close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఆరోగ్యానికి మంటనూనె

వంటనూనెల పునర్వినియోగంపై  పర్యవేక్షణ కరవు
రాష్ట్రంలో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లకు సమకూరని యంత్రాలు
వీధి వ్యాపారుల ఇష్టారాజ్యం
చెడుకొవ్వుతో వినియోగదారుల ఆరోగ్యానికి హాని
ఈనాడు - గుంటూరు

చిటపట చినుకులు పడుతుంటే బజ్జీల బండి వైపు కాళ్లు లాక్కెళ్లిపోతుంటాయి. కుటుంబంతో సరదాగా సాయంత్రం బయటికెళితే నాన్నా ఫ్రైడ్‌ రైస్‌ అంటుంది అమ్మాయి. నాకు నూడుల్స్‌.. ఆర్డరేస్తాడు పిల్లాడు. బేకరీకెళ్లినా, మిఠాయి దుకాణానికెళ్లినా చిప్స్‌ కొనకుండా తిరిగొచ్చేవాళ్లూ తక్కువే. రుచి సరే.. కానీ వాటి తయారీకి వాడే నూనెలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో ఎవరూ గుర్తించడం లేదు. ఆహార నాణ్యతను తనిఖీ చేయాల్సిన అధికారులూ దృష్టి పెట్టకపోవడంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. కల్తీ నివారణకు సాధన సంపత్తి, ప్రణాళిక లేకపోవడం దీనికి ప్రధాన కారణమవుతున్నాయి. వంటనూనెను మూడు సార్లకు మించి వినియోగించకూడదు. అంతకన్నా ఎక్కువసార్లు వాడితే అది చెడు కొలెస్ట్రాల్‌ (ట్రాన్స్‌ఫ్యాట్‌)గా మారుతుంది. దీన్ని బయోడీజిల్‌ అవసరాలకు మాత్రమే వినియోగించాలి.     మరిగించిన నూనె నాణ్యతను గుర్తించడానికి టీపీసీ  మీటర్లను ఉపయోగిస్తారు. ఆంధప్రదేశ్‌లో 31 మంది ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లు ఉండగా ఒక్క మీటరూ లేదని ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు. నూనె వాసన వస్తే తప్ప అది వాడకూడదని చెప్పడం మినహా ప్రామాణికంగా అంచనా వేసే వ్యవస్థేమీ తమ దగ్గర లేదని ఆహారకల్తీ నిరోధక యంత్రాంగం చెబుతోంది. ప్రజారోగ్యాన్ని కాపాడే విషయంలో పాలకులు, యంత్రాంగం నిర్లక్ష్యానికి ఇదో ఉదాహరణ మాత్రమే.

ఇతర రాష్ట్రాల్లో అమలు
ఒక్కో టీపీసీ మీటర్‌ ధర రూ.50 వేల నుంచి రూ.70వేల వరకు ఉంటుంది. కేరళ, తమిళనాడు,  కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, హరియాణా ప్రభుత్వాలు ఈ పరికరాలను అధికార యంత్రాంగానికి సమకూర్చి తనిఖీలు చేయిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇది లోపించింది.

ఏటా 50 వేల మరణాలు
* 3సార్లకు మించిన నూనెను తిరిగి వినియోగిస్తే గుండె, కేన్సర్‌ తదితర వ్యాధులకు దారి తీసే ప్రమాదం ఉంది. దేశంలో చెడుకొవ్వుతో గుండెజబ్బుల బారినపడి ఏటా 50 వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అధ్యయనంలో తేలింది.
* ఆహార భద్రత, ప్రమాణాల చట్టం ప్రకారం వ్యాపారులు ఇలాంటి నూనెను వినియోగిస్తే సెక్షన్‌ 56 కింద రూ.లక్ష అపరాధ రుసుం విధించొచ్చు.
* ప్రస్తుతం భారతదేశంలో ట్రాన్స్‌ఫ్యాట్‌ నూనె వినియోగం 5 శాతం ఉంది. దీనిని 2023 నాటికి 2 శాతానికి తగ్గించి, క్రమంగా పారదోలాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ అందుకు తగిన కార్యాచరణ లోపించింది.
* కెనడా, అర్జెంటీనా దేశాలు చెడుకొవ్వును పూర్తిగా పారదోలి మరణాలు లేకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాయి.
* ప్రధానంగా బయటి నుంచి తెచ్చుకుని తినే ఆహారపదార్థాల్లోనే చెడుకొవ్వు శాతం ఉంటోందని న్యూ ఇంగ్లాండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అధ్యయనం వెల్లడించింది.

రాజధాని నగరాల్లో అత్యధికం
రాష్ట్రంలోనే అత్యధికంగా రాజధాని ప్రాంత నగరాలైన విజయవాడ, గుంటూరులలో 12వేల మంది వీధి వ్యాపారులు అల్పాహారం, బేకరీ, చిప్స్‌ ఉత్పత్తులు తయారుచేసి విక్రయాలు చేస్తున్నారని ఆహార తనిఖీ అధికారులు అంటున్నారు. వీరెవరూ పనికిరాని నూనెను బయోడీజిల్‌ వ్యాపారులకు ఇస్తున్న దాఖలాలు లేవు.
* పెద్ద హోటళ్లలో కొంతమంది వంటనూనెను 3 సార్లు వాడిన తర్వాత దాన్ని తీసేసి కొత్తనూనెను వాడతారని అధికారవర్గాలు చెబుతున్నాయి. వీధి వ్యాపారులు (స్ట్రీట్‌ వెండర్స్‌) చాలామంది వాడిన నూనెలోనే తిరిగి తాజా నూనెలు పోసేస్తున్నారని తేలింది.
* రాష్ట్రంలో తరచూ కొన్ని కార్పొరేట్‌ కళాశాలల వసతి గృహాల్లో ఆహారకల్తీ జరిగిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నమూనాలు తీసి చట్టపరమైన శిక్షలకు సిఫార్సు చేయటానికి కనీసం ప్రయోగశాల లేదు. కేవలం ఇన్‌ఫార్మల్‌ శాంపిళ్లు తీసి ప్రాంతీయ ప్రయోగశాలలకు పంపుతున్నారు.
* తెలంగాణలో సంచార ప్రయోగశాల ఉంది. దాన్ని అడపాదడపా గ్రామాలకు పంపి ఆహార కల్తీపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

టీపీసీ మీటర్‌

వీధి వ్యాపారులు, బేకరీలు, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో ఒకసారి మరిగించిన నూనెను 3 సార్లే వినియోగిస్తున్నారా? అంతకు మించి వాడుతున్నారా? తెలుసుకోవాలంటే టీపీసీ (టోటల్‌ పోలార్‌ కాంపౌండ్స్‌ మెజరింగ్‌) మీటర్లుండాలి. కళాయిలో నూనె కాగుతున్నప్పుడు ఆ మీటరు ఉంచుతారు. రీడింగ్‌ 25 శాతం దాటితే ఆ నూనె వినియోగానికి పనికిరాదని గుర్తిస్తారు.

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.