close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఆహార శుద్ధి రైతుకు లబ్ధి

తొలిదశలో 5 జిల్లాల్లో మెగా ఫుడ్‌పార్కుల ఏర్పాటు
భూ కేటాయింపులు పూర్తి
  రూ. 3,000 కోట్ల పెట్టుబడులు
20,000 మందికి ప్రత్యక్ష ఉపాధి
  ప్రతిపాదనలివ్వాలని కలెక్టర్లకు ఆదేశం
ఈనాడు - హైదరాబాద్‌

ఎంతో ఆశతో పండించినా.. గిట్టుబాటు ధర రాక పంటను కోయకుండా పశువుల మేతకు వదిలేసే దయనీయ పరిస్థితి కొందరిది.. ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తిని మార్కెట్‌ వరకు తెచ్చినా, దళారుల మాయాజాలంతో నష్టానికి అమ్మేసుకుని కళ్లనీళ్లతో ఇంటిముఖం పట్టే దుస్థితి మరికొందరిది.. పంట చేతికి రాగానే హఠాత్తుగా ధర పడిపోగా మద్దతు కోసం రోడ్డెక్కే రైతన్నలు మరికొందరు!  కాయకష్టం చేసుకునే రైతుకు ఎన్నాళ్లీ దురవస్థ? ఈ పరిస్థితిని మార్చేవే ఆహారశుద్ధి పరిశ్రమలు. పంటపొలం చెంతనే.. ఉన్న ఊళ్లోనే ఉత్పత్తిని అమ్ముకునే భరోసా కేంద్రాలివి. అన్ని జిల్లాల్లో మెగా ఫుడ్‌పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వీటి ద్వారా పారిశ్రామిక సమూహాలకు చోటు కల్పించనుంది.

ఇప్పటికే 5 జిల్లాల్లో కార్యాచరణ మొదలైంది. మిగిలిన జిల్లాల నుంచి ప్రతిపాదనలివ్వాలని కలెక్టర్లను ఆదేశించింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల ఉత్పత్తులకు అదనపు విలువలను జత చేయడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు, యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారు. దీనికి అనుగుణంగా పరిశ్రమల శాఖ అన్ని జిల్లాల్లో స్థానికంగా ఉన్న వనరుల ఆధారంగా వ్యవసాయిక (ఆగ్రో), ఆహార శుద్ధి పార్కులకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అన్నీ అనుకున్నట్లే జరిగితే.. ముందుముందు రైతన్నలకు మంచిరోజులు వచ్చినట్లే!

ఏమిటీ పార్కులు?
ఈ పార్కుల ద్వారా ఆహారశుద్ధి పరిశ్రమలు అందుబాటులోకి వస్తాయి. రైతులు, రైతు సంఘాలు సైతం వీటిని స్థాపించుకోడానికి అవకాశం ఉంటుంది. అధునాతన యంత్రాలు చేరువవుతాయి. పంటల సాగు అనంతరం వాటి నిల్వ, శుద్ధి, ప్యాకేజీ, రవాణా, ఎగుమతుల వంటి సౌకర్యాలు రైతులకు వరంగా మారుతాయి. శుద్ధి ప్రక్రియ, వాటికి గ్రేడింగ్‌ జోడించడం, చక్కటి ప్యాకింగ్‌ వంటివి ఉత్పత్తిని ఆకర్షణీయంగా మారుస్తాయి. పంట సాగు నుంచి వినియోగదారులు ఉత్పత్తిని వినియోగించే వరకు, ప్రతి దశలో కొంత విలువను జోడించడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది.

తొలిదశలోనే భారీగా
తొలిదశలో రూ. 3,000 కోట్ల పెట్టుబడులతో 20,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి వద్ద బుగ్గపాడు, సిద్ధిపేట జిల్లాలో బండ మైలారం, బండ తిమ్మాపూర్‌, నిజామాబాద్‌ జిల్లాలోని వేల్పూరు, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌లలో పార్కులకు భూ కేటాయింపులు జరిగాయి. కొన్నిచోట్ల పనులు మొదలయ్యాయి. ఈ పార్కుల్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం భూకేటాయింపులతో పాటు రాయితీలు ఇస్తుంది. ఆహారశుద్ధి పరిశ్రమలకు కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి.



1 బుగ్గపాడు మెగా ఆహారశుద్ధి పార్కు 
మామిడి గుజ్జు, కొబ్బరి శుద్ధి పరిశ్రమల స్థాపన
కేటాయించిన భూములు  203.20 ఎకరాలు
ప్రాజెక్టు వ్యయం: రూ. 109.44 కోట్లు
పెట్టుబడులు: రూ. 324 కోట్లు
ఉద్యోగాల అంచనా: 2,511


2 మూడు జిల్లాల్లో ప్రాథమిక శుద్ధికేంద్రాలు
బుగ్గపాడు పార్కుకు అనుబంధంగా కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండలలో వీటిని ఏర్పాటు చేస్తారు. ఒక్కోదానికి 100 ఎకరాలు. రూ. 50 కోట్ల చొప్పున పెట్టుబడులు. ప్రతీ కేంద్రంలో 200 మందికి ఉపాధి.


3 బండ మైలారం విత్తన శుద్ధి కర్మాగారం
కేటాయించిన భూములు: 150 ఎకరాలు
పెట్టుబడులు రూ. 500 కోట్లు
2,000 మందికి ఉపాధి


4 రాజన్న సిరిసిల్లలో విత్తన శుద్ధి పార్కు
100 ఎకరాల కేటాయింపు
రూ. 300 కోట్ల పెట్టుబడులు
1,500 మందికి ఉపాధి


5 కరీంనగర్‌లో విత్తనశుద్ధి పార్కు
100 ఎకరాల కేటాయింపు
రూ. 250 కోట్ల పెట్టుబడి
1,500 మందికి ఉపాధి


6 బండ తిమ్మాపూర్‌ ఆహారశుద్ధి పార్కు
150 ఎకరాల కేటాయింపులు
రూ. 1500 కోట్ల పెట్టుబడులు - 5000 మందికి ఉపాధి
ఆహార, పానీయాల పరిశ్రమల స్థాపన. ఆర్‌పీజీ గోయెంకా, గిల్టిఫ్రీ పారిశ్రామిక సంస్థలు 20 ఎకరాల్లో రూ. 200 కోట్ల పెట్టుబడితో ఎఫ్‌ఎంసీజీ అల్పాహారాల పరిశ్రమ.


7 నిజామాబాద్‌ జిల్లా వేల్పూరులో సుగంధ ద్రవ్యాల (స్పైస్‌) పార్కు
పసుపు శుద్ధి పరిశ్రమల ఏర్పాటు
40.23 ఎకరాల కేటాయింపు
ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 30.81 కోట్లు
ఉద్యోగాల అంచనా: 1000

ప్రైవేటు రంగంలో..
ప్రైవేటు రంగంలో నిజామాబాద్‌ జిల్లా నందిపేట లక్కంపల్లిలో ఆహారశుద్ధి కేంద్రం ఇటీవలే ప్రారంభమైంది. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌లో రూ. 800 కోట్లతో ఐటీసీ ఆహారశుద్ధి కేంద్రం పనులు తుదిదశలో ఉన్నాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.