close

ప్ర‌త్యేక క‌థ‌నం

కలక్టరేట్లు

కొత్త జిల్లాలు ఏర్పడి దసరాకు మూడేళ్లు
ఎక్కడా నిర్మాణం పూర్తికాని సమీకృత భవనాలు
విసిరేసినట్టున్న ప్రభుత్వ కార్యాలయాలు
కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో సమస్యలు
నియామకాలు లేక అవస్థలు

‘‘ మెదక్‌ కలెక్టరేట్‌, సమీకృత భవనాల నిర్మాణం ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యం. ఇప్పటి వరకు ముప్పై శాతమే పనులయ్యాయి. మిగిలిన డెబ్బై శాతం పనులు రానున్న మూడు నెలల్లో ఎలా పూర్తి చేస్తారు.’’

- బడ్జెట్‌ సమావేశాల్లో మెదక్‌ శాసనసభ సభ్యురాలు పద్మా దేవేందర్‌రెడ్డి ప్రశ్న.

‘‘మహబూబాబాద్‌ కలెక్టరేట్‌ నిర్మాణం నెమ్మదిగా జరుగుతోంది. ఇలా అయితే ఎలా’’

- మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ప్రశ్న.

 

ఈనాడు, హైదరాబాద్‌: కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండల కార్యాలయాల్లో కనీస వసతులు లేక ప్రజలు, అధికారులు, సిబ్బంది అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో 2016 దసరా రోజున 21 కొత్త జిల్లాలను, ఈ ఏడాది మరో రెండు జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరిపాలన వికేంద్రీకరణ బాగున్నా కార్యాలయాల భవనాలు, కొత్తగా సిబ్బంది నియామకాలు లేక ఇబ్బందులు తప్పడం లేదు. ఇరుకు గదులు, ఒకే భవనంలో రెండు, మూడు కార్యాలయాలను ఏర్పాటు చేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు సర్దుకుపోతున్నారు. జిల్లా కలెక్టరేట్లు, శాఖల కార్యాలయాలకు సమీకృత భవనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. రెవెన్యూ డివిజన్లు, మండలాల్లోని శాఖలకు మాత్రం నేటికీ కార్యాలయాల నిర్మాణం ప్రారంభం కాలేదు. సర్వ్‌ టు ఆర్డర్‌ పేరుతో పూర్వ జిల్లాల్లో పనిచేస్తున్న సిబ్బందినే కొత్త కార్యాలయాలకు సర్దుబాటు చేయగా తిరిగి వారికి ఇప్పటివరకూ బదిలీలు చేపట్టలేదు.

ఇరుకు గదులు.. వసతుల లేమి
కొత్త మండలాలు ఏర్పాటు చేసిన చోట ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెభవనాలే దిక్కయ్యాయి. ప్రభుత్వ భవనాలు ఉన్నచోట ఒకేదానిలో రెండు, మూడు శాఖల సిబ్బంది సర్దుకుంటున్నారు. చాలా చోట్ల నేలపైనే దస్త్రాలను నిల్వ చేస్తున్నారు. భూ దస్త్రాల నవీకరణ చేపట్టడంతో తహసీల్దారు కార్యాలయాల్లో భూ దస్త్రాలు నిల్వ చేసే చోటు లేకుండా పోయింది. తాగునీరు, మరుగుదొడ్లు, వేచి ఉండేందుకు బల్లలు, ఫ్యాన్లు ఇతర వసతులు లేకపోవడంతో అధికారులు, సిబ్బందితోపాటు ప్రజలకు తిప్పలు తప్పడం లేవు.

1985లో ఆవిర్భవించిన మహబూబాబాద్‌ జిల్లా పాకాల కొత్తగూడెం మండలాన్ని రెండుగా విభజించి గంగారం కేంద్రంగా మరో మండలం ఏర్పాటు చేశారు. ఇక్కడ శిథిలావస్థకు చేరిన భవనాలను మరమ్మతులు చేసి వాటిలోనే కార్యాలయాలు ఏర్పాటు చేశారు. పోలీస్‌స్టేషన్‌ పాత మండల కేంద్రం నుంచే నడుస్తోంది.

నల్గొండ జిల్లా దేవరకొండ మండలాన్ని రెండుగా విభజించి కొండమల్లెపల్లిని కొత్త మండలంగా ఏర్పాటు చేశారు. మూడేళ్లుగా ఇక్కడ కార్యాలయాలకు భవనాలు నిర్మించనేలేదు. ఒకే భవనంలో తహసీల్దారు, వ్యవసాయ శాఖ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. ఒకే భవనంలో పోలీస్‌స్టేషన్‌, సర్కిల్‌ కార్యాలయం కొనసాగుతున్నాయి.

3 సంవత్సరాలుగా పాట్లు
కలెక్టరేట్‌తోపాటు అన్ని జిల్లా కార్యాలయాలు ఒకేచోట అందుబాటులో ఉండేలా సమీకృత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాత జిల్లాల్లో భవన వసతి లేని వాటితో కలిపి 26 జిల్లాల్లో సమీకృత భవనాల నిర్మాణాలకు రూ.843 కోట్లు విడుదల చేసింది. నిర్మాణాలు ప్రారంభమైనా నేటికి ఒక్కచోటా పూర్తికాలేదు. అద్దె భవనాలు, ఇతర శాఖలకు చెందిన భవనాల్లో కలెక్టరేట్లు, జిల్లా శాఖల కార్యాలయాలు కొనసాగుతున్నాయి. క్యాంపు కార్యాలయాలు సరైనవి లేకపోవడంతో కొందరు కలెక్టర్లు సమీపంలోని పట్టణాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో చాలా చోట్ల శాఖల కార్యాలయాలు విసిరేసినట్లుగా ఉన్నాయి. రెండు, మూడు కార్యాలయాల్లో పనులపై వచ్చే ప్రజలు తిరగలేక అలసిపోతున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.