close

ప్ర‌త్యేక క‌థ‌నం

సమాజానికి ఎంతో కొంత ఇచ్చేద్దాం!

 ప్రభుత్వమే అన్నీ చేయలేదు
 సంస్థలు, పౌరులు సైతం చేయి కలిపితే అద్భుతాలే
 ‘సోషల్‌ వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌’ పుస్తకం అదే చెబుతోంది
 ‘ఈనాడు’ ముఖాముఖిలో కొలంబియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ విలియం బి ఎమికే

‘సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే లావై పోతాం..’ అంటూ ఆ మధ్య వచ్చిన ఓ తెలుగు సినిమాలోని డైలాగ్‌ ఎంత స్ఫూర్తి రగిలించిందో తెలిసిందే. అదే అభిప్రాయం ప్రపంచమంతటా విస్తరిస్తోంది. ‘ప్రభుత్వాలో, ప్రైవేటు రంగమో సమస్యలన్నింటినీ పరిష్కరించలేదు. తలో చేయి వేస్తే ఫలితాలు సులువవుతాయి’.. ఇదే సూత్రం కొలంబియా ఆచార్యులకు తట్టింది. లాభం.. ప్రజాప్రయోజనం.. రెండూ సమకూరే మార్గాన్ని వారు సూత్రీకరించారు. అదే ‘సోషల్‌ వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌’. ప్రపంచంలోని పలు దేశాల్లోని విధానాలను అధ్యయనం చేసి దీన్ని ప్రతిపాదిస్తూ ఇదే పేరుతో ఓ పుస్తకాన్ని వారు రచించారు. రచయితల్లో ఒకరైన ప్రొఫెసర్‌ విలియం బి ఎమికీ ఇటీవల ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో ‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖి..

ఈ పుస్తకానికి ఆ పేరు ఎందుకు పెట్టారు?

నిజానికి ఇదో పెద్ద కథ. సూక్ష్మంగా చెబుతా. సహ రచయిత హోవర్డ్‌ బఫెట్‌ తాత వారెన్‌ బఫెట్‌. ఆయన ‘బెర్క్‌షైర్‌ హాత్‌వే’ కంపెనీ వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌ ద్వారానే సాకారమైంది. ప్రపంచానికి ఉపయుక్తమైనదేదైనా చేద్దామని నేను, హోవర్డ్‌ ఆలోచించి ప్రయోగాలు చేశాం. మేనేజ్‌మెంట్‌, మెజర్‌మెంట్‌ వ్యూహాలను రంగరించి ఈ పుస్తకానికి సోషల్‌ వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌గా నామకరణం చేశాం.

సోషల్‌ వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌ పుస్తకం ఎందుకు రాయాలనుకున్నారు?

ప్రపంచం చాలా సమస్యలను ఎదుర్కొంటోంది. అసమానతలు, పర్యావరణం ముప్పు, పని చేసే అవకాశాలు తగ్గుతుండటం లాంటివి చాలా ఉన్నాయి. ప్రభుత్వమే వీటన్నింటికి పరిష్కారం చూపలేదు. ప్రైవేటు రంగమొక్కటే చేయలేదు. మేం పదేళ్లుగా పరిష్కార మార్గాలపై పరిశోధనలు చేస్తున్నాం. కొన్నింటికి మూలాలను గుర్తించాం. ఆయా అంశాలే పుస్తకం రాయటానికి ప్రేరేపించాయి. ఒకవైపు లాభం, మరోవైపు ప్రజాప్రయోజనం.. రెండూ అవసరమని గుర్తించాం.

సామాజిక బాధ్యతను కొన్ని సంస్థలు న్యూసెన్స్‌గా భావిస్తున్నాయన్న వాదన ఉంది... దీనికి పరిష్కారం?

ప్రభుత్వం కొంత చొరవ చూపితే ఆ భావన పోతుంది. నిజాయతీగా, వ్యవస్థకు ఉపయుక్తంగా ఉండే సమస్యను ఎంచుకుని, దానికి పరిష్కారం చూపిన సంస్థలకు ఇతర పన్నుల్లో రాయితీలనో, ప్రోత్సాహకాలనో ఇస్తే పారిశ్రామికవేత్తలు దాన్ని భారంగా భావించరు. ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలన్న ధోరణి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోందన్నదే నా అభిప్రాయం.

‘సోషల్‌ వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌’ విధానం భారతదేశంలో ఎలాంటి ప్రయోజనాన్ని ఇస్తుందంటారు?

భారత్‌ అనగానే పేద దేశం, జనాభా ఎక్కువ, గాంధీ మహాత్ముడి పేరు గుర్తుకొస్తాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది ఆరో స్థానంలో ఉంది. ఈ పుస్తకంలోనూ కొన్ని ఉదహరించాము. అందులో ఆధార్‌ ఒకటి. కేవలం ఒక కార్డు ఆధారంగా ఏ మూలకు వెళ్లినా అర్హులైన పేదలు ప్రభుత్వ పథకాలు పొందుతున్నారు. 120 కోట్ల జనాభా ఇందులో నమోదయ్యారు. ఇది నిజంగా గొప్ప విషయం. ఇకపోతే ‘సోషల్‌ వ్యాల్యూ..’ విధానంలో పెట్టుబడులు వస్తే భారత్‌లో అనూహ్య ప్రయోజనాలుంటాయి. ప్రస్తుతం లాభాల్లో రెండు శాతాన్ని సంస్థలు సామాజిక బాధ్యత కింద ఖర్చు చేస్తున్నాయి. ఇది వ్యవస్థీకృతంగా లేదు. ప్రభుత్వమే విద్యా, వైద్యం, గృహనిర్మాణం ఇలా కొన్ని అంశాలను గుర్తించి వాటికే ఆయా మొత్తాలు వినియోగం అయ్యేలా ప్రణాళికలు రూపొందించి ప్రైవేటు సంస్థల్ని ప్రోత్సహించాలి.

న్యూయార్క్‌లో చేపడుతున్న గృహ నిర్మాణ విధానం భారతీయ నగరాలకు ఉపయుక్తంగా ఉంటుందా?

నిస్సందేహంగా ఉంటుంది. ప్రభుత్వ, పేదల భూమిని సమీకరించి ప్రైవేటు నిర్మాణదారుల ద్వారా గృహాలు పూర్తిచేయించాం. పేదలకు తక్కువ ధరకు వాటిని విక్రయించాం. భారత్‌లో జనాభా అధికం. స్థలాలు తక్కువ. మురికివాడలు ఎక్కువగా ఉంటాయి. వాటిల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టి పేదలకు అందుబాటు ధరలకు విక్రయించొచ్చు. నిర్మాణాలకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను భాగస్వాములను చేస్తే ఇంకా ప్రయోజనకరంగా ఉంటుంది.

మీ పరిశోధన ద్వారా సాఫల్యత లభించిందనడానికి ఉదాహరణ చెప్పగలరా?

నేను న్యూయార్క్‌ వాసిని. అక్కడి సెంట్రల్‌ పార్కు నా హృదయానికి దగ్గరగా ఉంటుంది. ప్రపంచంలో చాలా మందికి ఇప్పుడు అది ఓ అద్భుతం. ఒకప్పుడు ఆ పార్కుకు వెళ్లేందుకు ప్రజలు భయపడేవారు. అది హత్యలకు అడ్డాగా సినిమాల్లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఏటా 40 మిలియన్ల మంది సందర్శిస్తున్నారు. స్థానికులు, కొందరు ఔత్సాహికులు ఉమ్మడిగా శ్రమించి పార్కు రూపురేఖలు మార్చడంతో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది.
- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.