close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఏది మన జాబ్‌?

ఏం చెయ్యాలి? ఎలా స్థిరపడాలి?

యువతను మానసికంగా వేధించే అతి పెద్ద సమస్య ఇది! 20-25 ఏళ్ల వయసులో ఈ గందరగోళంలో చిక్కుకోనివాళ్లంటూ ఉండరు. తెలియనితనంలో ఎన్నో కలలు! కొన్నాళ్ల తర్వాత తమ కలలు తమకే నవ్వు తెప్పిస్తాయిగానీ.. ఆ వెంటే ఏం చెయ్యాలన్న ప్రశ్నా నీడలా వెంటాడటం మొదలెడుతుంది. డాక్టర్లు, యాక్టర్లు, ఇంజినీర్లు ఎంతో మంది అయిపోతారు.. కానీ ప్రశ్న ప్రశ్నగానే వేధిస్తుంటుంది. మనమే మార్గంలో వెళ్లాలి? యువతను వేధించే ఈ పెను సంశయానికి ‘యాపిల్‌’ పండు కోసినంత తేలిగ్గా బదులిచ్చారు స్టీవ్‌ జాబ్స్‌! మన మనసు ఊసు వినాలి.. మన బలమేంటో, మనం ఏం కాబోతున్నామో, ఏం కాగలమో తెలిసింది ఒక్క మన హృదయానికే అంటారాయన!

మనసు మాట వినాలి!

జీవితంలో ఏం చెయ్యాలి.. ఏ వృత్తిని ఎంచుకోవాలి? ఏది సాధ్యం? ఏది అసాధ్యం? మన ముందు తరచూ నిలబడే ప్రశ్నలివి. ఊహలకు సైతం పరిమితులు ఉంటాయి. కొన్నిసార్లు మనమేం చెయ్యాలో తెలిసి కూడా.. మనం దాన్ని బాగా చెయ్యగలమన్న అవగాహన ఉండి కూడా కేవలం భయంతోనో, లేక ఇతరులెవ్వరూ వెళ్లని ఆ మార్గంలో మనమేం సాధించలమనో ఆలోచిస్తూ చివరికి సద్దుకుపోతూ.. నలిగిన బాటల్లోనే నడక ఆరంభిస్తాం! కానీ సరిగ్గా ఈ నలిగిన ఆలోచనలే మన దారులకు ప్రతిబంధకాలు అవుతాయంటారు స్టీవ్‌ జాబ్స్‌!!

చిన్న ‘యాపిల్‌’ చేతిలో పట్టుకుని జాబ్స్‌ సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కంప్యూటర్‌ నుంచి ఐపోడ్‌, ఐప్యాడ్‌, ఐఫోన్‌ వరకూ.. జాబ్స్‌ ప్రతి సృష్టీ ప్రపంచాన్ని సంభ్రమంలో ముంచెత్తిందే. అదంతా చాలా వరకూ ఒక్క మనిషి కన్న కల. ఒక్క మనిషి స్వప్నం. మరి ఈ విజయం అందరికీ సాధ్యమేనా? అంటే కచ్చితంగా సాధ్యమే అంటారు స్టీవ్‌ జాబ్స్‌. దీనికి కావాల్సింది.. మన మనసు చెప్పే ఊసు వినటం. ఆ విన్న దాన్ని ఎవరేమనుకున్నా, ఎవరెన్ని అన్నా.. ధైర్యంగా ఆచరణలో పెట్టటం! ఇందుకు తన జీవితమే పెద్ద తార్కాణమంటూ ఒకసారి తన జీవిత కథనే చెప్పుకొచ్చారు స్టీవ్‌ జాబ్స్‌. తాను కొంతకాలం చదివి, మధ్యలో మానేసిన స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ రీడ్స్‌ కాలేజీలో ప్రసంగిస్తూ.. తన జీవితం మొత్తాన్ని మూడు ఆసక్తికరమైన కథల్లో కుదించి.. స్ఫూర్తిమంతంగా చెప్పారు జాబ్స్‌. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన ఆ ప్రసంగం నేడే కాదు.. ఎప్పటికీ యువతరానికి ఎదురయ్యే చిక్కుముడులు పొరలు పొరలుగా వలుచుకోవటం ఎలాగో.. గందరగోళంలోనే వెలుగు దారి తెలుసుకోవటం ఎలాగో నేర్పిస్తుంటుంది.

మనసు మాట విని.. డిగ్రీ మానేశా!
కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో స్టీవ్‌ జాబ్స్‌కు ఇల్లు కూడా లేదు. స్నేహితుల రూముల్లో కింద పడుకునేవాడు. కోక్‌ సీసాలు సేకరించి వాటిని 5 సెంట్లకు అమ్మటం ద్వారా వచ్చిన డబ్బుతో కడుపు నింపుకొనేవాడు. నిండా నాలుగు ముద్దలు తినటం కోసం ప్రతి ఆదివారం సిటీకి దూరంగా 7 మైళ్ల దూరంలో ఉన్న హరేకృష్ణ మందిరానికి వెళ్లేవాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా తను మనసు మాట వినటానికే ప్రాధాన్యం ఇచ్చానంటాడు జాబ్స్‌.

ఆ రోజుల గురించి చెప్పుకొస్తూ...
‘‘ఇంటి పరిస్థితుల రీత్యా చేరిన ఆర్నెల్లకే నేను కాలేజీకి వెళ్లటం మానేశాను. ఆ తర్వాత కేవలం నాకు ఇష్టమైన క్లాసులకు మాత్రమే వెళుతుండే వాడిని. అప్పట్లో క్యాలిగ్రఫీలో దేశంలోనే అత్యుత్తమ కోర్సు నేర్పించేది రీడ్‌ కాలేజీ. క్యాంపస్‌లో ఎక్కడ చూసినా పోస్టర్లు, లేబుల్స్‌ వంటివన్నీ ఎంతో అందంగా చేతిరాతతో డిజైన్‌ చేసి ఉండేవి. నేనా క్యాలిగ్రఫీ క్లాసులకు వెళ్లటం ఆరంభించాను. అక్షరాలను అందంగా, రకరకాలుగా రాయటం ఎలా, వాటి మధ్య ఎంత ఎడం ఇవ్వాలి, కొన్ని రకాలుగా రాస్తే అక్షరాలు ఎందుకంత అందంగా కనబడుతున్నాయన్నది అక్కడే అర్థం చేసుకున్నాను. అందంగా, ఎంతో కళాత్మకంగా, ఏ సైన్సూ పట్టుకోలేనంత అందంగా ఉం అక్షరాలు నా మనసును ఆకట్టుకున్నాయి. అయితే ఆ రోజుల్లో అదేదో నా జీవితానికి పనికొస్తుందన్న ఆలోచనతో నేనేం నేర్చుకోలేదు. కానీ పదేళ్ల తర్వాత మేం మెకింతోష్‌ కంప్యూటర్లు డిజైన్‌ చేస్తున్నప్పుడు ఆ శిక్షణ ఎంతో అద్భుతంగా ఉపయోగపడింది. నేటి కంప్యూటర్లలో అద్భుతమైన అక్షరాల పొందిక ఉందంటే నాడు నేనా క్లాసులకు వెళ్లటమే కారణం. నిజానికి నేనా రోజుల్లో దీన్ని ఊహించి నేర్చుకోలేదు. అందుకే మనం మనసు మాట విని భవిష్యత్తుకు బాటలు పరుచుకోవటం ముఖ్యం. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ధైర్యం, విధి, జీవితం, కర్మ.. ఏదో ఒక దాని మీద నమ్మకం ఉండటం ముఖ్యం. ఎందుకంటే ఏదో రోజు మనం ప్రయాణించి వచ్చిన దారులన్నీ కలిసి, ఒక రూపం ఏర్పడుతుందని నమ్మటం వల్ల- మన మనసు మాట వినే, హృదయం చెప్పే విషయాలను ఆలకించే ధైర్యం, విశ్వాసం దక్కుతాయి. అంతా నడిచే, నలిగిపోయిన బాటలో కాకుండా కొత్త మార్గంలో వెళ్లేందుకు అది మీకు దారి చూపిస్తుంది. తేడా అంతా అక్కడే వస్తుంది!!

కుదురుగా కూర్చుని ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవటం ఆరంభించండి.. మొదట్లో మనసు ఎంత గందరగోళంగా అనిపిస్తుంటుందో. శాంత పరిచేందుకు ప్రయత్నించే కొద్దీ అది మరింత గందరగోళంలోకి వెళుతుంది. కానీ కొంత సమయం గడిచాక అది నెమ్మదిస్తుంది, అప్పుడు మరింత సున్నితమైన విషయాలను కూడా వినేందుకు ఆస్కారం చిక్కుతుంది. సరిగ్గా మీ అంతశ్చేతన వికసించటం ఆరంభించే సమయం అది. ఇక క్రమేపీ విషయాలు మరింత స్పష్టమవటం మొదలవుతుంది. మనసు నిదానిస్తూ, విస్తరించుకుంటున్న కొద్దీ విషయాలన్నీ ముందు కంటే మరింత స్పష్టతతో కనబడతాయి.. ఇదో క్రమశిక్షణ. దీన్ని మీరు తప్పకుండా సాధన చెయ్యాలి.

మీరు నిజంగా శ్రద్ధ వహించే దాని మీదే పని చేస్తున్నారా? అన్నది తెలుసుకునేందుకు ఒకటే గుర్తు. వెనక నుంచి మిమ్మల్ని ఎవరూ తొయ్యక్కర్లేదు. మీ కలలే  మిమ్మల్ని ముందుకు లాగుతూఉంటాయి!
మీరు కాస్త లోతుగా చూడండి.. మనం రాత్రికి రాత్రే విజయం సాధించేశారని అనుకునే వాళ్లంతా కూడా ఎంతో కాలంపాటు కష్టపడి ఉంటారు!

గాలి బుడగల ఛాలెంజ్‌!
ఐపోడ్‌ను వీలైనంత సూక్ష్మంగా రూపొందించాలన్నది స్టీవ్‌ జాబ్స్‌ లక్ష్యం. అదే విషయం తమ ఇంజినీర్లకు చెవినిల్లు కట్టుకుని పోరుతుండేవాడు. ఒక రోజు తాము కొత్తగా రూపొందించిన ఐపోడ్‌ తెచ్చి ఆయన ముందుంచారు ఇంజినీర్లు. వెంటనే జాబ్స్‌ దాన్ని తీసుకువెళ్లి ఎదురుగా ఉన్న అక్వేరియంలో వేశాడు! అది చూసి వాళ్లంతా బిత్తరపోయారు. అది నీళ్ల తొట్టెలో కిందికి వెళుతుంటే గాలి బుడగలు పైకి రావటం మొదలైంది. దానర్థం లోపల ఇంకా గాలి చొరబడేంత ఖాళీలున్నాయనే! వాటిని కూడా తగ్గిస్తే పరికరం ఇంకా చిన్నగా తయారవుతుంది కదా అన్నాడు స్టీవ్‌. ఆ బుడగల ఛాలెంజ్‌ని స్వీకరించిన ఇంజినీర్లు మొదట్లో 19.9 మి.మీ. మందం ఉన్న ఐపోడ్‌ను మార్చీమార్చీ చివరికి 6.1 మి.మీ.లకు తేగలిగారు! ఈ సూక్ష్మమే ఐపోడ్‌ విజయ రహస్యం!

మృత్యువు గురించి!
ఇక క్లోమం క్యాన్సర్‌ ముంచుకొచ్చి మృత్యు ముఖంలో ఉన్న సమయంలో కూడా తన మనసును తానెంత నిబద్ధంగా ఉంచుకుందీ జాబ్స్‌ ఇలా వివరించాడు...
‘‘ఎవరూ చనిపోవాలనుకోరు. స్వర్గానికి వెళ్లటం తథ్యమని తెలిసినవాళ్లు కూడా చనిపోవాలనుకోరు. కానీ మనందరం చేరుకునే గమ్యం అదే. ఎవరం తప్పించుకోలేం. అలాగే ఉండాలి కూడా. మార్పుకు పట్టం కడుతూ.. పాత నుంచి కొత్తదనానికి మార్గం సుగమం చేసే సాధనమే మృత్యువు. ఇప్పుడు మీరే కొత్తతరం. కానీ ఒక రోజు మీరూ కొత్తకు దారిస్తూ పాతవాళ్లవుతారు. నేను నాటకీయంగా మాట్లాడుతున్నాననుకోకండి.. అది నిజం. మీకున్న సమయం తక్కువ. కాబట్టి మరొకరి జీవితాన్ని జీవిస్తూ మీ సమయం వృథా చేసుకోకండి. మూసలో చిక్కుకోకండి, ఇతరుల ఆలోచనల్లో, అడుగుల్లో నడవకండి. చుట్టూ వినిపించే నానా అభిప్రాయాల రొదలో చిక్కుకుని.. మీ మనసు చెప్పే ఊసులు, మీ గుండె చప్పుళ్లు కొట్టుకుపోకుండా చూసుకోండి. మీరేం కావాలో, ఏం కాగలరో మీ హృదయానికి ఇప్పటికే తెలుసు. అందుకే మీ హృదయం, మీ మనసు చెప్పే మాట వినే ధైర్యం తెచ్చుకోండి. మిగతా దంతా ఆతర్వాతే! నా చిన్నప్పుడు ‘ద హోల్‌ ఎర్త్‌ క్యాటలాగ్‌’ అనే పుస్తకం చూశాను. అదొక రకంగా ఆ రోజుల్లో గూగుల్‌ లాంటిది! దాని చివరి పేజీ మీద ‘స్టే హంగ్రీ.. స్టే ఫూలిష్‌’ అని రాశారు. అది వాళ్ల అంతిమ సందేశం అనుకోవచ్చు. నేను జీవితాంతం అదే నమ్ముతున్నాను. ఎప్పుడూ ఏదో సాధించాలన్న ఆకలితో ఉండండి. మూసలో కొట్టుకుపోకండి, కొద్దిగా పిచ్చితనంగా ఆలోచించినా ఫర్వాలేదు, కొత్తగా ఆలోచించండి!

మన జీవితాల్లో ఎక్కువ భాగం పనిలోనే ఉంటాం, నిజంగా సంతృప్తి పొందాలంటే మనం చేస్తున్న పని పట్ల గొప్ప నమ్మకం ఉండాలి. గొప్ప పని అనుకున్నదే చేస్తుండాలి. గొప్ప పని చెయ్యటానికి ఒకటే మార్గం, మనం చేస్తున్న పనిని మనం ప్రేమించాలి. అదేమిటో మీకింకా తెలిసే వరకూ అన్వేషణ కొనసాగిస్తూనే ఉండండి. ఉన్నదానితో తృప్తిపడిపోకండి. మనకు కావాల్సింది దొరికినప్పుడు ఆ విషయం మన హృదయానికి తేలిగ్గానే తెలిసిపోతుంది. అలాగే మిగతా గొప్పసంబంధాలన్నింటిలాగే అది కూడా ఏళ్లు గడుస్తున్న కొద్దీ మరింతగా మెరుగవుతూనే ఉంటుంది. కాబట్టి అన్వేషిస్తూనే ఉండండి.

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.