి చేరువవుతుందని బాల్‌ఠాక్రే గుర్తించారు. శివసేనకున్న ప్రజాబలానికి, భాజపా హిందుత్వ సిద్ధాంత శక్తి తోడైతే తమకు కలిసొస్తుందని ఆయన విశ్వసించారు. ఇలా చిగురించిన స్నేహబంధంతో 1989లో తొలిసారి 2 పార్టీలూ కలిసి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాయి. శివసేనకున్న విస్తృత వర్గాల మద్దతు, వ్యవస్థాపరమైన నిర్మాణం తమకు కలిసొస్తాయని భాజపా కూడా విశ్వసించింది. అప్పట్లో మహారాష్ట్రపై భాజపాకు పెద్దగా ఆశలేమీ లేకపోగా.. జాతీయ స్థాయిలో భాజపాకు మద్దతుగా నిలిచే పాత్రలోనే శివసేన ఉండేది.

‘సహకారం’ పొందాలని..
సహకార సంస్థలకు మహారాష్ట్ర పెట్టింది పేరు. రాష్ట్రంలో విస్తృతంగా ఉన్న సహకార రంగం మద్దతు ఎక్కువగా కాంగ్రెస్‌, ఎన్‌సీపీలకే ఉంది. చక్కెర కర్మాగారాలు, ఎత్తిపోతల పథకాలు, బ్యాంకులు.. ఇలా సహకార రంగంలో దాదాపు రూ. 36 వేల కోట్ల పెట్టుబడితో నడుస్తున్న 2 లక్షల సంస్థల్లో 5 కోట్ల మంది సభ్యులుంటారని అంచనా. వీటిలో చాలామేర కాంగ్రెస్‌, ఎన్‌సీపీ నియంత్రణలోనే ఉన్నాయి. దీర్ఘకాలంలో ఈ రంగంలో బలోపేతం కావాలన్నది భాజపా యోచన. మోదీ-షా నేతృత్వంలో అన్నిరంగాల్లోనూ ప్రతిపక్షాలను బలహీనపరచి పార్టీ పట్టును పెంచాలన్నది ఆలోచన. ఈ నేపథ్యంలో ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌, ఇతర నాయకులపై భాజపా దృష్టి సారించింది. రెండు పార్టీల నుంచి దాదాపు 30 మంది కీలక నేతలను భాజపా చేర్చుకుంది. వారిలో చాలామందికి తాజాగా టిక్కెట్లు కూడా కేటాయించింది. భాజపా గట్టి వ్యూహంతో పావులు కదుపుతున్నప్పటికీ కాంగ్రెస్‌-ఎన్‌సీపీలు కూడా ఈ ఎన్నికలను తేలికగా తీసుకోవడం లేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.